
అంతర్యామి
February 3, 2025 at 02:32 PM
_*ఓం నారాయణ ఆదినారాయణ*_
*అవధూత లీల*
_రచన : పెసల సుబ్బరామయ్య_
సాధన కాలంలో వీరి అనన్యమైన వైరాగ్యం చూచే వారిని ముగ్ధులను చేస్తుండేది. లడ్డు పెట్టినా వద్దనరు. కానీ కొంచెం కారం, పచ్చడి పెట్టించుకొని అందులో కలుపుకొని తినేవారు. ఒకప్పుడు భక్తులు శెనగపప్పు, బెల్లం, కొబ్బరి దంచి పొడిచేసి డబ్బాలో పోసి అందుబాటులో ఉంచితే శ్రీస్వామివారు తీసుకొని తినేవారు. ఒకరోజు శెనగల పొడి డబ్బా బదులు, భక్తులు వారి చెంత పొరపాటున తలస్నానమునకు వాడే సీకిరేణి పొడి డబ్బా ఉంచారు. సీకిరేణి పొడి తినేశారు శ్రీస్వామివారు. తెల్లవారి సేవకులు తమ పొరపాటుకు పరితాపం చెందారు. శ్రీస్వామివారు మహాసమాధికి ముందు పదిహేను సంవత్సరముల నుండి మంచినీరు త్రాగి ఎరుగరు. ఎప్పుడు త్రాగినా వేడినీటిలో చక్కెర కలిపి ఇస్తే త్రాగేవారు స్వామివారు. తననుకానీ, తనపాదములను కానీ ఎవ్వరినీ తాకనిచ్చేవారు కాదు. వారి పదిమంది సేవకులలో ఎప్పుడూ ముగ్గురికి మాత్రమే వారిని తాకేందుకు అనుమతించేవారు. వారికి పూజలు చేయనివ్వరు. వారికి ప్రదక్షిణలు చేస్తుంటే ఒకేఒక్క ప్రదక్షిణ చాలని చెప్పేవారు.
దక్ష అనే సంస్కృత పదానికి శ్రద్ధ అని అర్థము. మనకు ఎవరిపై శ్రద్ధ ఉంటుందో వారికి మన భావం వ్యక్తం చేసుకునే పద్దతే ప్రదక్షిణలు చేయడం, దక్షిణ సమర్పించడం. మన శ్రద్దను చూరగొన్న వారిని గూర్చి ఎంత తెలుసుకున్నా తనివి తీరదు. వారిపై నిజమైన ప్రీతిగలవారు వారి మనస్సంతా తమ ప్రీతిపాత్రుల చర్యలను, మాటలను తలుచుకుంటూ హృదయమంతా వారి ధ్యాసతో నింపుకొని పులకించిపోతారు. ఇట్టి మన అంతరంగాల బాహ్య ప్రకటనే ప్రదక్షిణ. ఈ విధంగా మన మనస్సులు వారి చుట్టూ పరుగులు తీసేట్లు చేసుకోండని, అప్పుడొక్క ప్రదక్షిణ చేసినా చాలని శ్రీస్వామివారు అలా అనేవారు.
శ్రీస్వామివారికి తాటిఆకే ఆసనం, మట్టిముంతే పాత్ర, గోనె పట్టలే పరుపు, భూదేవే వారి ఊయల, రాగి అంబలి, తెల్లగడ్డ (చిన్న ఉల్లిపాయ), మిరప్పొడి ఇవే పంచభక్ష్యపరమాన్నాలు. పాత పంచలు, దుప్పట్లే వారి చీనాంబరాలు, ఎంత వైరాగ్యమూర్తో!
బాల్యం నుండి శ్రీస్వామివారికి పిచ్చెక్కిందని అందరూ తలచిన్నప్పటికి ఆయన స్వగృహంలో వున్న సుమారు 20సం॥లలో గాని, తరువాత ఆయన పాదచారియై సంచారముచేసే సమయంలోగాని ఒక్కసారైనా ఆయన
యెవ్వరినీ, “ఇలాంటివారు, అలాంటివారు" అని పొగిడిగానీ, విమర్శించిగానీ యెరుగరు “నాభినందతి నద్వేష్టి" అన్న సూత్రం ఆయనలో యెప్పుడూ తొణికిస లాడేది. స్వామికి ఇష్టాయిష్టాలు లేవు. తమ చుట్టూ ఉన్న సేవకులు నిరంతరం లోకాభిరామాయణం, పరనింద చేస్తున్నా కూడా ఒక్కసారైనా, “ఏమయ్యా! యిలా మాట్లాడడం తప్పుగదా!" అని చెప్పి గూడా యెరుగరు.

🙏
1