
TIRUMALA DARSHAN INFO & TRAVEL RESERVATION
February 23, 2025 at 05:20 AM
👆 హనుమంత వాహనంపై శ్రీ కోదండరామస్వామి వారి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి కటాక్షం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 23: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం 8 గంటలకు శ్రీనివాసుడు వేంకటరాముడై హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం స్వామివారు వరదహస్తం దాల్చిన కల్యాణ వేంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని, వాహనాన్ని అధిష్టించిన కల్యాణ వేంకటరాముడిని దర్శించడం వల్ల భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి.
అనంతరం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం వైభవంగా జరుగనుంది.
వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధన శేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

🙏
❤️
7