TIRUMALA DARSHAN INFO & TRAVEL RESERVATION
February 11, 2025 at 11:35 PM
👆 తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి విహారం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 11: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించారు.
ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై ఏడు చుట్లు విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునిక్రిష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.