
Motivational By Sridhar Nallamothu
June 2, 2025 at 02:01 AM
చెప్పులతో దేవాలయాలకు ఎందుకు వెళ్లకూడదు అంటే.. సైంటిఫిక్ రీజన్, సైంటిఫిక్ స్పిరిట్యువాలిటీ సిరీస్ - నల్లమోతు శ్రీధర్
షూస్, చెప్పులను దేవాలయాల్లోకి నిషేధించడానికి అనేక కారణాలున్నాయి. వాటిని వివరిస్తాను. పాదరక్షలు బయట మీరు నడిచి వచ్చిన వీధుల నుండి పెద్దమొత్తంలో మురికి, విష పదార్థాలు, బ్యాక్టీరియా వంటివి కలిగి ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం షూస్ సోల్స్‌లో కనీసం నాలుగు లక్షల యూనిట్ల బ్యాక్టీరియా ఉంటుందని వెల్లడైంది, వీటిలో జీర్ణకోశ వ్యవస్థకి హాని కలిగించే ఇ.కొలి వంటి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మరో పక్క దేవాలయాలు చాలా శక్తిని కలిగి ఉండే ప్రదేశాలు.
దేవాలయాల్లో ఉండే ఫ్లోరింగ్ గ్రానైట్, క్వార్ట్జ్ రాళ్లని కలిగి ఉంటుంది. ఇవి గుడిలోని వేదమంత్రాలు, గర్భగుడి క్రింద అమర్చిన యంత్రాలు, గుడి గంటల శబ్ధం నుండి వచ్చే వైబ్రేషన్స్, ఫ్లోరింగ్ అడుగున ఉండే భూమి, ఇసుక ద్వారా భూమి సహజసిద్దమైన ఎలక్ట్రో మాగ్నటిక్ ఫ్రీక్వెన్సీ (7.83 Hz)ని నిరంతరం స్వీకరిస్తూ గుడి ఆవరణలోని ఫ్లోరింగ్ కూడా ఛార్జింగ్ చెయ్యబడి ఉంటుంది.
వేదాలు, యోగ సూత్రాల ప్రకారం ఒక మనిషి శరీరంలో ప్రాణశక్తి (ఆక్సిజెన్ కాదు, లైఫ్ ఎనర్జీ) తల నుండి పాదాల వరకూ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మానసిక వత్తిడి వల్ల శరీరంలో కణాలు వత్తిడికి గురి కావడం వల్ల, విపరీతంగా నడిచినప్పుడు మోకాళ్లు, మోచేతులకు, తుంటి ఎముకలకు మధ్య ఏర్పడే రాపిడి వల్ల శరీరంలో పేరుకుపోయే అదనపు అనవవసరమైన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మనం ఇళ్లల్లో ఎర్తింగ్ ఎలా భూమిలోకి ఓ వైర్ పెట్టుకుంటామో అలా నేరుగా భూమిలోకి డిశ్చార్జ్ అవకపోతే అనేక శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. అందుకే పాదరక్షలు వదిలేసి, మట్టిలో గానీ, ఇసుకలో గానీ రోజుకి పది నిముషాలు కూర్చుంటే ఎన్నో జబ్బులు తగ్గడం రీసెర్చ్ గేట్ వంటి అనేక రీసెర్చ్ సైట్లలో ఆధారాలతో నిరూపించబడింది. అంటే మన శరీరంలో అదనపు ఎనర్జీ డిశ్చార్జ్ అవడానికి పాదరక్షలు తీసేయాలన్నమాట. గుడి ఆవరణలో గ్రానైట్ ఫ్లోరింగ్ స్వీకరించిన సూక్ష్మమైన ఎనర్జీని తిరిగి మన పాదాల ద్వారా శరీరంలోకి స్వీకరించానికీ పాదరక్షలు ఉండకూడదు అన్నమాట.
తంత్ర శాస్త్రం ప్రకారం, మన శరీరంలో ప్రధానమైన ఏడు చక్రాలు మాత్రమే కాదు, పాదాల అడుగున సూక్ష్మమైన చక్రాలు ఉంటాయి. ముఖ్యంగా పాదం వంపులో ఉండే ఎనర్జీ పాయింట్‌ని తలహృదయ మర్మ అంటారు. ఈ పాయింట్ భూమి శక్తిని అపాన వాయువు రూపంలో స్వీకరించడంతో పాటు, మన మానసికమైన, ఎనర్జీ బాడీలోని టాక్సిక్స్‌ని ఇదే పాయింట్ ద్వారా శరీరం నుండి భూమిలోకి డిశ్చార్జ్ చేస్తుంది. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ మెరిడియన్ ఛానల్స్ ప్రకారం కూడా పాదాల అడుగున KD1 (కిడ్నీ 1) పాయింట్ ఉంటుంది. వ్యక్తిగతంగా నేను ఎప్పుడైనా అలసటగా ఉన్నప్పుడు దీన్ని యాక్టివేట్ చేసుకుంటే క్షణాల్లో అలసట పోతుంది.
అంతే కాదు, శరీర నిర్మాణాన్ని గమనిస్తే శరీరం మొత్తం వివిధ భాగాలుగా విస్తరించి చిట్ట చివరికి పాదాలకు చేరి రెండు లక్షలకు పైగా చిన్నా, పెద్దా నాడుల చివర్లు పాదాల్లో ఉంటాయి. వీటిని రిఫ్లెక్సాలజీ ప్రకారం రిఫ్లెక్స్ పాయింట్స్ అంటారు. వీటిని గుడిలోని ఫ్లోరింగ్ ద్వారా వచ్చే పాజిటివ్ ఎనర్జీతో స్టిములేట్ చేస్తే ఈ పాయింట్స్ గుండె, లివర్, ఊపిరితిత్తులు వంటి శరీరంలోని అన్ని ముఖ్యమైన అవయువాలకు కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి వాటి పనితీరులో తాత్కాలికంగానైనా మెరుగుదల కనిపిస్తుంది.
ఇలా పాదరక్షలు లేకుండా గుడిలోకి వెళ్లినప్పుడు మన ఎనర్జీ ఫీల్డ్ పైన చెప్పిన కారణాల వల్ల న్యూట్రలైజ్ అయి, తక్కువ స్థాయి ఫ్రీక్వెన్సీల భావోద్వేగాలు, తామసిక గుణం నుండి హై వైబ్రేషనల్ స్థితిలోకి సాత్విక గుణంలోకి మారుతుంది. అందుకే గుడి ఆవరణలోకి ప్రవేశించినప్పటి మానసిక స్థితికి దేవుడి విగ్రహం ముందుకి చేరుకుని దణ్ణం పెట్టుకునే సమయానికీ తెలీకుండానే మానసిక స్థితిలో అహం, ఇతర భావోద్వేగాలు సమసిపోయి మనిషి చాలా ప్రశాంతంగా తయారవుతారు. పాద రక్షలు దేవాలయంలో తొలగించడానికి చివరగా అందరికీ తెలిసిన కారణం.. దైవం పట్ల ఉండే గౌరవభావం. చెప్పులని అహానికి ప్రతీకగా భావిస్తుంటాం. "నేను మామూలు మనిషికి, నా అహాన్ని పక్కనపెట్టి నీ దగ్గరకు వస్తున్నాను" అని దైవం పట్ల శరణాగతి మానసిక స్థితిలోకి వెళ్లడానికి కూడా ఈ ఆచారం అనుసరించబడుతోంది.
మరింత సమాచారంతో మళ్లీ మరో ఆర్టికల్‌లో కలుస్తాను.
- నల్లమోతు శ్రీధర్
🙏
❤️
👍
❤
37