Sri Datta Prasaram
Sri Datta Prasaram
February 22, 2025 at 01:38 AM
*శ్రీ దత్త ప్రసాదం - 50 - బృందావన మహిమ - బుద్ధి మార్పు* పాఠకులకు నమస్కారం! మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మానవ రూపంతో నడయాడుతున్న సమయంలో ఒక మాట అన్నారు, "నేను ఉపదేశం చెయ్యాలి అనుకుంటే నాకు భౌతిక శరీరం అక్కర్లేదు, నా బృందావనం నుంచి కూడా నేను చెయ్యగలను" అని. అంతటి మహాత్ముడు అన్న మాటలు కదూ, అవి సత్యంగా మారక ఇంకేమి అవ్వగలవు చెప్పండి. ఆ మాటలను రుజువు చేసిన శ్రీ స్వామి వారి లీల గురించి ఇప్పుడు ఒకటి చదువుకుందాము. శ్రీ స్వామి వారు కొన్ని రోజుల పాటు సాధన చేసిన మొగిలిచెర్ల గ్రామంలో చిన్నయ్య అనే సన్నకారు రైతు వున్నారు. వారికి ఉన్న స్థలం లో సాగు చేసుకొని, వచ్చిన పంట రాబడితో సంసారం నడుపుతూ వుండేవారు. మొగిలిచెర్ల ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, పైగా ఎర్ర నేల కాబట్టి, ఈ ప్రాంతంలో ఎక్కువుగా పొగాకు సాగుబడి అవుతుంది. ఈ ప్రాంతంలో వుండే ఇతర రైతుల లాగానే ఆ సంవత్సరం చిన్నయ్య గారు పొగాకు పంట వేశారు, కాలం కలిసొచ్చి మంచి నాణ్యమైన పొగాకు పండిది. తనకు వచ్చిన బంగారం లాంటి పంటను, పొగాకు బోర్డులో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఇక కొన్ని రోజులు నిశ్చింతగా ఉండొచ్చు అని చిన్నయ్య గారు భావించారు. అయితే పొగాకు బోర్డుకు పొగాకును అమ్మాలి అంటే, ఖచ్చితంగా ఆ రైతుకు పొగాకు క్యూరింగ్ చేసే బార్న్ ఉండాలి అని అప్పట్లో నియమావళి ఉండేది. కావున చిన్నయ్య గారు ఆ ఊరిలో, సొంత బార్న్ ఉన్న ఒక మోతుబరి రైతుతో ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం ఏంటి అంటే, చిన్నయ్యగారి పంటను ఆ మోతుబరి రైతు వారి పంటగా బోర్డ్ వద్ద అమ్మి, ఆ వచ్చిన పైకాన్ని చిన్నయ్య గారికి బదిలీ చెయ్యాలి అని. ఈ మొత్తం సహాయానికి కాను, కొంచెం మొత్తం ఆ మోతుబరి రైతుకు కమిషన్ రూపంలో ఇచ్చేటట్టు. ఈ ఒప్పందంలో మొత్తం పొగాకు అమ్మి, ఆ మోతుబరి రైతుకు డబ్బులు వచ్చే వరకు వ్యవహారం అంతా సజావుగానే సాగింది. కానీ, ఆ వచ్చిన డబ్బులు చిన్నయ్య గారికి బదిలీ చెయ్యకుండా మొత్తం తానే అనుభవించాలని పేరాశ పుట్టింది ఆ మోతుబరి రైతుకు. అందుకనే పంట అమ్మిన డబ్బులకోసం చిన్నయ్యగారు మోతుబరి రైతు వారి ఇంటికి వెళ్లగా, ఆ మోతుబరి రైతు, అసలు పంట అంతా తనదే అని, చిన్నయ్య డి కాదని దాబాయించి బయటకు పంపించేశారు. ఆ చర్యతో చిన్నయ్య గారికి ఎం చెయ్యాలో పాలుపోలేదు, వెంటనే ఊరిలో, పలుకుబడి ఉన్న వ్యక్తుల దగ్గరకు వెళ్ళి, వారికి జరిగిన అన్యాయం గురించి చెప్పారు, వారి వైపు నిలబడి న్యాయం జరిగేలా చూడండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ పెద్దలు, మోతుబరి రైతుకు అంగ మరియు అర్ధ బలం ఎక్కువ అని వారికి ఎదురుగాపోవడం కష్టం అని చిన్నయ్య గారికి తేల్చేశారు. ఊరి పెద్దల నిస్సహాయత గురించి విన్న చిన్నయ్య గారికి గుండె రగిలింది, వెంటనే ఆ ఊరి పెద్దలతో, "నా కష్టం నిజం, నా పంట నిజం, అది నా ఆదాయం అన్నది నిజం, ఆ విషయం ఆ పెద్దాయన చేత మీరు చెప్పించలేక పోవచ్చు, కానీ దేవుడు చెప్పిస్తాడు. ఆ పెద్ద మనిషి చేసిన పని న్యాయమైనదే అయితే మన స్వామి వారి సమాధి ముందు ప్రమాణం చెయ్యమనండి చూద్దాం" అని గట్టిగా నిలబడ్డారు. ఈ మార్గం ఆ ఉరిపెద్దలకు కూడా నచ్చింది. ఇందులో తమకి ప్రమాదం ఏమి లేదు కాబట్టి, ఈ కబురు ఊరి పెద్దలు ఆ మోతుబరి రైతుకు పంపించారు. వెంటనే ఆ మోతుబరి రైతు "అలానే చేద్దాం" అని బయటకు అని, లోపల ఆ స్వామి ఏమన్నా బండలో నుంచి వచ్చి చూస్తాడా అని ధీమాగా వున్నాడు. వెంటనే చిన్నయ్య గారు, ఊరి పెద్దలు మరియు మోతుబరి రైతు అందరూ మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి చేరుకున్నారు. వెంటనే చిన్నయ్య గారు క్షణం ఆలోచించకుండా శ్రీ స్వామి వారు నిర్మింపచేయించుకున్న బావిలో నుంచి ఒక బకెట్ నీళ్లు తోడుకొని తల మీద పోసుకొని స్వామి వారి గర్భాలయం ముందు బృందవనానికి ఎదురుగా నిల్చొని వారు ఆ మోతుబరి రైతుతో చేసుకున్న ఒప్పందం జరిగిన వివాదం అంతా శ్రీ స్వామి వారి అర్చక స్వామి గారు తెచ్చిన హారతి పళ్లెం మీద చెయ్యిపెట్టి చెప్పేసారు. ఈ జరుగుతున్న తంతు అంత మన దత్తాత్రేయ స్వామి వారి మందిర వ్యవస్థాపక ధర్మకర్తగారైన నాగేంద్రప్రసాద్ గారు కూడా ఒకంత ఉద్వేగంతో చూస్తున్నారు. నాగేంద్రప్రసాద్ గారికి శ్రీ స్వామి వారు చెయ్యబొయ్యే న్యాయం తెలుసు, చెప్పబోయే సమాధానం తెలుసు, కానీ వారి సందేహం అంతా అది ఎలా జరగబోతున్నదే అని మాత్రమే. ఇక ఆ మోతుబరి రైతు వంతు వచ్చింది, ఎందుకనో ఆ మోతుబరి రైతు మొహంలో ఒక్కసారిగా భయం ఆవరించింది. బండరాయి నుంచి బయటకు వస్తాడా అని శ్రీ స్వామి వారి గురించి ధీమాగా అన్న మాటలు ఇప్పుడు పని చెయ్యటం లేదు. గర్భాలయం ఎదురుగా నిల్చున్నారు. శ్రీ స్వామి వారి బృందావనం గంభీరంగా మోతుబరి రైతు వంక చూస్తున్నది. అర్చక స్వామి గారు హారతి పళ్లెం పట్టుకొని పక్కగా నిల్చోనున్నారు. అంతే ఆ మోతుబరి రైతు, ఒక్కసారిగా గద్గద స్వరంతో, "స్వామి నన్ను క్షమించు, చిన్నయ్య నన్ను క్షమించయ్య, తప్పు చేశాను, ఇదిగో ఇప్పుడే నీ డబ్బులు నీకు ఇస్తాను" అని హుటాహుటిన ఒక మనిషిని పంపించి శ్రీ స్వామి వారి మందిరము లోనే చిన్నయ్యకు రావాల్సిన మొత్తం ముట్టజెప్పారు. అంతే, చిన్నయ్య ఆనందపడ్డారు, మోతుబరి రైతు పశ్చాత్తాప పడ్డారు, నాగేంద్రప్రసాద్ గారు తృప్తి పడ్డారు. అందరూ అక్కడ నుంచి బయలుదేరారు. పాఠకులారా! ఆరోజు కనుక శ్రీ స్వామి వారి మందిరములో ఆ మోతుబరి రైతు కనుక అబద్ధం చెప్పగలిగి ఉంటే, ఇక మన శ్రీ స్వామి వారి మందిరానికి శోభ తప్పి ఉండేది. ఇది దత్తక్షేత్రం అన్నది నిజం, బృందావనంలో శ్రీ స్వామి వారి తపః శక్తి నిలయమైవున్నది అనేది నిజం, ఇక్కడ ఆశ్రీత జన రక్షుకుడు ఉన్నాడని సత్యం కాబట్టే ఆ మోతుబరి రైతు ఆనాడు అబద్దామాడలేక పోయాడు. అందుకనే, ఇంతటి మహిమాన్విత మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరాన్ని మీరందరూ ప్రత్యక్షంగా దర్శించి తరించాలాని నా వ్యక్తిగత విన్నపం, అందుకొఱకు, అంతవరకు మరియు అటుపైన..... సర్వం, శ్రీ దత్తకృప ధన్యోస్మి మూల రచన : శ్రీ పవని నాగేంద్రప్రసాద్ (మందిర వివరముల కొరకు : పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699) ---- మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=UOo289wb4AlQnFHM ----- *మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము , శ్రీ దత్త బోధలు మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 : Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632 ----
Image from Sri Datta Prasaram: *శ్రీ దత్త ప్రసాదం - 50 - బృందావన మహిమ - బుద్ధి మార్పు*     పాఠకులకు న...
🙏 ❤️ 15

Comments