శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి
శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి
February 15, 2025 at 04:46 PM
🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀 🙏🌹🌹🌹🕉️🕉️🌹🌹🌹🙏 *శ్రీ గురుభ్యోనమః* *శ్రీ సాక్షి, లక్ష్మీ గణపతయే నమః* *శ్రీ లక్ష్మీదుర్గా ముళ్ళమాంబికాదేవ్యై నమః* *శ్రీరామ జయరామ జయజయరామ* *ఓం నమో భగవతే వాసుదేవాయ* 🙏🌹🌹🌹🕉️🌹🌹🌹🙏 *శ్రీమద్భాగవతం* 🙏🌹🌹🌹🙏🙏🌹🌹🌹🙏 *ప్రథమ స్కంధము* *రెండో భాగము* 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 *శౌనకాది ఋషులు సూతుని ఇంకా ఈ క్రింది విధంగా అడుగుతున్నారు-* *వర గోవింద కథా సుధా రస మహావర్షోరు ధారా పరం* *పరలం గాక బుధేంద్రచంద్ర! యితరోపాయానురక్తిం బ్రవి* *స్తర దుర్దాంత దురంత దుస్సహ జనుస్సంభావితానేక దు* *స్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం బాఱునే?* బుధేంద్రచంద్రా! అత్యంత విస్తరమూ, దుస్తరమూ, దుర్దాంతమూ, దురంతమూ, దుస్సహమూ అయి, అనేక జన్మలనుంచీ అతిశయించి, అంతటా వ్యాపించి, దాట శక్యంగానిదై, గంభీరమూ, కఠోరమూ అయిన కల్మషమనే కార్చిచ్చు మహాభయంకరంగా ఉన్నది. దీనిని ఆర్పివేయాలంటే శ్రేష్ఠమైన ఆనందనందనుని కథా సుధా రసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధారా పరంపరలు తప్ప వేరే ఉపాయం లేదు. 🙏🙏🌹🕉️ *హరినామ కథన దావానలజ్వాలచేఁ గాలవే ఘోరాఘ కాననములు!* *వైకుంఠదర్శన వాయు సంఘంబుచేఁ దొలఁగవే భవదుఃఖ తోయదములు!* *కమలనాభధ్యాన కంఠీరవంబుచేఁ గూలవే సంతాప కుంజరములు!* *నారాయణస్మరణ ప్రభాకరదీప్తిఁ దీఱవే షడ్వర్గ తిమిర తతులు!* *నలిన నయన భక్తినావచేఁ గాక సం, సారజలధి దాఁటి చనఁగ రాదు;* *వేయు నేల! మాకు విష్ణు ప్రభావంబుఁ, దెలుపవయ్య సూత! ధీసమేత!* ధీమంతుడవైన సూతమహర్షీ! భయంకర పాపాలనే అరణ్యాలను భస్మీభూతం చేయాలంటే, శ్రీహరి నామ సంకీర్తనలనే దావాగ్ని జ్వాలలే కావాలి. సంసార దుఃఖాలనే మేఘాలను పారద్రోలాలంటే, వాసుదేవ సందర్శనమనే వాయు సమూహమే కావాలి. పరితాపాలనే కరి' సమూహాన్ని సంహరించాలంటే, శ్రీమన్నారాయణ ధ్యానమనే సింహమే కావాలి. అరిషడ్వర్గమనే అంధకార సమూహాన్ని పటాపంచలు చేయాలంటే, హరి స్మరణమనే సూర్యకాంతి కావాలి. సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే, విష్ణుదేవుని భక్తి అనే నావనే ఎక్కాలి. వేయి మాటలెందుకు గాని మహానుభావా! మాకు శ్రీహరి మహాత్మ్యాన్ని వినిపించండి స్వామీ! 🙏🙏🌹🕉️ అంతేకాదు, అప్రమేయుడైన గోవిందుడు మాయామానుష శరీరం ధరించి బలరామునితో గూడి, మానవాతీతములైన మహావీర కృత్యాలు ఎన్నో చేశాడని విన్నాం. అవన్నీ మాకు వివరంగా సెలవీయండి! కలియుగం రాబోతున్నదని విని, ముందుగానే విష్ణుక్షేత్రమైన ఈ నైమిశారణ్యంలో దీర్ఘసత్రమనే యజ్ఞం ప్రారంభించి హరికథలు ఆలకించే అవకాశం కలిగించుచున్నాము. దైవం మాకు తోడుపడింది. మహా సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించే ప్రయాణీకులకు ఓడ నడిపే నావికుడు లభించినట్లుగా కలికాల కల్మషాలను పోకార్చాలనే కోరికతో నిరీక్షిస్తున్న మాకు నీవు దర్శనమిచ్చావు! *ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న అనంతరం, ఆధారహీనమై ఈ ధర్మం దిక్కుమాలి, చిక్కి, జీర్ణించి ఎవరిని ఆశ్రయించుతుందో వివరించవయ్యా మునీంద్రా!* 🙏🙏🌹🕉️ *సూత మహర్షి నారాయణ కథాప్రశంస చేయుట:-* ఈ విధంగా సద్గుణసాంద్రులైన శౌనకుడు మొదలైన మహామునులు అడుగగా, రోమహర్షుని కుమారుడు, సమస్త పురాణాలను చక్కగా సమగ్రంగా వివరించి చెప్పే నేర్పు కలవాడూ అయిన *"ఉగ్రశ్రవశుడు"* అనే సూతుడు ఈవిధంగా ఉపక్రమించాడు. *ఏ మహాత్ముడు సర్వభూతములయందును సమానభావంతో సంచరిస్తూంటాడో, ఏ మహాత్ముడు సర్వసంగపరిత్యాగియై, విరాగియై, మహాయోగియై, ఒంటరిగా అరణ్యంలో వెళ్తున్న సమయంలో, తండ్రియైన వ్యాసులవారు అత్యంత వాత్సల్యంతో "ఓ కుమారా!" అని పెద్దగా గొంతెత్తి పిలిచినపుడు అడవిలోని చెట్లన్నీ తన్మయత్వంలో "ఓయి ఓయ" అని ప్రత్యుత్తర రూపంగా ప్రతిధ్వనులు చేశాయో; అటువంటి సర్వభూతమయుడూ, తపోధనులలో అగ్రేసరుడూ, మహామనీషి అయిన మహానుభావునికి, శ్రీ శుకదేవునకు నమస్కారములు చేయుచున్నాను!" 🙏🙏🌹🕉️ కార్యకారణాలను వశీకరించుకొని అలరారే ఆత్మతత్త్వాన్నే పెద్దలు *'అధ్యాత్మం'* అంటారు. అటువంటి అధ్యాత్మ తత్త్వాన్ని సమగ్రంగా సాక్షాత్కరింపజేసే దీపం వంటిదీ, సకల వేదాల సారభూతమైనటువంటిదీ; అనన్యమూ, అసామాన్యమూ, మహాప్రభావ సంపన్నమూ, సమస్త పురాణ రహస్యమూ అయిన *శ్రీ మహాభాగవతాన్ని* సంసారమనే గాఢాంధకార సమూహాన్ని తరించగోరే విపన్నులకు ఉపదేశించిన అపార కృపా పయోనిధి, తపోనిధిని, విశేష వివేకజ్ఞానముల పెన్నిధిని, వేదవ్యాసులవారి పుత్రుణ్ణి, సుధీజన స్తుతి పాత్రుణ్ణి, శ్రీశుకుణ్ణి ఆసక్తితో ఆరాధిస్తున్నాను. 🙏🙏🌹🕉️ *నారాయణునకు నరునకు, భారతికిని మ్రొక్కి వ్యాసు పదములకు నమ* *స్కారము సేసి వచింతు ను, దార గ్రంథంబు దళిత తను బంధంబున్.* నరనారాయణులకు నమస్కారం చేసి, పలుకులతల్లి భారతీదేవికి మ్రొక్కి, వ్యాసులవారి పాదపద్మములకు ప్రణామం గావించి, జనన మరణ బంధాలను పటాపంచలు చేసే పవిత్ర గ్రంథాన్ని, *శ్రీమద్భాగవతాన్ని* పలుకుతున్నాను! 🙏🙏🌹🕉️ అని దేవతలకూ, గురువులకూ ప్రణామం చేసి, సూతుడు, శౌనకాదులతో ఇలా అన్నాడు- "మునీంద్రులారా! సమస్త విశ్వానికీ శ్రేయోదాయకమైన పరమార్థాన్ని చెప్పుము' అని మీరు నన్ను నన్ను అడిగారు. దేనివల్ల శ్రీకృష్ణుని విషయమైన ప్రశ్నలు అడగబడతాయో, దేనివల్ల అంతరాత్మకు ఆనందం చేకూరుతుందో, దేనివల్ల నిర్విరామమూ నిర్వ్యాజమూ అయిన హరిభక్తి ప్రాప్తిస్తుందో, అదే మానవులకు పరమధర్మం అవుతుంది. గోవిందునియందు సమర్పితమైన భక్తియోగం వల్ల వైరాగ్యమూ, ఆత్మజ్ఞానమూ లభిస్తాయి. ముకుందుని కథాసుధలకు దూరమైన ధర్మాలు సారహీనాలు. కైవల్యమే గమ్యస్థానమైన పరమధర్మానికీ ఫలం, కనబడుతూ వినబడుతూ ఉన్న ఈ ప్రాపంచిక సుఖం, సుఖం కాదు. ధర్మాన్ని అతిక్రమించని అర్థానికి ఫలం కామం కాదు. విషయభోగరూపమైన కామానికి ఫలం ఇంద్రియ సంతుష్టి కాదు. జీవించి ఉన్నంతవరకే కామానికి ప్రయోజనం. తత్త్వవిచారం ఉన్నవాడికి నిత్య నైమిత్తిక కర్మలవల్ల లభించే స్వర్గాది సుఖం నిరర్థకం. తత్త్వజిజ్ఞాసకూ, ధర్మ జిజ్ఞాసకూ అభేదాన్ని భావించినవారు ధర్మాన్నే తత్త్వమంటున్నారు. ఐతే, తత్త్వవేత్తలైనవారు అద్వయజ్ఞానమే తత్త్వమని తలుస్తారు. ఆ తత్త్వాన్ని ఔషనిషదులు *'బ్రహ్మం'* అంటున్నారు. హైరణ్యగర్భులు *'పరమాత్మ'* అంటున్నారు. సాత్త్వతులు *'భగవంతుడు'* అంటున్నారు. ఉపనిషత్తుల శ్రవణంచేత సంప్రాప్తమై, జ్ఞానంతోనూ, వైరాగ్యంతోనూ కూడిన భక్తి యందు ఆసక్తులైన మహాత్ములు జీవాత్మ యందే పరమాత్మను దర్శిస్తారు. ధర్మానికి భక్తియే ఫలం. వర్ణాశ్రమ ధర్మాలను అనుష్ఠించే మానవ ధర్మానికి భగవంతుడు సంతోషించుటయే ప్రయోజనం. తదేకాయత్తమైన చిత్తంతో నిత్యమూ పురుషోత్తముని లీలలు ఆకర్ణించుట, అభివర్ణించుట అవశ్య కర్తవ్యం. వివేకం గల మానవులు హరి స్మరణమనే కరవాలంతో అహంకార పూరితమైన కర్మబంధాన్ని కోసివేస్తారు. ముకుందునిమీద శ్రద్ధ ముక్తిని ప్రసాదిస్తుంది. పుణ్యతీర్థాలనూ, పుణ్యపురుషులను సేవించడం వల్లనే భగవంతుని కథలు వినాలనే ఉత్కంఠ ఉదయిస్తుంది. కర్మబంధాలను నిర్మూలించే కమలాక్షుని కథలను ఆసక్తితో ఆకర్ణించేవానికి మరేమీ రుచించవు. పుణ్యశ్రవణకీర్తనుడైన పురుషోత్తముడు తన కథలు ఆలకించే భక్తుల అంతరంగాలలో నివసించి, వారికి సర్వశుభాలూ సమకూర్చి, అశుభాలను పోకార్చుతాడు. అశుభ పరిహారంవల్ల భాగవత సేవ లభిస్తుంది, భాగవతసేవ వల్ల అచంచల భక్తి ప్రాప్తిస్తుంది. భక్తివల్ల రజస్తమో గుణాలతో చెలరేగిన కామ లోభాదులకు లొంగక, చిత్తం సత్త్వగుణాయత్తమై ప్రసన్నమౌతుంది. చిత్తం ప్రసన్నమైతే బంధాలు విడిపోతాయి. బంధరహితుడైన వానికి తత్త్వజ్ఞానం సిద్ధించి, ఈశ్వర దర్శనం లభిస్తుంది. ఈశ్వరదర్శనంవల్ల అజ్ఞానరూపమైన అహంకారం దూరమౌతుంది. అహంకారం దూరం కాగానే సమస్త సంశయాలూ పటాపంచలౌతాయి. సంశయాలు తొలగిపోగానే అశేషకర్మలూ నిశ్శేషంగా నశిస్తాయి. అందువల్లనే- *గురుమతులు తపసు లంతః, కరణంబుల శుద్ధి సేయ ఘనతరభక్తిన్* *హరియందు సమర్పింతురు, పరమానందమున భిన్నభవబంధనులై.* బుద్ధిమంతులైన తపోధనులు అంతరంగాలను శుద్ధి చేసుకోవటంకోసం సంసారబంధాలను త్రోసివేసి, అచంచలమైన అనురక్తితో కూడిన తమ భక్తినంతా పరమానందంతో భగవంతునికే సమర్పించుకుంటారు. *-సశేషం* యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్, తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే!! శివరామగోవింద నారాయణ మహదేవ, కృష్ణం వందే జగద్గురుమ్!! సర్వం శ్రీకృష్ణ భగవత్పాదారవిందార్పణమస్తు! సర్వేజనా సుఖినోభవంతు! శివాయ గురవే నమః!! *హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివశంకర!*
😢 1

Comments