🪷 తిరుమల వైభవం 🪷 ( Tirumala vaibhavam Telugu )
March 1, 2025 at 03:54 AM
🔔 *అనగనగా...* 🔔
*మంత్రి పదవి లభిస్తే కొండ మీది హనుమను దర్శించు కుంటానని మొక్కు కున్నాడు రాయుడు. రాయుడికి మంత్రి పదవి లభించింది. కొండమీది హనుమంతుడిని దర్శించుకొని కొండకింద వున్న తిక్కశంకరయ్య హోటల్ లో భోజనం చేద్దామని సిబ్బందితో సహా వెళ్ళాడు.*
*అక్కడి హోటల్ని చూసి విస్తుపోయాడు. రెండు అంతస్తులతో వైభవోపేతంగా వుంది, చాలా కార్లు నిలిచి వున్నాయి. అక్కడ జనం కూడా చాలా మందే వున్నారు.*
*30 ఏళ్ళ క్రితం అక్కడ చిన్న పెంకుటింట్లో వుండేది ఆ హోటల్. ఆ హోటల్ని శంకరయ్య అనే ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు నడిపేవాడు. అరటి ఆకుల్లో భోజనం పెట్టేవాడు. రెండుకూరలు, రెండు పచ్చళ్ళు, పప్పు పులుసు అన్నీ ఉండేవి మంచి ఘుమ ఘుమ లాడే నెయ్యి కూడా వేసేవాడు. గడ్డ పెరుగు కూడా వేసేవాడు. ‘హాయిగా తినండి. నిదానంగా తినండి తొందరేమీ లేదు’ అని అంటూ అన్ని బల్లల దగ్గరికీ బెత్తం పట్టుకొని తిరిగేవాడు. ‘ఎంత కావాలో అంతే పెట్టించుకోండి ఆహారాన్ని వృధా చెయ్యకండి!’ అని హెచ్చరిస్తూ తిరిగేవాడు. ఎవరైనా పారేస్తే చెయ్యి చాపమని బెత్తంతో కొట్టేవాడు. ఎంత పెద్దవాళ్ళయినా, చిన్నవాళ్ళయినా పారేస్తే దెబ్బలు తినాల్సిందే.*
*బళ్ళో పిల్లలు తప్పు చేస్తే ఎలా కొట్టే వాడో ఇక్కడా అంతే. అక్కడ వేరే మంచి హోటల్ లేకపోవడంతో అక్కడ పదార్థాలు చాలా రుచిగా వుండడంతో అందరూ అక్కడికే వచ్చేవాళ్ళు. అందరూ అతన్ని తిక్కశంకరయ్య అని పిలిచేవారు.*
*రాయుడు అప్పట్లో రాజకీయాల్లోకి రాలేదు. పెద్ద వ్యాపారవేత్తగా డబ్బు బాగానే గడించాడు. అప్పట్లో తనకు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తే కొండ మీది హనుమను దర్శించుకుంటానని మొక్కుకొని లాభాలు బాగా రాగానే కొండమీది స్వామిని దర్శించుకొని ఆ హోటల్ లో భోజనం చేద్దామని వచ్చాడు.*
*శంకరయ్య ఎంత చెప్తున్నా వినకుండా అది వెయ్యండి యిది వెయ్యండి. అని అన్నీ వేయించుకొని తిన్నంత తిని సగం పారవేసి చెయ్యి కడుక్కున్నాడు. అది చూసి శంకరయ్యకు కోపం నసాళానికి అంటింది.*
*బెత్తం పట్టుకొని రాయుడి దగ్గరకు వచ్చి చేయి చాచమన్నాడు.*
*చుట్టూ వున్నవాళ్ళు ‘అతను ఎవరనుకున్నావు? పెద్ద జమీందారు! అయినా డబ్బు చెల్లిస్తున్నాం మా యిష్ట మొచ్చినంత తింటాం పారేస్తాం నీకేమిటి?’ అన్నారు అతని వెంట వచ్చినవాళ్ళు.*
*”మీరు డబ్బు చెల్లించినా సరే పారెయ్యడానికి మీకు హక్కు లేదు. ఎన్ని కోట్లు డబ్బు వున్నా ఆకలేస్తే డబ్బు తింటారా? మీకందరికీ కూడా సామాజిక బాధ్యత వుండాలి, బరువూ బాధ్యత తెలుసుకొని నడుచుకోవాలి, అన్నాన్ని పారేస్తే మీకు ఎప్పుడయినా ఆకలి వేసినప్పుడు అన్నం దొరకదు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం!’ దాన్ని వృధా చెయ్యకూడదు. యిలా వ్యర్థం చేస్తే మీ తరువాతి తరాలవారికి తినడానికి తిండి దొరకదు అన్నాడు.*
*రాయుడు నవ్వుతూ చెయ్యి జాచాడు. శంకరయ్య బెత్తం తో గట్టిగా కొట్టాడు.*
*అప్పటి సంగతి రాయుడికి జ్ఞాపకం వచ్చింది. తర్వాత ఎమ్.ఎల్.ఏ గా నిలబడి గెలిచాడు. ఇప్పుడు మంత్రి పదవి లభించింది. ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ ఆ హోటల్ లో ప్రవేశించాడు తన అనుచరులతో పాటు.*
*శంకరయ్యగారు చనిపోయినట్టున్నాడు, అతని ఫోటో అక్కడ బల్ల మీద పెట్టివుంది పూలమాల వేసి. ఆ ఫోటో వెనక అతని బెత్తం కూడా వుంది బూజు పట్టి. మంత్రిగారు వచ్చారని అక్కడి యజమాని శంకరయ్య కొడుకు విఘ్నేశ్వరయ్య పరిగెత్తుకుంటూ వచ్చి తెగ హడావుడి చేసి తన మనుషులతో చెప్పి రకరకాల పదార్థాలను వద్దంటున్నా వినకుండా వేయించాడు. అందరూ తినలేక చాలా పారవేశారు. అది చూసి రాయుడికి చాలా బాధ కలిగింది. తట్టుకోలేక పోయాడు. శంకరయ్య ఫోటో వెనక వున్న బెత్తం చేతిలోకి తీసుకున్నాడు. కోపంగా విఘ్నేశ్వ రయ్య దగ్గరికి వెళ్లి “యింత అతి మర్యాద చేసే అవసరం లేదు. ముందు నీ బాధ్యత తెలుసుకో! ఎంత భోజనం వృధా అయింది చూడు!” అని అతన్ని చెయ్యి చాచమని చితక బాదాడు.*
*ఆ బూజు పట్టిన బెత్తాన్నిముద్దు పెట్టుకొని ఆ బెత్తాన్ని ఫోటో వెనకాల పెట్టి బయటకు నడిచాడు.*
*ఈ కాలంలో అటువంటి నేతలు వున్నారా? వుంటే వారికి పాద నమస్కారం చెయ్యాల్సిందే.*
*మనమంతా కూడా ఎక్కడయినా సరే తినే పదార్థాలను వృధా చెయ్యకూడదు. ఇప్పటికీ మా యింట్లో మా పిల్లలతో సహా దీన్ని పాటిస్తాము.*
*మరి మీరు….?*✍️
(నవ్య వార పత్రిక సౌజన్యం తో)
*’అన్నం పరబ్రహ్మ స్వరూపం!’ దాన్ని పారవేస్తే మరుజన్మలో మనకు "అన్నమో రామచంద్రా" అని ఏడ్చే గతి పడుతుందని పెద్దలు చెప్తారు*.
https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
🙏
👍
❤️
70