Kavitha Kalvakuntla
February 8, 2025 at 11:43 AM
*అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధులు విడుదల చేయండి*
*పేదలను విద్యకు దూరం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం*
*కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు కానీ విద్యార్థుల చదువుకు బకాయిలు విడుదల చేయడానికి మాత్రం డబ్బులు లేవా*
*ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి తక్షణమే నిధులు విడుదల చేయాలి లేదంటే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఖరిని ఎండకట్టి ముక్కు పిండి నిధులను విడుదల చేయించుకుంటామని హెచ్చరిక*
*బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజం*
హైదరాబాద్ : అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధులు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు విదేశీ విద్యను దూరం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఫీజు రియంబర్స్ మెంట్ నిధులను కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత గళమెత్తారు.
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఎంపికై వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన విద్యార్థులతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. దాదాపు 200 మంది విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయాంలో సదుద్దేశంతో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థులకు కూడా విదేశీ విద్య అందాలన్నది కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం ఉద్దేశాలకు తూట్లు పొడుస్తున్నదని ధ్వజమెత్తారు.
రెండో విడత నిధులను ఎందుకు విడుదల చేయడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులను ప్రభుత్వం ఎందుకు చులకనగా చూస్తున్నదని నిలదీశారు. స్కాలర్ షిప్ అందక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, దానికోసం వేచి చూస్తున్నారని పేర్కొన్నారు.
కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు కానీ విద్యార్థుల చదువుకు బకాయిలు విడుదల చేయడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ మాత్రమే కాకుండా ఇతర స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేయకపోవడం శోచనీయమని విమర్శించారు.
కాబట్టి తక్షణమే ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి తక్షణమే నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఖరిని ఎండకట్టి ముక్కు పిండి నిధులను విడుదల చేయించుకుంటామని హెచ్చరించారు.
👍
🙏
❤️
✊
💐
24