Sri Datta Prasaram
February 25, 2025 at 01:09 AM
శ్రీ దత్త ప్రసాదం - 51 - ఆకస్మిక ప్రయాణముతో పొందిన అవధూత ఆశిర్వాదం
పాఠకులకు నమస్కారం, మన మోగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరము ఉన్న ప్రదేశం, కందుకూరు - పామురు మధ్య ఉండే రహదారికి ఒక 15 kms దూరంలో లోపలికి ఉంటుంది. ఇప్పుడు మనకి ఉన్న సాంకేతికత వలన, మనం ఏ చోటుకి వెళ్లినా, అక్కడికి దగ్గర్లో వుండే దార్శనీయ ప్రదేశాలు అన్ని మన సెల్ ఫోన్ ద్వారా మనకి తెలుస్తాయి. కానీ ఇవి రాక ముందు, కొంతమంది భక్తుల నోటి చలవ వలనో లేక దగ్గరలో ఉన్న క్షేత్రాలలో మన శ్రీ దత్తాత్రేయ మందిరానికి సంబంధించిన బోర్డ్ల వలనో, మాత్రమే కొత్త భక్తులు మన క్షేత్రాన్ని మొదటి సారి దర్శించుకునేవారు. అలా మన క్షేత్రానికి మొదటిసారి వచ్చి తరించిన ఒక వృద్ధ జంట గురించి చదువుకుందాము.
ఆ దంపతులది చెన్నై నగరం. మన మొగిలిచెర్ల దత్త క్షేత్రానికి ఒక 60 kms దూరంలో వుండే భైరవకొన మరియు మిట్టపాలెం క్షేత్రాలని దర్శించుకొని, తిరుగు ప్రయాణంలో మలకొండ మీద ఆ మాల్యాద్రిని దర్శించుకొని తిరిగి చెన్నై వెళ్లిపోదామన్నది వారి ప్రయాణ ప్రణాళిక. కానీ ఆ దంపతులు మన మాల్యాద్రి లక్ష్మీనరసింహులకి ఏమి విన్నవించుకున్నారో తెలియదు కానీ, తిరుగు ప్రయాణంలో మన దత్తక్షేత్రం బోర్డ్ చూసి, అతి దగ్గరలోనే ఉంది కదా ఒకసారి దర్శించుకొని వెళ్తే సరిపోతుంది అనే తలంపు వారి మదిలో మెరిసింది. అంతే వారు ప్రయాణిస్తున్న కార్ మన దత్తక్షేత్రానికేసి పరుగులు పెట్టింది. సాయంత్రం షుమారు 5 గంటలకు ఆ దంపతులు మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి చేరుకున్నారు. వ్యవస్థాపక ధర్మకర్తతో వారికి జరిగిన సంభాషణ మధ్యలో ఆ రోజు శనివారం కనుక మరొక గంటలో విశేష పల్లకీ సేవ మొదలవుతుంది అని తెలిసింది. విశేష సేవ కనుక అది కూడా చూసి ఆదివారం ఉదయం శ్రీ స్వామి వారిని అంతరాలయంలో దర్శించుకొని వెళ్దాం అని వారు నిర్ణయం తీసుకున్నారు.
ఎంతో విశేషంగా జరిగే శ్రీ స్వామి వారి పల్లకీ సేవలో పాల్గొన్న సమయంలో, మన శ్రీ స్వామి వారు ఎంతటి భక్త సులభుడో అన్న విషయం మన మందిరం వద్ద ఉన్న భక్తుల ద్వారా వాళ్ళకి తెలిసింది. అనుకున్న విధంగానే వారు మర్నాడు ఆదివారం ఉదయం శ్రీ స్వామి వారి అంతరాలయాన్ని దర్శించుకొని నాగేంద్ర ప్రసాద్ గారికి వీడుకోలు తెలుపుకొని తిరిగి వెళ్లారు. నాగేంద్రప్రసాద్ గారు కూడా ఇక వారి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. సరిగ్గా ఒక గంట వ్యవధిలో మళ్ళీ ఆ దంపతులు తిరిగి మందిరంలోకి వచ్చి నాగేంద్రప్రసాద్ గారిని కలిశారు. నాగేంద్రప్రసాద్ గారు ఒకింత ఆశ్చర్యంతో "మీరు ఊరికి తిరుగు ప్రయాణమయ్యారనుకున్నాను" అని అన్నారు. అప్పుడు ఆ దంపతులు, "అవును, మేము కూడా తిరుగు ప్రయాణానికి సన్నద్ధమవుతున్న తరుణంలో మా అబ్బాయి ఫోన్ చేసాడు. మేము నిన్న పల్లకీ సేవలో మరియు ఈరోజు శ్రీ స్వామి వారి బృందావనం దగ్గర విన్నవించుకున్నది మా అబ్బాయి వాళ్ళ కూతురి వివాహం గురించి, అదేమీ చిత్రమో కానీ, ఈ దత్తాత్రేయ స్వామి మా కోరికను చిటికెలో తీర్చేసారు. మా మనవరాలికి వివాహం కుదిరింది అని మా అబ్బాయి ఫోన్లో చెప్పిన సారాంశం." అని చెప్పారు
ఆ దంపతులు ఇంకా మాట్లాడుతూ, "వాడి కూతురి పెళ్లి నిశ్చయమయ్యింది అని అతను చెప్తే మాకు ఎంత ఆశ్చర్యం కలిగిందో, ఈ స్వామిని దర్శించి కోరినంతనే ఇలా శుభం జరిగింది అని చెప్తే మా అబ్బాయి అంతే ఆశ్చర్య పోయాడు. అందుకే శ్రీ స్వామి వారికి కృతజ్ఞతగా ఒక ఆదివారం ఇక్కడ అన్నదానం చేయించదలుచుకున్నాం" అని అందుకు కావాల్సిన ధనాన్ని మందిర సిబ్బందికి ఇచ్చి వెనుదిరిగారు. అంతే కాదు, చెన్నై వెళ్లిన తరువాత కూడా మన శ్రీ స్వామి వారి మహత్తు గురించి అనేకమందికి తెలుపగా, వారి మాటలు విని మన క్షేత్రాన్ని దర్శించుకున్న వారు కూడా ఉన్నారు.
నిజంగా పాఠకులారా, దేవుని లీల కాక మరి దీన్ని యాదృశ్చికం అనగలమా! ఇలాంటి మరొక అద్భుతమైన దత్తప్రసాదంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అలానే, ఇంతటి లీలామయులు అని మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని మీరు అందరూ ప్రత్యక్షంగా దర్శించి, తరించాలాని నా వ్యక్తిగత విన్నపం. అందుకొఱకు, అంతవరకు మరియు అటుపైన.....
సర్వం,
శ్రీ దత్తకృప
ధన్యోస్మి
మూల రచన : శ్రీ పవని నాగేంద్రప్రసాద్
(మందిర వివరముల కొరకు :
పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)
----
మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును :
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=UOo289wb4AlQnFHM
-----
*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము , శ్రీ దత్త బోధలు మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :
Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
----
🙏
❤️
14