Motivational By Sridhar Nallamothu
Motivational By Sridhar Nallamothu
May 27, 2025 at 04:06 AM
గుడి చుట్టూ ప్రదక్షిణ, లేదా ఆత్మ ప్రదక్షిణ వెనుక ఉన్న సైన్స్ - నల్లమోతు శ్రీధర్ గుడికి వెళితే గుడి చుట్టూ ప్రదక్షిణ చెయ్యడం ఓ అలవాటు. కొంతమంది కొత్త జనరేషన్ జనాలు ఈ మూఢ ఆచారాలు అన్నీ వృధా అని కొట్టేయొచ్చు గానీ దీని వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే ఇలాంటి ఆచారాల పట్ల గౌరవం పెరుగుతుంది. సాధారణంగా ప్రదక్షిణ గుడి చుట్టూ గానీ, దేవతా విగ్రహం చుట్టూ గానీ, యాగం జరిగేటప్పుడు యాగశాల చుట్టూ గానీ, కొన్ని పవిత్రమైన లక్షణాలు కలిగిన చెట్ల చుట్టూ గానీ, అరుణాచలం వంటి ప్రదేశాల్లో కొండ చుట్టూ గానీ చేయబడుతుంది. సైంటిఫిక్‌గా చెప్పాలంటే ఇలా ప్రదక్షిణ చెయ్యడాన్ని moving meditation (కదులుతూ చేసే ధ్యానం)గా చెప్పుకోవాలి. ప్రదక్షిణ చెయ్యడం అనేది మన మెదడులోని కుడి, ఎడమ అర్థగోళాలను బ్యాలెన్స్ చేస్తుంది. మీరు గమనించారా... ప్రదక్షిణ చేసేటప్పుడు క్లాక్ వైజ్ చేయమంటారు. అదే తెలీక ఎవరైనా యాంటీ క్లాక్ వైజ్ చేస్తుంటే వద్దంటారు. ఇలా క్లాక్ వైజ్ తిరిగేటప్పుడు మీ ఊహకి అందనంత అద్భుతంగా జరిగే చర్య ఒకటి ఇప్పుడు చెప్తాను. క్లాక్ వైజ్ తిరుగుతుంటే మీ ఎడమవైపు కన్ను కేవలం పరిమితంగా మాత్రమే బయటకు దృష్టి సారించగలుగుతుంది. తిరుగుతూ ఉండగా ఎడమ వైపు దృష్టి పరిమితం కావడం వల్ల అది మన ఎనర్జీ ఫీల్డ్‌లోని అంతర్గత శక్తి వైపు (అప్పటి వరకూ బయట విషయాల మీద ఆసక్తి చూపించే మనస్సు కాస్తా సద్దుమణిగి), అంటే మనలోకి మనం చూసుకోవడం మొదలవుతుంది. ఇలా కుడి వైపు విజువల్ ఫీల్డ్ ఎడమ వైపు బ్రెయిన్ అర్థగోళం అయిన అంతర్గత దృష్టికి కనెక్ట్ అయినప్పుడు.. అప్పటి వరకూ లాజికల్ థింకింగ్, ఆందోళన వంటి అనేక లౌకిక విషయాల్లో నిమగ్నమై ఉన్న ఎడమ వైపు అర్థగోళంలో న్యూరల్ యాక్టివిటీ తగ్గి కుడి వైపు అర్థగోళంలో యాక్టివిటీ పెరుగుతుంది. దీనివల్ల అంతర్‌దృష్టి పెరగడం, దేవుని పట్ల భక్తి, శరణాగతి ఏర్పడడం, సృజనాత్మకత మెరుగుపడడం, కాలం పట్ల దృష్టి తగ్గిపోయి ఉన్న స్థితిలో నిశ్చలంగా ఉండడం సాధ్యపడుతుంది. అందుకే మీరు గమనిస్తే మనస్ఫూర్తిగా నిమగ్నమై ప్రదక్షిణ చేసే వారికి టైమ్ అనేది తెలీదు. ఇలా బ్రెయిన్‌లోని ఎడమ, కుడి అర్థ గోళాలు ఒకేసారి కనెక్ట్ అయి ఉండడాన్ని Corpus callosum engagement అంటారు. దీనివల్ల అప్పటి వరకూ పరుగులు పెట్టిన మనస్సులోని ఆలోచనలు స్థిమితపడతాయి. బ్రెయిన్‌లో ఉన్న సమాచారాన్ని ఎప్పుడూ విశ్లేషిస్తూ మానసిక అశాంతికి గురి అయ్యే స్థితి నుండి.. యూనివర్శ్ నుండి ఎనర్జీని స్వీకరించే స్థితి ఏర్పడుతుంది. గుండ్రంగా గుడి కావచ్చు.. ఆత్మ ప్రదక్షిణ కావచ్చు చేసేటప్పుడు చెవి లోపల ఉండ వెస్టిబులార్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. వాస్తవానికి ఈ సిస్టమ్ మన బ్రెయిన్‌కి ఎప్పటికప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, తల పొజిషన్ ఎలా ఉంది, మన కదలిక ఎలా ఉంది వంటి సమాచారాన్ని చేరవేస్తూ ఉంటుంది. కొన్నాళ్లకి ఈ వ్యవస్థ దెబ్బతినడం ద్వారా వెర్టిగో (తల తిరగడం) వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సిస్టమ్‌ని యాక్టివేట్ చెయ్యడానికి ఈ ప్రదక్షిణ సహాయపడుతుంది. అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు స్వల్పమైన హిప్నాటిక్ స్థితికి కూడా చేరుకుంటాం. దీనివల్ల మానసిక వత్తిడి తగ్గి గుడి లోపల పఠించే మంత్రాలను, దేవుడి రూపాన్నీ, పూజారి శఠగోపం ద్వారా ఇచ్చే ఆశీర్వచనాన్నీ ఎలాంటి రెసిస్టెన్స్ లేకుండా సంపూర్ణంగా స్వీకరించగలుగుతాం. దేవుడి విగ్రహం ముందు ప్రదక్షిణ చేసేటప్పుడు "నేను నిమిత్తమాత్రుడిని, నేను ఎంత సంపాదించినా, ఎంత అధికారం ఉన్నా మామూలు మనిషినే" అనే అహరహిత భావన ప్రతీ మనిషిలో ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది. లేదంటే బయట ఎలా మూర్ఖత్వంతో ఎలాగైతే అంతా నేనే అని భావిస్తారో ఆ మూర్ఖత్వం మనిషిలో చొరబడుతుంది. గుడి మధ్య భాగం విశ్వం యొక్క సుషుమ్న నాఢిగా పరిగణించబడుతుంది. అందుకే అక్కడ ప్రదక్షిణ చెయ్యడం ద్వారా మన ఇడా, పింగళ స్థితి నుండి సుషుమ్న నాడిలో శక్తి ప్రవాహం జరగడం మొదలవుతుంది. అంతేకాదు.. పవిత్ర ప్రదేశాలు మంత్ర పఠనం వల్లా, ధ్వజస్థంభాల వల్లా, విగ్రహాల క్రింద ప్రతిష్టించిన యంత్రాల వల్లా కాస్మిక్ ఎనర్జీని స్వీకరిస్తూ చాలా శక్తివంతంగా ఉంటాయి. ఆ ఎనర్జీ కేంద్రకం చుట్టూ మన ఎనర్జీ ఫీల్డ్‌ని ప్రదక్షిణ రూపంలో తిప్పడం ద్వారా గ్రహాలు, నక్షత్ర మండలాలు ఎలా ఓ ఆర్బిట్‌లో తిరుగుతాయో అంత కోహరెన్స్ విశ్వ శక్తికీ, మనకూ మధ్య పొందొచ్చు. మనచుట్టూ మనం ఆత్మ ప్రదక్షిణ చేసేటప్పుడు.. మన ఎనర్జీ ఫీల్డ్, మన వెన్నెముక సెంట్రల్ యాక్సిస్‌గా మారుతుంది. వెన్నెముక ద్వారానే కుంఢలినీ శక్తి యాక్టివేట్ అవుతుంది కాబట్టి సుషుమ్న నాడి ప్రేరేపిడం అయి చక్రాస్ బ్యాలెన్స్ జరుగుతుంది. ఇంత అపురూపమైన శాస్త్రబద్ధంగా కొన్ని వేల క్రితం నుండి పాటించబడుతున్న గొప్ప ఆచారాలను మనకు తెలీకపోవడం వల్ల అపహాస్యం చేస్తున్నాం. మరో వ్యాసంలో మరిన్ని విషయాలు అందిస్తాను. - నల్లమోతు శ్రీధర్
🙏 ❤️ 👍 💐 🫂 28

Comments