⚡SchoolEdu 👈 Join Now
June 11, 2025 at 12:34 AM
*🔊గ్రూప్-3 ధ్రువీకరణ పత్రాల పరిశీలన వాయిదా*
*🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 1,365 గ్రూప్-3 సర్వీసు పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ నెల 18 నుంచి జులై 6 వరకు జరగాల్సిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన షెడ్యూలును టీజీపీఎస్సీ వాయిదా వేసింది. గ్రూప్-2 సర్వీసు పోస్టుల తుది నియామక ప్రక్రియ ముగిసే వరకు గ్రూప్-3 ధ్రువపత్రాల పరిశీలన వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేసిన విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో కొందరికి రెండు ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. అవరోహణ క్రమంలో గ్రూప్-1, గ్రూప్-2, ఆ తర్వాత గ్రూప్-3 పరిశీలన చేపట్టాలని కమిషన్‌ను కలిసి నిరుద్యోగ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. గ్రూప్-2, 3కు ఒకేసారి పరిశీలన చేపట్టి ఫలితాలు ప్రకటిస్తే రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఏదో ఒకటి వదిలిపెట్టాల్సి ఉంటుంది. కమిషన్ నిబంధనల ప్రకారం ఫలితాలు వెల్లడించాక.. భర్తీ కాని, ఉద్యోగాల్లో చేరని పోస్టులన్నీ బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోతాయి. గతంలో గురుకుల నియామక ప్రక్రియలోనూ అవరోహణ క్రమం పాటించకుండా ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి వరకు అన్ని ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులకు ఒకేసారి ఫలితాలు వెల్లడించారు. దీంతో చాలా మంది ఒకటికి మించి పోస్టులకు ఎంపిక కావడంతో దాదాపు 1,800 పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మారాయి. ఈ పరిస్థితి అధిగమించేందుకు గ్రూప్-2 నియామక ప్రక్రియ ముగిసే వరకు గ్రూప్-3 ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టవద్దని అభ్యర్థులు కోరడంతో కమిషన్ వాయిదా వేసింది. తదుపరి షెడ్యూలు తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m