
Kadapa Heart Beats
June 20, 2025 at 09:31 AM
మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు.. భీమవరంలో నడిరోడ్డుపై వీరంగం...
కాలేజీ బస్సులో విద్యార్థిపై గుంపుగా దాడి
బస్సును వెంబడిస్తూ అసభ్య చేష్టలు
భయభ్రాంతులకు గురైన వాహనదారులు
ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పట్టణంలో నానా హంగామా చేసి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. భీమవరంలో శుక్రవారం కొందరు యువకులు మద్యం సేవించి వీరంగం సృష్టించారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ కాలేజీ బస్సులోని విద్యార్థిపై ఈ యువకులు దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారు. తమపై ఎందుకు దాడి చేస్తున్నారని ఆ విద్యార్థి ప్రశ్నించడంతో యువకులు మరింత రెచ్చిపోయి అతనిపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు.
బాధితుడైన విద్యార్థి ప్రయాణిస్తున్న కాలేజీ బస్సును ఆ యువకులు కొంత దూరం వెంబడించారు. బస్సు వెంట పడుతూ అసభ్యకరమైన చేష్టలు చేయడంతో పాటు నడిరోడ్డుపై డ్యాన్సులు చేస్తూ అలజడి సృష్టించారు. వారి ప్రవర్తనతో రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కొందరు చిత్రీకరించడంతో అవి సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
