TIRUMALA DARSHAN  INFO & TRAVEL RESERVATION
TIRUMALA DARSHAN INFO & TRAVEL RESERVATION
June 9, 2025 at 11:26 AM
భక్తజన సంమోహనం మధ్య వైభవంగా గోవిందుడి రథోత్సవం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.15 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో తత్త్వజ్ఞానమిదే. అనంతరం ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి, న‌మ్మాళ్వార్ల‌ వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌సేవ జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ర‌థోత్స‌వంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఎఫ్ఎ అండ్‌ సిఏవో శ్రీ బాలాజి, ఎస్ ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఇత‌ర ఇంజినీరింగ్ పలుశాఖల అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు. జూన్ 10న చక్రస్నానం : శ్రీ గోవింద‌రాజ‌స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 10న మంగళ వారం ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు (ఆళ్వార్ తీర్థం నందు) స్నపన తిరుమంజనం, చక్రస్నానం వైభవంగా జరుగనుంది. సా. 4.30 గంటలకు స్వామి, అమ్మ‌వార్లు బంగారు తిరుచ్చిపై, చ‌క్ర‌తాళ్వార్ పల్లకీలో ఊరేగింపుగా పిఆర్‌.తోట నుండి సాయంత్రం 6 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 07.00 గం.లకు శ్రీవారు ఉభయ నాంచారులతో బంగారు తిరుచ్చినందు చక్రత్తాళ్వార్ లతో నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు జరుగనుంది. అనంతరం రాత్రి 8.40 - 9.30 గం.ల మధ్య ధ్వజారోహణం మరియు ఆస్థానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. --------------------------- టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Comments