
SACHIVALAYAM
June 19, 2025 at 03:56 PM
* *రెవిన్యూ వ్యవస్థ లో వచ్చిన మార్పులు (1984–2019)*
1.*1984: రెడ్డి –కరణం వ్యవస్థ రద్దు*
ప్రభుత్వం వంశపారంపర్యంగా వస్తున్న రెడ్డి -కరణం వ్యవస్థను తొలగించింది.
గ్రామ పరిపాలనలో లోటును పూరించేందుకు APPSC ద్వారా గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్లు గ్రామ సహాయకులుగా నియమితులయ్యారు.
వీరికి పని భారం ఎక్కువగా ఉండటం, అనుభవ లోపం వలన పాత అధికారుల సహాయం అవసరమైంది.
తొలగించబడిన పాత అధికారులు హైకోర్టును ఆశ్రయించగా, 10వ తరగతి పాస్ అయినవారిని విలేజ్ అసిస్టెంట్లుగా నియమించాలనే ఆదేశాలు వచ్చాయి.
గ్రూప్-4 అసిస్టెంట్లను సూపర్‌న్యూమరీ జూనియర్ అసిస్టెంట్లుగా మార్చారు.
7వ తరగతి అర్హత ఉన్న వారిని తొలగించినా, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వారినీ నియమించాలని ఆదేశించింది
2.*1992: VAO వ్యవస్థ ప్రారంభం*
1992 ఫిబ్రవరి నుండి గ్రామ పరిపాలనాధికారులు (VAOలు) వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
-10వ తరగతి పాస్ – పూర్తి కాలిక VAOలు
-7వ తరగతి పాస్ – అంశ కాలిక VAOలు
3.*పంచాయతీరాజ్ వ్యవస్థ - మూడంచెల పద్ధతి*
బలవంతరాయ్ మెహతా కమిటీ (1957) సిఫార్సుల ప్రకారం, 1959 నవంబర్ 1 నుండి మూడంచెల పద్ధతి అమలులోకి వచ్చింది.
అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు పంచాయతీరాజ్ వ్యవస్థను అప్పటివరకు కొనసాగుతున్న రెవెన్యూ వ్యవస్థను అనుసరించేలా (Coterminus) రూపొందించారు. ఉదాహరణకు:
జిల్లా పరిషత్తు → జిల్లా స్థాయిలో
పంచాయతీ సమితి → తాలూకా స్థాయిలో
గ్రామపంచాయతీ → కొన్ని రెవెన్యూ గ్రామాల సమూహంగా.
ఈ విధంగా గ్రామీణ ప్రజలకు సమీపంలోనే పాలనా మరియు అభివృద్ధి వ్యవస్థను అందుబాటులోకి తేచి, వారి చొరవతో స్వీయ పరిపాలనకు అవకాశాన్ని కల్పించారు.
4.*మండల వ్యవస్థ – ఆవిర్భావం*
1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు పాలనలో పురాతన తాలూకా వ్యవస్థను రద్దు చేసి, ప్రజలకు పరిపాలనను మరింత సులభంగా అందించేందుకు మండల వ్యవస్థను తీసుకువచ్చారు.
తాలూకాలను విభజించి, ఒక్కో తాలూకా నుండి 4 లేదా 5 మండలాలు రూపొందించబడ్డాయి. ఈ మండలాల్లో ప్రతి ఒక్కటి సుమారు 12 నుండి 20 గ్రామాలు, మరియు 25,000 నుంచి 55,000 జనాభా కలిగి ఉండేలా ఏర్పాటు చేశారు.
ప్రతి మండలానికి ఒక మండల రెవెన్యూ అధికారి (MRO)గా నియమితులయ్యారు.
ఈ మండల వ్యవస్థను *1985 మే 25న* ప్రవేశపెట్టారు. **తాలూకాలు, ఫిర్కాలను* రద్దు చేసి MROనియామకం ద్వారా పరిపాలన ప్రజలకు చేరువైంది.
5.*భూమిశిస్తు రద్దు*
1986 లో భూమిశిస్తు రద్దు చేశారు. అప్పటివరకు ప్రతి పంట సీజన్‌కి భూమిపై శిస్తుతో పాటు 10% స్థానిక పన్ను (Local Cess) వసూలు చేసే వారు. శిస్తు రద్దుకు చట్టబద్ధత ఇవ్వడంతో స్థానిక సెస్సు కూడా తొలగింది.
అయితే, ప్రభుత్వ నీటితో సాగు చేసే భూములకు మాత్రం ఒక్క పంటకు రూ.100 నీటి తీరువా(water tax) వసూలు చేస్తున్నారు.
భూమిశిస్తు ఉన్నప్పుడు రైతులు రికార్డులు తరచూ చూసుకునే అవకాశం ఉండేది. శిస్తు రద్దైన తర్వాత రికార్డుల పరిశీలన తగ్గిపోయింది.
6.*2002: పంచాయతీ కార్యదర్శుల ఏర్పాటు*
గ్రామ అభివృద్ధి అధికారులు, రెవెన్యూ అధికారులు,కార్యనిర్వాహకుల్ని కలిపి పంచాయతీ కార్యదర్శులుగా నియమించారు.
వీరు MPDOలకు అనుబంధంగా పనిచేయడం, రెవెన్యూ విభాగానికి పూర్తిగా సేవలివ్వకపోవడం వల్ల అస్పష్టత ఏర్పడింది.
గ్రామాల వారీగా రెవెన్యూ రికార్డుల విభజన కూడా సమస్యగా మారింది.
7.*2004: గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ*
గ్రామ సేవకుల పోరాటంతో, 2008 జూలైలో పాత గ్రామ పరిపాలనాధికారులను పంచాయతీ కార్యదర్శుల నుండి వేరు చేసిగ్రామ రెవెన్యూ అధికారులుగా (VROలు) నియమించారు.
8.*పదాల మార్పు*
గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా, గ్రామ సేవకుల హోదాను **గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA)**గా మార్చారు. అలాగే, "MRO" అనే పేరు రాష్ట్రం దాటితే ఎవరూ గుర్తించలేక పోతున్నారని గమనించి మిగిలిన రాష్ట్రాలలో ఉన్నవిధంగా *తహసిల్దార్* గా మార్చారు.
9.*గ్రామ సచివాలయాల వ్యవస్థ*
గ్రామ సచివాలయ వ్యవస్థను 2019లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ వ్యవస్థలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు (VROలు) మరియు విలేజ్ సర్వేయర్లు (VSలు) జీతం MPDO కార్యాలయం వద్ద తీసుకుంటూ, కర్తవ్యాలను తహసీల్దార్ ఆఫీసులో నిర్వర్తించాల్సి రావడం వల్ల వారు రెండు విభాగాలకు మధ్య చిక్కుల్లో పడిపోయారు. దీనివల్ల రెవెన్యూను నియంత్రించే తహసీల్దార్ మరియు సచివాలయ వ్యవస్థను నిర్వహించే MPDO అధికారుల మధ్య అవగాహనలో లోపం ఏర్పడింది. ఈ పరస్పర విభేదాల కారణంగా VROలు మరియు VSల పరిస్థితి ‘అడ్డచెక్కలో పోకలు’ అన్నట్లు అయిపోయింది.