TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati
                                
                            
                            
                    
                                
                                
                                June 21, 2025 at 03:19 AM
                               
                            
                        
                            నకిలీ దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేస్తే కఠిన చర్యలు - సివిఎస్వో కె.వి. మురళీ కృష్ణ
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు నకిలీ దర్శన టికెట్ల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని టిటిడి సివిఎస్వో  కె.వి. మురళీ కృష్ణ హెచ్చరించారు. గత మార్చి నెలలో *విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల వైద్య  విద్యార్థిని* కుమారి. డి. సంగమిత్రకు శ్రీవారి సుప్రభాత సేవ, ప్రోటోకాల్ దర్శనం, వసతి  టికెట్లు ఇప్పిస్తామని మదనదీపు బాబు @ సందీప్, పవన్ కుమార్ లు *రూ.2.60 లక్షలు వసూలు చేశారని,* బాధితురాలి ఫిర్యాదు మేరకు *తిరుమల 2 టౌన్ లో సదరు నిందితులపై కేసు* నమోదు చేశామన్నారు. 
 కొంతమంది దళారులు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండడంతో దళారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి దర్శనాల కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికావద్దని ఆయన కోరారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు పొందిన టికెట్లను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పరీక్షించడం జరుగుతుందన్నారు. ఆ సమయంలో భక్తులు పొందిన టికెట్లు నకిలీగా తేలితే అనవసరమైన ఇబ్బందులు గురికావాల్సి వస్తుందన్నారు.
శ్రీవారి భక్తులకు మోసపూరిత మాటలు చెప్పి నకిలీ దర్శన టికెట్లు, వసతి కల్పిస్తామని దళారులు  ఎవరైనా చెప్పినా నమ్మవద్దని టిటిడి సివిఎస్వో వెల్లడించారు. దళారులు ఎవరైనా భక్తులను ప్రలోభాలకు గురి చేసి శ్రీవారి దర్శనం, వసతి ఇప్పిస్తామని,   డబ్బులు పంపాలని ఎవరైనా ఫోన్ లు చేసినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. టిటిడి విజిలెన్స్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని, సదరు నెంబర్ కు 0877 - 2263828 ఫోన్ చేసి అనుమానాలను భక్తులు నివృత్తి చేసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, దళారులు శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో దందా చేస్తే వెంటనే సదరు మోసపూరిత వ్యక్తులు, దళారుల వివరాలను  ఫోన్ చేసి టిటిడి విజిలెన్స్ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. 
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు టిటిడి అధికారిక వెబ్ సైట్  https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే ఆన్ లైన్ లో తమ ఆధార్ కార్డ్ ఆధారంగా టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని భక్తులను కోరారు.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        9