Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
February 12, 2025 at 03:37 AM
నేడు (ఫిబ్రవరి 12) ప్రముఖ పరిణామ వాద సిద్ధాంత కర్త, ప్రాకృతిక వాది, జియాలజిస్టు, జీవ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ జయంతి ఆయన గూర్చి సభ్యుడు నాయకుడు తప్పనిసరిగా పూర్తిగా చదవాలని కోరుతున్నాము. మన బ్యానర్ పై ఆయన ఫోటో శాశ్వతంగా ఉంటుంది గమనించారా! చార్లెస్ రాబర్ట్ డార్విన్ ( Charles Robert Darwin FRS FRGS FLS FZS JP ) ( 12 ఫిబ్రవరి 1809 – 19 ఏప్రిల్ 1882 ) ఇంగ్లాండుకు చెందిన ప్రముఖ ప్రకృతివాది (Naturalist), భూగర్భ శాస్త్రవేత్త, జీవ శాస్త్రజ్ఞుడు. ఈయన భూమిపై జీవజాలం ఏ విధంగా పరిణామక్రమం చెందినది అనే విషయంపై పరిశోధనలు చేసి, జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీనిని డార్వినిజం ( Darwinism ) అని అంటారు. ప్రకృతిలో జీవజాతులు వేటికవే ఏక కాలంలో రూపొందినట్లు ఎంతో కాలం నుండి నమ్ముతూ వస్తున్న ప్రజానీకానికి - అదంతా వాస్తవం కాదని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడతాయని, ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుందని మొట్టమొదటి సారిగా వివరించినవాడు చార్లెస్ డార్విన్. ఆయన మానవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా వర్ణించబడ్డాడు. డార్విన్ యొక్క శాస్త్రీయ ఆవిష్కరణ జీవ శాస్త్రాల యొక్క ఏకీకృత సిద్ధాంతం. ఇది జీవ వైవిధ్యాన్ని వివరిస్తుంది . డార్విన్‌ 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లండులోని ష్రూస్‌బరీలో జన్మించాడు. వైద్యుడైన తండ్రి అన్ని సదుపాయాలూ సమకూర్చినా చదువులో రాణించలేదు. అతను చిన్ననాటి నుండి కీటకాలను, ఖనిజాలను సేకరిస్తూ రసాయనిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. 16 యేండ్ల వయస్సులో వైద్య విద్యను చదవటం కోసం ఈయనను ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయంలో చేర్పించారు. కాని డార్విన్ వైద్య విద్యలో ఆసక్తి చూపలేదు. ఏదో ఒక డిగ్రీ సంపాదించాలనే తండ్రి కోరికపై కేంబ్రిడ్జ్‌లో మత శాస్త్ర (Theology) అధ్యయనంలో చేరినా అక్కడా అంతే. అక్కడి బోటనీ ప్రొఫెసర్‌ జాన్ స్టీవెన్స్ హెన్స్లో సలహా మేరకు బీగిల్‌ ( HMS Beagle ) అనే నౌకలో దక్షిణ అమెరికా కోస్తా పర్యటనకు బయలుదేరాడు. ఆ నౌకలో నేచురలిస్ట్ గా ప్రయాణం చేసే అవకాశం డార్విన్ కి లభించింది. ఆ నౌకాయానంలో డార్విన్‌ అనేక ప్రాంతాల్లో మొక్కలు, రాళ్లు, శిలాజాలు, కీటకాలు, జంతువులను పరిశీలించి చాలా నమూనాలను సేకరించి స్వదేశానికి పంపుతూ వచ్చాడు. అయిదేళ్ళపాటు కొనసాగిన యీ సముద్ర యానంలో డార్విన్ ఎన్నో రకాల ప్రదేశాలను, జంతువులను పరిశీలించాడు. ప్రకృతికి, జీవరాశికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి తీవ్రంగా ఆలోచించాడు. గాలా పగోస్ దీవులలో ఏ ఇతర ప్రదేశంలోనూ కనిపించని అనేక విచిత్ర జీవజాతులు డార్విన్ కి కనిపించాయి. ముఖ్యంగా అతనికి ఆసక్తి కలిగించినవి పిచ్చుకలను పోలిన ఫించెస్ ( finches ) అనబడే పక్షులు. వాటిలో పద్నాలుగు రకాల పక్షులను గమనించాడు. 1831 లో ప్రారంభమైన యాత్ర ఐదేళ్లు కొనసాగింది. ఆ కాలంలో చేసిన పరిశీలనల ఆధారంగానే జీవజాతుల పరిణామక్రమంపై పుస్తకం రాశాడు. జీవులు ప్రకృతి వరణం ( Natural selection ) ద్వారా పరిణామం చెందుతాయనే సిద్ధాంతాన్ని డార్విన్ ప్రతిపాదించాడు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం పరిణామం అనేది నెమ్మదిగా జరిగే నిరంతర ప్రక్రియ. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం ( Theory of evolution by natural selection) భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. మలయ్ ఆర్కిపెలాగో లో అధ్యయనాలు చేసిన ఆంగ్ల జీవ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ ( Alfred Russell Wallace ) 1858 జూన్ లో డార్విన్ కి పంపిన సిద్ధాంత వ్యాసం డార్విన్ వ్యాసం ఒకే విధంగా ఉన్నాయి. డార్విన్ తన రచనను, వాలెస్ పంపిన వ్యాసాన్ని లిన్నేయన్ సొసైటీ జర్నల్‌కు అందచేశాడు. 1858 జూలై 1న శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. జీవ పరిణామంపై ఇరువురు రాసిన వ్యాసాలు పరిశీలించారు. 1844లో డార్విన్ మొదలు పెట్టగా, వాలెస్ 1858లో రాశాడు. కనుక డార్విన్ ముందు రాసినట్టు నిర్ధారించారు. 1859 లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన "ది ఆరిజన్ ఆఫ్ స్పీసిస్ బై మీన్స్ ఆఫ్ నేచురల్ సెలక్షన్" (On the Origin of Species by Means of Natural Selection) పుస్తకాన్ని చార్లెస్ డార్విన్ వెలువరించాడు. దానిని అమ్మకానికి పెట్టిన రోజునే ప్రచురించిన 1250 కాపీలు అమ్ముడు పోయాయి. డార్విన్ ఆలోచనలను ప్రభావితం చేసిన గ్రంథాలు: స్కాటిష్ శాస్త్రవేత్త జేమ్స్ హట్టన్ రాసిన 'థియరీ ఆఫ్ అర్త్'; బ్రిటిష్ ఆర్థిక శాస్త్రవేత్త టి. ఆర్. మాల్తస్ రాసిన 'ఎస్సే ఆన్ పాపులేషన్'; సర్ చార్లెస్ లయల్ రచించిన 'ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజి' ప్రకృతి వరణ సిద్ధాంతం (Theory of Natural selection): ప్రకృతి వరణం పరిణామం యొక్క కేంద్ర భావన. ఇది ఒక సంక్లిష్ట ప్రక్రియ. డార్విన్ సెలెక్టివ్ బ్రీడింగ్ తో సారూప్యతగా ఈ పేరును ఎంచుకున్నాడు. ప్రకృతి వరణం ప్రక్రియలో అనుకూలమైన లక్షణాలతో గల జీవులు ఎక్కువగా పునరుత్పత్తి చేసే అవకాశం ఉంది. అలా చేయడం ద్వారా జీవులు ఈ లక్షణాలను తర్వాతి తరానికి అందజేస్తాయి. కాలక్రమేణా ఈ ప్రక్రియ జీవులు తమ పరిసరాలకు అనుగుణంగా మారటానికి అనుమతిస్తుంది. ఎందుకంటే జనాభాలో అనుకూలమైన లక్షణాలు గల జన్యుల ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అధికోత్పత్తి: ప్రతీ జీవి సంతానోత్పత్తి ద్వారా తన జనాభాను అత్యధిక ప్రమాణంలో పెంచుకొంటుంది. ఉదాహరణకు సాల్మన్ చేప ఒకేసారి 28 మిలియన్ గుడ్లను పెడుతుంది. జనాభాలో స్థిరత్వం: అయినా జనాభా పెరిగే పద్ధతిలో ఆ జనాభాకు కావలిసిన నిష్పత్తిలో ఆహారం, ఇతర సౌకర్యాలు పెరగటం లేదు. కాబట్టి ప్రతి జాతి జనాభా స్థిరంగా ఉంటోంది. మనుగడ కోసం పోరాటం: డార్విన్ ప్రతిపాదన ప్రకారం చాలా జీవులు మనుగడ కోసం జరిపే పోరాటంలో మరణిస్తూ ఉంటాయి. జీవజాతుల మధ్య సంఘర్షణ ఉంటుంది. సజాతి సంఘర్షణ, విజాతి సంఘర్షణ, ప్రకృతితో సంఘర్షణ. వైవిధ్యాలు: ఒక జాతి జీవుల మధ్య ఉండే వ్యత్యాసాలను వైవిధ్యాలు అంటారు. ఉపయోగకర వైవిధ్యాలు మనుగడ కోసం పోరాటంలో తోడ్పడి తర్వాత తరానికి సంక్రమిస్తాయి. ప్రకృతి వరణం: ఉపయుక్త వైవిధ్యాలు గల జీవులు అధిక ప్రత్యుత్పత్తి జరపగల శక్తి కలిగి ఉండి ఫలవంతమైన సంతానాన్ని ఏర్పరుస్తాయి. ఇలాంటి జీవులు ఉత్తమ యోగ్యత గల జీవులు ( fittest organisms ). ఇవి మాత్రమే మనుగడ సాగిస్తాయి. ఈ దృగ్విషయాన్ని యోగ్యతమాల సార్ధక జీవనం ( survival of the fittest ) అంటారు. అనుకూల లక్షణాలను ప్రకృతి ఎన్నిక చేస్తుంది. జీవులు అనుకూల లక్షణాలను తమ సంతానానికి సంక్రమింప చేస్తాయి. అనుకూల లక్షణాలు లేని జీవులు నశిస్తాయి. ఈ ప్రక్రియనే ప్రకృతి వరణం అంటాము. జాతుల ఉత్పత్తి: మనుగడ కోసం పోరాటం ఫలితంగా ఏర్పడిన యోగ్యతమాల సార్ధక జీవనం ద్వారానే భావితరాల జీవులు మరింతగా వాతావరణానికి అనుకూలంగా మారుతాయని డార్విన్ భావించాడు. ప్రకృతి ద్వారా ఎన్నుకోబడిన అన్ని వైవిధ్యాలు ఒక తరం నుంచి మరొక తరంలోకి సంచితమవుతాయి‌. ఈ విధమైన సంచితం దీర్ఘకాలంలో ఒక జీవిలో అనేక మార్పులను తీసుకొస్తుంది. చివరకు ఒక కొత్త జాతి ఏర్పడుతుంది. ఇది సంక్షిప్తంగా డార్విన్ పరిణామ వాదం. చార్లెస్ డార్విన్ స్వంత దేశమైన బ్రిటన్ లో డార్వినిజం ఎన్నో ప్రశంశలు అందుకుంది. డార్విన్ ఒక అజ్ఞేయ వాది. రచనలు: 1868 లో డార్విన్ "ది వేరియేషన్ ఆఫ్ ఆనిమల్స్ అండ్ ప్లాంట్స్ అండర్ డొమెస్టికేషన్" అనే పుస్తకాన్ని ప్రచురించాడు. "ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్" "డిసెంట్ ఆఫ్ మ్యాన్ అండ్ సెలెక్షన్ ఇన్ రిలేషన్ టు సెక్స్", "ది ఫార్మేషన్ ఆఫ్ వెజిటబుల్ మౌల్డ్ థ్రూ ది ఏక్షన్ ఆఫ్ వర్మ్స్" వంటివి ఈయన రాసిన మరికొన్ని పుస్తకాలు. అవార్డులు: FRS (1839) రాయల్ మెడల్ (1853) వోలాస్టన్ మెడల్ (1859) కోప్లీ మెడల్ (1864) బాలి పతకం (1879) పోర్ లే మెరైట్ , ప్రష్యా (1867) డాక్టర్ ఆఫ్ లాస్ (గౌరవ), కేంబ్రిడ్జ్ (1877) అస్తమయం: ఈయన 74 యేండ్ల వయస్సులో చనిపోయాడు. సర్ ఐజాక్ న్యూటన్ సమాధి దగ్గరే ఈయన కూడా సమాధి చేయబడ్డాడు. మొత్తం చదివినందుకు అభినందనలు. మనలాంటి వారికి షేర్ చేయండి. మన సంఘంలో ఎవరైనా సభ్యులుగా చేరాలని ఆసక్తితో ఉంటే వారి పేరు వివరాలు మనకు 7013160831 నెంబర్ కి వాట్సప్ చేయమని కోరగలరు. ఇట్లు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఈ వ్యాసం ఆన్ లైన్ నుండి సింహాద్రి నాయుడు టీచర్ సేకరించినది
👍 ❤️ 🙏 21

Comments