వైద్య నిలయం
February 14, 2025 at 12:31 AM
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸 *సంతృప్తిగా... సంతోషంగా!* *మనిషికి ఉన్నది తృప్తి, పశువుకు తిన్నది తృప్తి* అని నానుడి. ఉండటం అనేదాన్ని ఆస్తిపాస్తులకు పరిమితం చేయకుండా, మానవత్వానికి జోడించి ఆలోచిస్తే తృప్తి అన్న మాట అర్థవంతమవుతుంది. కుటుంబ పోషణకు, నిత్యావసరాలకు సరిపోయేంత సంపదతో మనిషి తృప్తి పడగలిగితే అదే మనశ్శాంతి. తీర్చుకున్న కొద్దీ పెరిగే కొత్త కోరికల కుప్ప మనసు. దాన్ని గాడిలో పెట్టగలిగే మంత్రదండం బుద్ధి. ఆర్జించడం తప్పు కాదు. ఊటబావిలో ఊరే నీరల్లే ఉబికి వచ్చే కోరికలు తీర్చుకోవడం కోసమే ఆర్జించడం తప్పు. *పారమార్థిక చింతనను పక్కనపెట్టి, కేవలం ఆర్జించడమే ధ్యేయంగా, ఆశలు తీర్చుకోవడమే పరమార్థంగా బతికేవారికి చివరకు మిగిలేది అసంతృప్తే*. ఎందుకంటే, కష్టించి ఆర్జించిన సంపదను ధారపోసిన తరవాత, దాన్ని అనుభవించే వారసులనుంచి ఆశించిన ప్రేమ లభించడం ప్రశ్నార్ధకమే కనుక. తృప్తి ఎక్కడ ఉంటుందో చూపించే అక్షరజ్యోతులివి. తృప్తి అనేది ఒక మానసిక భావన. తామస ఆలోచనలకు తావివ్వని మనసు తేలికగా తృప్తి చెందుతుంది. https://t.me/vaidayanilayamNaveen పాండవులు అయిదూళ్లతో తృప్తి పడతారని చెప్పిన కృష్ణుణ్ని నమ్మని అహంకారి దుర్యోధనుడు. అతగాడి మనసును అభద్రతా భావం, అసూయ లొంగదీసుకుని అసంతృప్తికి, తద్వారా కురుక్షేత్రానికి దారితీశాయి. తృప్తి లేకపోవడం వల్లనే మకరందాన్ని అపరిమితంగా తాగుతూ పొద్దెరగని తుమ్మెద, కలువ ముడుచుకోవడాన్ని గమనించక, ఊపిరాడక మరణిస్తుంది. తృప్తిలేని వాడికి ఏది దొరికినా, ఎంత దొరికినా సంతోషం కలగదు. జీవితం ఆసాంతం అశాంతితోనే గడుస్తుంది. ఓ చలిరాత్రి వీధిలో పడుకున్న అభాగ్యుడికి దుప్పటి కప్పి వచ్చినప్పుడో, వైద్యం అందక అలమటిస్తున్న రోగికి సాయం అందించినప్పుడో, నిరుపేద విద్యార్థికి ఫీజు కట్టినప్పుడో, ఆ సాయం పొందినవారికన్నా, చేసినవారికి కలిగే తృప్తికి కొలమానం ఉండదు. ఉన్నదాంతో తృప్తి పడినప్పుడే ప్రశాంతంగా ఉండగలం. ఆ ప్రశాంతత లభించిన మనిషిని అనారోగ్యం త్వరగా దరిచేరదు. ఆయుష్షూ పెరుగుతుంది. ప్రకృతిలో పక్షులనూ, జంతువులనూ ఎప్పుడో తప్ప వ్యాధులు సోకి మరణించడం చూడము. మనిషి కూడా అంతే. అత్యాశలకు పోకుండా, ఈర్ష్యాసూయలకు లోనుకాకుండా మనగలిగితే తృప్తిగా జీవించి, తృప్తిగా పరమాత్మను చేరుకోవచ్చు. అయితే, విజ్ఞాన సముపార్జన విషయంలో తృప్తి ఉండకూడదు. నిరంతరం నేర్చుకోవాలనే తపనా, నేర్చిన జ్ఞానాన్ని పదుగురికీ పంచాలన్న సదుద్దేశం ఉత్తమ లక్షణాలు. *కొత్త విషయాలు తెలుసుకోవడం, సజ్జనుల సాంగత్యం కోసం ప్రయత్నించడం మానవులకు ఎంతో మేలు చేస్తుంది*. ధన్యవాదములు 🙏 *మీ నవీన్ నడిమింటి* *విశాఖపట్నం* 🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* *సర్వేజనా సుఖినోభవంతు* *లోకా సమస్త సుఖినోభవంతు* *శుభం భూయాత్* *ఓం శాంతి శాంతి శాంతిః* *స్వస్తి* 🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸

Comments