
Sri Datta Prasaram
February 8, 2025 at 01:18 AM
*శ్రీ దత్త ప్రసాదం - 44 - మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కోరికలు - రెండవ భాగము*
పాఠకులకు నమస్కారం, పోయిన భాగములో మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మొదటి కోరిక అయిన అన్నదానాన్ని, వారి వద్ద శరణాగతి చెందిన భక్తుల చేత ఎలా ఏర్పాటు చేయించుకుంటారో మాట్లాడుకున్నాము. ఇక శ్రీ స్వామి వారి రెండవ కోరిక ఏమిటో తెలుసా ! *ఆశ్రిత జన రక్షణ.* అసలు ఇది శ్రీ స్వామి వారి కోరిక ఎందుకవుతుంది? వారి తపో శక్తి కేంద్రమైన బృందావనం దగ్గర ప్రణమిల్లితే చాలు కదా, కష్టాలు తీరిపోతాయి. ఇంక దానిలో వారు ఇతరుల నుంచి కోరుకోవలసి ఏముంటుంది? అని మీకు సందేహం రావచ్చు. నేను మొదటిలో అలానే ఊహించుకునే వాడిని. కానీ, కొన్ని నెలలపాటు శ్రీ స్వామి వారి దగ్గరికి యాతన పడుతూ చేరిన భక్తులలో క్రక్రమంగా వచ్చే మంచి మార్పుని గమనించిన తరువాత, నేను అందులో ఒక చిన్న విషయాన్ని పట్టుకోగలిగాను. అదేమిటంటే....
నేను ఇక్కడ చాలామంది భక్తుల దగ్గర విన్న మాటేమిటంటే, ఈ మందిరములో మనం కొంతకాలం ఉంటే, స్వామి కరుణించి మన మానసిక రుగ్మత(గాలి అంటారు పల్లె జనం, histeria / anxiety / depression అనేవి వైద్య శాస్త్రం ప్రకారం అనదగినవి) నయమైపోతుంది. నాకు అలానే నయమయ్యింది." అని. నిజానికి, మన దత్తా క్షేత్రములో ఇన్ని రోజులు ఉంటే నయమయిపోతుంది అనే నియమం ఎక్కడ లేదు. కొంతమంది 9 రోజులు, మరికొంతమంది 11 రోజుల, ఇంకా కొంతమంది అయితే 41 రోజులు వుంటారు. ఎన్ని రోజులు వున్నా, శ్రీ స్వామి వారు కోరుకునే విధంగా నడుచుకుంటే నిజంగానే భక్తుల బాధలు తీరుతాయి.
అలా, గాలి చేష్టలతో బాధపడుతూ ఈ దత్త క్షేత్రానికి చేరుకున్న భక్తులకు ఇక్కడ మందిర అర్చకులు కానీ ఎన్నోనాళ్ళగా ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది చెప్పే నియమాలు ఏంటో తెలుసా..! "ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం స్వామి వారికి ఇచ్చే హారతులు తప్పక తీసుకోవాలి, రోజూ వీలైతే రెండు సార్లు లేదా కనీసం ఒక్కసారి మందిరములో 108 ప్రదక్షిణలు చెయ్యాలి.....వ్యక్తిగతంగా వారికి కుదరకపోతే వారి కూడా వచ్చినవారు రోజులో కొంచెం సేపైనా పట్టుకొని అయినా ప్రదక్షిణలు చేయించాలి. చేయగలిగితే ఆవరణ శుభ్రత ఇలాంటివి చేయొచ్చు" అని. నిజమే బాహ్యంగా ఇది మందిరములో ఉంటూ దేవుడ్ని రక్షించమని అడగడమే కానీ, మరొక్కసారి ఈ నియమాలని కొంచెం లోతైన కొణములో మీకు వివరిస్తా....
• ప్రతీ రోజు స్వామి వారికి ఇచ్చే మూడు హారతులు తీసుకోవాలి.. శ్రీ స్వామి వారికి ప్రతీ రోజు మూడు పూటలా ఆమె సమయములో హారతులు ఇస్తారు. వాటిని వచ్చి తీసుకోవటం వలన, ముందు రోజులో, సమయపాలనలో ఒక క్రమశిక్షణ వస్తుంది
• వీలైతే రోజులో రెండు సార్లు లేదా ఒకసారి మందిరములో 108 ప్రదక్షిణలు చెయ్యాలి. 108 ప్రదక్షిణలు మన మందిరములో చెయ్యాలి అంటే 3 గంటల సమయం పడుతుంది. అంతసేపు నడుస్తూనే ఉండటం వలన శరీరానికి మంచి వ్యాయామం
• ఇక మందిరములో సేవ, ఇది కూడా వ్యాయాయమే
• అన్నదాన సత్రములో భోజనం. సాత్వికమైన మితాహారంలా పని చేస్తుంది
• నిత్యం భగవంతునికి జరిగే కార్యక్రమాలు అలానే గంటల శబ్దాలతో ఏకాగ్రత
• అసలు సాక్షాత్తు దైవ మందిరములో ఉంటాము కాబట్టి చెడు చెయ్యటమనే కాదు, చెడు ఆలోచించాలన్న కానీ ఒకరకమైన భయం ఏర్పడుతుంది.
చూసారా పాఠకులారా! ఇందుకని మన క్షేత్రం వద్ద ఎవరైతే ఈ నియమాలని పాటిస్తారో, వారికి మానసిక రుగ్మతలు తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువ. అందుకనే, ఆ మా దత్తాత్రేయ స్వామి వారు మందిర సిబ్బంది ఈ నియమాలు పెట్టేలా, చెప్పేలా ఎప్పుడు ఆలోచనలను అందిస్తూ వారి ద్వారా శ్రీ స్వామి వారి *ఆశ్రిత జన రక్షణ.* కోరికను నెరవేర్చుకుంటారు.
సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి
రచన : పవని శ్రీ విష్ణు కౌశిక్
(మందిర వివరముల కొరకు :
పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)
----
మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును :
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=nq8cskE8m3f3ZrNZ
-----
*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము , శ్రీ దత్త బోధలు మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :
Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
----

🙏
❤️
10