Kazipet Swetharka Ganapati Temple
May 21, 2025 at 07:33 AM
*మోదుగ దండం*
పూర్వకాలంలో కొందరు దేవతలు ఓ మోదుగ చెట్టు నీడన కూర్చుండి కొన్ని వేదమంత్రాల గురించి విశ్లేషణ చేస్తున్నారు. కొంత సేపటికి ఆ చర్చను సగంలోనే ముగించి ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వృక్ష సమీపాన కూర్చుండి ఇంతకు మునుపు తాము అర్ధాంతరంగా ముగించిన చర్చను కొనసాగించాలని అనుకొన్నారు. కాని ఎంత ఆలోచించినా వారికి ఆ చర్చ ఎక్కడిదాకా ముగించాము ఎక్కడ నుండి కొనసాగించాలన్న విషయం అంతుబట్టలేదన్నట్టు. వారి ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసలే అయ్యాయి.
ఎట్టకేలకు ఇక లాభం లేదు ఇతర విషయాలపై దృష్టి సారిద్దాం అని అనుకొంటున్న తరుణంలో ఆ మోదుగ చెట్టు నుండి ఓ అశరీరిలాంటిది వినబడింది. వారి చర్చ ఏ శీర్షిక గురించి, ఎవరెవరు ఎలా ఎలా అభిప్రాయపడ్డారు, ఎక్కడిదాకా ఆ చర్చ ముగిసింది అన్న విషయాలన్నింటిని కూలంకషంగా ఆ చెట్టే చెప్పేసింది.
దేవతలకు ఆశ్చర్యమంటే ఆశ్చర్యము, వారి సంతోషం అవధులు దాటాయి. వెంటనే ఆ మోదుగ వృక్షాన్ని *శుశ్రువాన్* (శ్రవణ విశిష్ఠః) అని దీవించారు.
అప్పటి కాలం నుండి ఉపనయనం కాబడు వటువులకు వారి జ్ఞానం, జ్ఞాపకశక్తి పెంపొందించడానికి ఓ మోదుగ కొమ్మను వారికి బహూకరిస్తారు. ఉపనయనం అయిన వెంటనే వారు గురుకులంలో గురువును ఆశ్రయించి 12 సంవత్సరాలు వేదాధ్యయనం చేయవలయును కదా. ఆ బ్రహ్మచారి తన వెంట ఆ మోదుగ కొమ్మను కూడా తీసుకెళ్ళి ఎల్లవేళలా దానిని తన చేతుల్లో పట్టుకొని ఉండవలసిందే. అలా ఉంచుకొన్న మాత్రం చేత వారి జ్ఞానం మరియు జ్ఞాపకశక్తి విపరీతంగా పెరిగే అవకాశం కలదు.
తన బ్రహ్మచర్య దీక్షలోనున్నప్పుడు వేదాధ్యయనం సమయంలోగాని నిత్యానుష్టాన సమయాల్లో గాని ఎల్లప్పుడు మోదుగ చెట్టు కొమ్మను ధరించాలి. గృహస్థాశ్రమాన్ని స్వీకరించే వరకు తనతోబాటు మోదుగ కొమ్మ ఉండవలసిందేనన్న నియమాన్ని తుచ తప్పకుండా పాటించాలి.
వారి జ్ఞాన సంపద పెంపొంది వేనోళ్ళ కీర్తింపబడాలి కదా అందుకనే ఇప్పట్లోకూడా ఉపనయనం చేస్తున్నప్పుడు ఆ వటువుకు మోదుగ చెట్టు కొమ్మను ఇస్తారు గాని దాన్ని వారు సభా ప్రాంగణంలోనే వదిలేసి తమ తమ గృహాలకు వెళ్ళిపోతారు.
ఉపనయనం అయిన వెంటనే సంధ్యావందన విధులను చేపట్టితే కదా మోదుగ కొమ్మ ప్రాముఖ్యం తెలుసుకోవడానికి. తల్లిదండ్రులకు తెలియదు, ఆచార్యులు వారి వారి తదుపరి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఇక ఇలాంటి విశేషాలు వటువుకు చెప్పేవారెవరు.
అంతా గంగలో కలిసిపోయినట్టే.