Keshaboina Sridhar BJP 
                                
                            
                            
                    
                                
                                
                                June 13, 2025 at 09:28 PM
                               
                            
                        
                            ‘‘మేకిన్ ఇండియా’’ సత్తా ఇదీ... 35 రేట్లు పెరిగిన దేశ రక్షణ ఎగుమతులు
భారత దేశ రక్షణ పరికరాల విషయంలో ప్రపంచ దేశాలకు విపరీతమైన నమ్మకం పెరిగింది. భారత్ తయారు చేసే వాటిని కొనుగోలు చేసుకోవడానికి ప్రపంచ దేశాలు కొన్ని ముందుకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా గత 11 సంవత్సరాలలో భారత దేశ రక్షణ ఎగుమతులు 35 రేట్లు పెరిగాయి. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. అలాగే రాబోయే కొద్ది రోజులలోనే రక్షణ రంగంలో పూర్తిగా స్వావలంబన కూడా సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
 
2014 తో పోలిస్తే నేడు భారత దేశ రక్షణ ఎగుమతులు 35 శాతం మేర పెరిగాయని తెలిపారు. 2013,4 లో రక్షణ ఎగుమతులు కేవలం 686 కోట్లుగా వుండగా, ఇప్పుడు 2024-2025 నాటికి 23,662 కోట్లకు పెరిగాయని రక్షణ మంత్రి ప్రకటించారు.
 
మన దేశంలో తయారయ్యే రక్షణ ఉత్పత్తులు దాదాపు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, ఈ సంవత్సరం రక్షణ ఎగుమతులలో 30,000 కోట్లు అని, వచ్చే 2029 సంవత్సరం నాటికి 50,000 కోట్లు సాధించడమే తమ లక్ష్యమని కూడా వెల్లడించారు.
 
ఈ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా ఆత్మ నిర్భర్ దిశగా భారత్ అడుగులు వేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఓ దేశం తన సొంత రక్షణ పరికరాలను, సొంత ఆయుధాలను, యుద్ధ విమానాలను, క్షిపణులను తయారు చేయడం ప్రారంభించినప్పుడు, విశ్వాసం పెరుగుతుందని, ప్రపంచ దేశాలకు ఓ బలమైన సందేశాన్ని కూడా పంపినట్లవుతుందని వివరించారు. దీని ద్వారా రక్షణ రంగంలో స్వావలంబన కలుగుతుందని, సమర్థవంతులం అవుతామని, ఇతరులపై ఆధారపడటం కూడా తగ్గిపోతుందన్నారు.
ఈ సందర్భంగా శత్రువులను ఎదుర్కొనే విషయంలో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు, రక్షణ సాంకేతికతలను ఉపయోగిస్తున్నామని, వీటి ప్రాముఖ్యత కూడా పెరిగిందని నొక్కి చెప్పారు. నేడు మన సాయుధ దళాలు దిగుమతి చేసుకున్న ఆయుధాలే కాకుండా, దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణులు, ట్యాంకులతో పాటు ఇతర ఆయుధ సామాగ్రితో కూడా శత్రువులపై విరుచుకుపడడానికి సన్నద్ధమయ్యాయని అన్నారు. అలాగే భారత్ లోనే తయారైన అగ్ని, పృథ్వీ, బ్రహ్మోస్ వంటి క్షిపణులు ఏవిపత్తునైనా ఎదుర్కోడానికి ఎలాగూ సంసిద్ధంగానే వున్నాయని ధీమా వ్యక్తం చేశారు.మన దేశం ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి విమాన వాహక నౌకలను నిర్మించగల సామర్థ్యాన్ని కూడా కలిగి వుందన్నారు.
 
తమ ప్రభుత్వ హయాంలో దేశీయ రక్షణ ఉత్పత్తిలో వృద్ధి కూడా కలిగిందని అన్నారు. దేశీయ కంపెనీలను ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ గణనీయమైన ఫలితాలే ఇచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 2014 లో దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 40 వేల కోట్లు వుండగా, నేడు అది 1.3 లక్షల కోట్ల రికార్డును దాటిపోయిందని, క్రమంగా పెరుగుతూనే వుందని మంత్రి తెలిపారు.
 
ఈ సంవత్సరం రక్షణ ఉత్పత్తిలో 1.6 లక్షల కోట్లను అధిగమించడమే తమ లక్ష్యమని రాజ్ నాథ్ ప్రకటించారు. 2029 నాటికి 3 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాజ్ నాథ్ ప్రకటించారు.