
" THATIPAMULA * FOUNDATION "
February 28, 2025 at 04:15 AM
14 లోకాలు - 14 చక్రాలు.......!
ఈ 14 లోకాలు వివిధ పరిధుల్లో ఈ సృష్టిలో ఉన్నాయి. విశ్వంలో ఈ 14 లోకాలు ఉండడమే కాదు, భూలోకంలో కూడా వివిధ దేశాలను వీటికి అన్వయించి చెప్పే విధానం ఉంది, అలాగే ఈ శరీరంలోనే ఈ 14 లోకాలను పదునాలుగు భిన్న చైతన్య స్థితులకు సూచనగా చెప్పే సంప్రదాయం కూడా ఉంది. మన శరీరంలో మూలాధారం నుంచి పైకి, క్రమంగా స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలనే 6 చక్రాలు ఉన్నాయి. వాటికి పైన ఉన్నది సహస్రారం/ సహస్రపద్మం. ఇవన్నీ కలిపి 7. అలగే మూలాధారానికి దిగువన కూడా 7 చక్రాలున్నాయని కొన్ని ఆగమాల్లో కనిపిస్తుంది. ఈ మొత్తం అన్నీ కలిపి 14. వ్యక్తి యొక్క చైతన్యం ఉన్న స్థాయిని అనుసరించి, అతడి మానసిక స్థాయి ఏ లోకంలో ఉందో తెలుసుకోవచ్చు.
1. మూలాధారం - వెన్నుపూస అంత్యభాగంలో ఉంటుంది. ధారణశక్తి కి కేంద్రస్థానం. మహాగణపతి అధిదేవత. ఇదే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు.
2. స్వాధిష్టానం - బొడ్డు క్రింద, జనేనెంద్రియాల వద్ద ఉంటుంది. వివేకము దీని లక్షణం.
3. మణిపూరం - నాభిలో ఉంటుంది. సంకల్పశక్తికి కేంద్రస్థానం.
4. అనాహతం - హృదయం దగ్గర ఉంటుంది. అపరోక్ష జ్ఞానానికి స్థానం.
5. విశుద్ధం - కంఠంలో ఉంటుంది. దివ్యప్రేమ/ దైవం పట్ల ప్రేమకు స్థానం.
6. ఆజ్ఞ - కనుబొమ్మల మధ్యన ఉంటుంది. దీన్నే మూడవ నేత్రం అంటారు. దివ్య దృష్టికి కేంద్రస్థానం.
7. సహస్రారం - తలమీద ఉంటుంది. ఆత్మజ్ఞానానికి, దైవానికి స్థానం.
నరకాలు, పాతాళ లోకాల గురించి చూద్దాము.....
1. అతలం - అగాధ ప్రాంతానికి చెందిన చక్రమిది. తుంటి భాగంలో ఉంటుంది. భయం, కామము దీని లక్షణాలు.
2. వితలం - నిరసించడం లక్షణంగా కలిగిన చక్రమిది. ఇక్కడ సుఖం ఉండదు, విపరీతమైన కోపం ఉంటుంది. తొడల భాగంలో ఈ చక్రం ఉంటుంది.
3. సుతలం - బాగా లోతైన అనే అర్దంలో చెప్పే చక్రం ఇది. అసూయ దీని లక్షణం.
4. తలాతలం - అంధకారం, తామసికం దీని లక్షణం. పిక్కల్లో ఉంటుంది. క్రింది స్థాయి చక్రం ఇది. గందరగోళం, అస్పష్టమైన ఆలోచనలకు, అమితమైన మొండితనానికి ఇది స్థానం.
5. రసాతలం - కాలిచీలమండల ప్రాంతంలో ఉండే చక్రం. స్వార్ధపరత్వం, ఆధిపత్య ధోరణి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం దీని లక్షణాలు.
6. మహాతలం - అవివేకము దీని లక్షణము. పాదాల్లో ఉంటుంది.
అవివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేవి తెలుసుకోలేక అసత్యమైన వాటి వెంటపడే లక్షణం. నరక లోకం యొక్క తీవ్రత ఇక్కడి నుంచే మొదలవుతుంది.7.
7. పాతాళం - కాకోలం అనే నల్లని విషం ఉండే ప్రాంతం. పతనమైన, లేదా పాపిష్టి పనులకు మూలం ఇది. దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం. అరికాలులో ఉంటుంది. ఇక్కడుండే జీవులు వినాశనం కోసం వినాశనం చేస్తారు, హింసించటం కోసం హింసిస్తారు, చంపడం కోసం చంపుతారు.
కాబట్టి దీన్ని అర్దం చేసుకుని మనలో ఆ క్రింద చక్రాల్లో ఏ ఏ లక్షణాలు ఉన్నాయో, అవన్నీ వదులుకుంటే, కాస్తంతైన ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది.
షట్చక్రాలు
మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు. శ్రీ విద్యలోను, వివిధ తంత్రములలోను చెప్పిన ప్రకారము మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు
మూలధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం
నాభిస్తు మణి పూరాఖ్యం హృదయాబ్జ మనాహతం
తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం
సహస్రారం బ్రహ్మరంధ్ర ఇత్యగమ విదో విదుః
– వీటిని ఊర్థ్వలోక సప్తకమంటారు.
7. సహస్రారం – సత్యలోకం – ప్రమాతస్థానం
6. ఆజ్ఞాచక్ర – తపోలోకం – జీవాత్మస్థానం
5. విశుద్ధ చక్రం- జనలోకం – ఆకాశభూతస్థానం
4. అనాహతం – మహర్లోకం – వాయుభూతస్థానం
3. మణిపూరకం – సువర్లోకం – అగ్నిభూతస్థానం
2. స్వాధిష్ఠానం – భువర్లోకం – జలభూతస్థానం
1. ఆధారము – భూలోకం – పృథ్వీభూతస్థానం
1. మూలాధారచక్రం : మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది. నాలుగురేకులుగల తామరపూవాకారంలో ఉంటుంది. దీనికి అధిపతి గణపతి; వాహనం – ఏనుగు.
మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. ఇది షట్చక్రాలలో మొదటిది. ఇది నాలుగు దళాల పద్మము. ఈ మూలాధార చక్రములో ‘సాకిన్యాంబ’ నివసిస్తుంది. ఈమెకు ఐదు ముఖములు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. ఈమె ఆస్ధి సంస్దిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది. వజ్రేస్వరి. ఈ దేవతకి నాలుగు చేతులు. అంకుశము, కమలం, పుస్తకము, జ్ఞానముద్ర కలిగి ఉంటుంది.
సాకిన్యాంబ వరదాది దేవతలు : 1. వరద 2. శ్రియ 3. షండా 4. సరస్వతి ( వ, శ, ష, స అను మూలాక్షరాల) దేవతలచే కోలువబడుతూ ఉంటుంది. ఈమెకు పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టము.
2. స్వాధిష్ఠాన చక్రం : ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నెముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మతత్త్వం. జలం – సింధూరవర్ణంలో ఉంటుంది. ఆరురేకుల పద్మాకారంలో ఉంటుంది. దీనికి అక్షరాలు బం – భం – యం – యం – రం – లం. వాహనం మకరం.
3. మణిపూరక చక్రం : బొడ్డునకు మూలంలో వెన్నెముక యందుటుంది. దానికి అధిపతి విష్ణువు. పదిరేకుల పద్మాకారంలో ఉంటుంది. బంగారపు వర్ణంతో ఉంటుంది. అక్షరాలు డం – ఢం – ణం – తం – థం – దం – ధం – నం – పం. వాహనం కప్ప.
4. అనాహత చక్రం : ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది. దీనికధిదేవత రుద్రుడు. నీలం రంగులో ఉంటుంది. పన్నేందురేకుల తామరపూవులవలె ఉంటుంది. అక్షరాలు కం – ఖం – గం – ఘం – జ్ఞం – చం – ఛం – జం – ఝం- ణం – టం – ఠం. తత్త్వం వాయువు. వాహనం లేడి.
5. విశుద్ధచక్రం : ఇది కంఠము యొక్క ముడియందుంటుంది. దీనికధిపతి జీవుడు. నలుపురంగు. అక్షరాలు అం – ఆం – ఇం – ఈం – ఉం – ఊం – ఋం – ౠం – ఏం – ఆఇం – ఓం – ఔం – అం – అః. తత్త్వమాకాశం – వాహనం ఏనుగు.
6. ఆజ్ఞాచక్రం : ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. దీని కధిపతి ఈశ్వరుడు. తెలుపురంగు. రెండు దళాలు గల పద్మాకారంగా ఉంటుంది. అక్షరాలు హం – క్షం.
7. సహస్రారం : ఇది కపాలం పై భాగంలో మనం మాడు అని పిలిచే చోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రమంటాం. దీని కధిపతి పరమేశ్వరుడు. వేయిరేకుల పద్మాకృతితో ఉంటుంది. సుషుమ్నానాడి పై కొనమీద ఈ చక్రం ఉంటుంది. అక్షరాలు – విసర్గలు. దీనికి ఫలం ముక్తి.
🙏