అంతర్యామి
అంతర్యామి
February 19, 2025 at 12:02 PM
*సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు.* * * * ఇద్దరు యువకులు ఒక వుద్యోగం కోసం ఇంటర్వ్యూ కి వెళ్లారు. ఇద్దరూ అన్ని విషయాలలో సమానమైన అర్హతలు వున్నవారే. కానీ వున్న వుద్యోగం ఒకటే కాబట్టి, ఆ వుద్యోగం అందులో ఒకరినే వరిస్తుంది. రెండోవారిని నిరాశ పరుస్తుంది. మొదటి వాడికి ఆ వుద్యోగం ఎందుకు వచ్చింది, రెండో వాడికి ఎందుకు రాలేదు, అంటే ఇదమిద్ధంగా కారణం కనబడదు. * * * ఇద్దరు వ్యక్తులు ఒకే విధమైన ప్రమాదంలో చిక్కుకుంటారు. ఒకడు సురక్షితంగా బయటపడతాడు, ఆ ప్రమాదంలో నుంచి. రెండోవాడు, గట్టి గాయాలతో వైద్యుల పర్యవేక్షణలో వుండవలసి వస్తుంది. దానికి కారణం ఏమిటీ అంటే, సామాన్యమైన దృష్టి కి అందదు. ‘ భగవంతుడి దయ రెండోవాడిమీద లేదు. ‘ అని సరిపెట్టుకుంటాము. * * * ఇలాంటప్పుడు కొద్దిగా లోతుగా విచారించి చూస్తే, దీని వెనకాల ఏదో కారణం వుండి ఉంటుంది అనిపిస్తుంది. అప్పుడే మన వేదాంత పరిభాషలో చెప్పే సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు మనకు గుర్తు రావాలి. సంచిత కర్మలు అంటే మన వెనుకటి జన్మలో మనము చేసిన కర్మల చిట్టా అంటూ ఒకటి ఉంటుంది. దాని ప్రకారమే, జీవుడు మరి యొక శరీరంలో ప్రవేశించినప్పుడు, కారణ శరీరంతో పాటు ఈ సంచిత కర్మలు కూడా కొత్త జీవితంలోకి వెంటాడి వస్తాయి. అవే వాసనల రూపంలో, సంస్కారాల రూపంలో కొత్తజీవితం రూపుదిద్దుకోవడానికి దోహద పడతాయి. * * * మళ్ళీ ఇద్దరు పిల్లలను ఉదాహరణగా తీసుకుందాము. ఆ ఇద్దరూ వీధిలో నడుస్తూ వుంటారు. ఒకవీధికుక్క దాని త్రోవన అది పడుకుని వుంటుంది. మొదటివాడు. దానికి కొద్దిగా దూరంగా తొలిగివెళ్తాడు. ఇంకొకడు దాని తోకను తొక్కి, అది గుర్రుగా అరుస్తుంటే, వాడు కూడా దానిని ధ్వన్యనుకరణ చేస్తూ కాసేపు దానితో ఆడుకుని వెళ్తాడు. అది కరిస్తే, కుయ్యో మొర్రో అంటాడు. ఆ విధంగా చెయ్యాలని ఇద్దరికీ ఎవరూ శిక్షణ ఇవ్వలేదు. వారి ప్రవృత్తి ఇతర జీవుల పట్ల ఆ విధంగా బయటపడింది. కాబట్టి, తెలుసుకోవలసింది ఏమిటంటే, సంచిత కర్మలు కొత్త జీవితంలో ఫలితాలు ఇవ్వడానికి ప్రారబ్ధకర్మలుగా రూపు దిద్దుకుంటాయి. ఆ ప్రారబ్ధకర్మలే, వ్యక్తుల నడవడికీ, ఆలోచనలకే, సామర్ధ్యానికి, కోరికలకీ నాందీ పలుకుతాయి. * * * ఇందాక చెప్పుకున్నట్లు, సంచితకర్మలు మనతో పాటు వెనుకటి జన్మలనుండి తెచ్చుకున్న కర్మలైతే, ఈ జన్మలో మన నడవడి విధానానికి సంచితంలో నుండి కొంత ప్రారబ్ధకర్మలుగా దారి చూపిస్తుంది. అందుకనే, వ్యక్తికీ వ్యక్తికీ ఆలోచనలో నడవడిలో, ఒక తల్లిగర్భంలో జన్మించినవారైనా మార్పు కనబడుతూ వుంటుంది. ప్రారబ్ధకర్మగా మారిన సంచిత కర్మలో భాగాన్ని ఎవరూ తప్పించలేరు, మార్చలేరు. దానిని ప్రస్తుత స్థూల శరీరాలు అనుభవించాల్సిందే. అనుభవించవలసి కర్మలు ప్రారబ్ధకర్మలు. మనం అప్పుడప్పుడు చూస్తూవుంటాము, ఎందరో మహానుభావులు, పుణ్యాత్ములు, అనారోగ్యంతో మంచంలో వుండడము. అప్పుడు అనిపిస్తుంది కూడా, ఇంతటి పుణ్యాత్ములకు ఈ బాధలేమిటీ అని. కానీ, వారికైతే తెలుసు అవి అనుభవించవలసిన కర్మలని. అందుకనే మౌనంగా అనుభవిస్తూ భగవన్నామ స్మరణలో గడుపుతూ వుంటారు, స్వస్థత చిక్కేదాకా. మనకు ఎన్నో ఉదాహరణలు, ఈ విషయంలో. * * * ఇక ఆగామి కర్మలు, మన రాబోయే అవసరాలకు కూడబెట్టుకునే ధనం లాంటివి. వేదాంత పరిభాషలో చెప్పాలంటే, ఒక వేటగాడు తన అంబుల పొదిలోనుంచి వదిలిన బాణం లాంటిది ప్రారబ్ధకర్మ. దానిని వెనుకకు తీసుకోవడానికి వీలులేనిది, సంధించిన వేటగాడికి కూడా. ఇక సంచిత కర్మలంటే, అతని అంబులపొదిలోని బాణాల కట్టగా చెప్పుకోవచ్చు. ముందు ముందు వదలబోయే బాణాలను ఆగామి కర్మలుగా చెప్పుకోవచ్చు. మనందరకూ తెలిసినట్లుగానే, వదలబోయే బాణాల మీద అతనికి నియంత్రించే అధికారం వున్నది కానీ, వదిలిన బాణాలను నియంత్రించలేడు. * * * ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఒకరైతు తన గాదెలలో వుంచుకున్న పండినధాన్యం సంచితకర్మ అనుకుంటే, కొంత బయటకు తీసి అమ్మివేసినది ప్రారబ్ధకర్మ అనుకోవచ్చు. దానిమీద అతనికి అధికారం లేదు. ఇక ఆరోజు బయటకు తీసి అమ్ముదామనుకునే ధాన్యం ఆగామికర్మగా చెప్పుకోవచ్చు. దానిమీద సర్వ అధికారాలు, అనగా ఎలా వినియోగించాలి, దానం చెయ్యాలా, విక్రయించాలా, ఎంతకు విక్రయించాలి అనేది ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు ప్రతి సాధకుడూ ఆలోచించవలసిన విషయం, సంచిత కర్మలను ఎలా దగ్ధం చేసుకోవాలి ? అని. అది కేవలం బ్రహ్మజ్ఞానం వలననే సాధ్యం. కర్తృత్వ భోక్తృత్వ భావనలు విడిచిపెట్టి, చేసే ప్రతికర్మనూ, నిమిత్తమారుడిగా చేస్తూ, భగవదర్పణం అని, ఫలితం ఆశించకుండా చేయడమే నివృత్తి మార్గ ప్రవేశం. సాధకుడు సాక్షిగా మారిపోవాలి. * * * ఆదిశంకరుల వివేక చూడామణి నుండి.. ఓం శ్రీగురుభ్యోమ్ నమ: గురుదేవులు, జీవన్ముక్తుని ప్రారబ్ధకర్మ శేష సంచారమును వివరిస్తున్నారు. శ్లో. ప్రారబ్ధకర్మ పరికల్పిత వాసనాభిస్సంసారి వచ్ఛరతి భుక్తిషు ముక్తదేహ : / సిద్ధస్వయం వసతి సాక్షివదత్ర తూష్ణీం చక్రస్య మూలమివ కల్పవికల్పశూన్య : // 552 . శిష్యా ! ఈలోకంలో, దేహముతోవుండీ దేహములేనివానివలె వున్న, దేహాభిమానములేని జీవన్ముక్త విద్వాంసుడు ప్రారబ్ధకర్మచే కలిగిన సంస్కారముల వలన కర్మఫలములను సుఖదుఃఖాలను అనుభవిస్తూ, సంసారివలే ప్రవర్తిస్తున్నాడు. బండిచక్రము యొక్క మూలమైన ఇరుసువలె, సంకల్పరహితుడై, కేవలం సాక్షీమాత్రం గా వుంటూ, తాను పొందదగిన పరబ్రహ్మమును పొందినందున జరుగుతున్న విషయములను నిరపేక్షగా, అసంగుడై చూస్తూ వున్నాడు. బండిచక్రములు గిరగిరా తిరుగుతూ బండిని యీడ్చుకు పోతున్నా, ఆ చక్రాలకు ఆధారమైన ఇరుసు మాత్రం ఏవిధమైన చలనం లేకుండా చక్రాలకు ఆధారమై సాక్షిగా వుంటున్నది. అదేవిధంగా, చక్రములవలె ఈ దేహేంద్రియములు, తమ వ్యాపకములు నిర్వర్తిస్తూ, పుణ్యపా పములు మూటకట్టుకొనుచున్నవి. సమస్త దేహమునకు ఆధారమైన పరమాత్మ మాత్రము, ఇరుసు వలే సాక్షియై, సర్వాధిష్టానమైవున్నాడు. ఆత్మలేనిదే శరీరరధం నడువలేదు. కాబట్టి ఇరుసువలే ఆత్మా, చక్రముల వలే దేహమూ వున్నవని అర్ధం చేసుకోవాలి. జీవన్ముక్త విద్వాంసుడు పూర్వజన్మల, ఈ జన్మలోని కర్మశేషములు వున్నందున, శరీరోపాధి నిలిచి వుండుట చేత, ఆయా కార్యక్రమములు యింకా జరగవలసి వున్నందున, మహాసంసారి వలే కనబడుతూ వుంటాడు. సుఖదుఃఖాలను అనుభవించేవానిలాగా, ఈ ప్రపంచములో సంచరిస్తూ వంటాడు. బద్ధజీవులు, ఆమహానుభావుని కూడా బద్ధజీవుని వలె తలుస్తారు. అయితే, అట్టి జీవన్ముక్తుడు, వాస్తవస్థితిలో, చక్రము యొక్క ఇరుసు వలే, అచలుడై, నిస్సంగుడై వున్నాడు. * * * స్వస్తి. గురుదేవుల అనుగ్రహంతో, ప్రేమతో, గండవరపు ప్రభాకర్.
Image from అంతర్యామి: *సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు.*  * * * ఇద్దరు  యువకులు ఒక వుద్యోగం కోసం...

Comments