Telugu News International - TNILIVE
February 19, 2025 at 02:51 AM
సికింద్రాబాద్ నుంచి కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్ మీదుగా దానాపూర్ వెళ్లాల్సిన 12791 నంబరు రైలును రైల్వేబోర్డు రద్దు చేసింది. ఇది బుధవారం ఉదయం 9.25 గంటలకు బయల్దేరాల్సి ఉండగా మంగళవారం రాత్రి 7.35 గంటలకు.. అంటే దాదాపు 14 గంటల ముందు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. 21న దానాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు రావాల్సిన 12792 నంబరు రైలునూ ‘ఆపరేషనల్’ కారణంతో రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దాదాపు 1500 మంది ప్రయాణికులు నెల, రెండు నెలల ముందే కుంభమేళాకు ఈ రైల్లో వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. బయల్దేరేది తెల్లారే కావడంతో ప్రయాణానికి సిద్ధం అయ్యారు. ఇంతలో ఈ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ సెల్‌ఫోన్‌లో సమాచారం పంపింది. దీంతో కుంభమేళాకు ఎలా వెళ్లేది అంటూ ప్రయాణికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ శాఖపై విమర్శలు గుప్పిస్తున్నారు.