TGEMPLOYEES
June 19, 2025 at 02:07 AM
*🔊మెడికల్‌ పీజీ విద్యార్థుల స్టైపెండ్‌కు ఎగనామం!* *🔶ప్రైవేటు వైద్య కళాశాలల నిర్వాకంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు* *🍥సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో పీజీ కోర్సులు చేసే జూనియర్‌ డాక్టర్లు, ఎంబీబీఎస్‌ పూర్తి చేసి డ్యూటీ డాక్టర్లుగా పనిచేసే విద్యార్థులకు నెలనెలా ఇవ్వాల్సిన స్టైపెండ్‌ను యాజమాన్యాలు ఎగ్గొడుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. కొన్ని కాలేజీలు మొత్తం స్టైపెండ్‌కు ఎగనామం పెడుతుండగా, కొన్ని కాలేజీలు నామమాత్రంగా ఇస్తూ, 70 శాతం వరకు వెనకేసుకుంటున్నట్లు సమాచారం. విద్యార్థులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి ఏటీఎం కార్డులు, చెక్కులు ముందే తీసుకుంటున్న యాజ మాన్యాలు..జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) నిబంధనల మేరకు స్టైపెండ్‌ విద్యార్థుల ఖాతాల్లో వేసినట్టే వేసి తిరిగి విత్‌ డ్రా చేసుకుంటున్నాయని తెలుస్తోంది.* *✴️ఈ విధంగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు నెలనెలా విద్యార్థులకు ఇవ్వకుండా సొమ్ము చేసుకుంటున్న మొత్తం రూ.కోట్లలోనే ఉంటుందని అంచనా. ఇలా గత కొన్నేళ్లుగా ప్రైవే టు యాజమాన్యాల కక్కుర్తి దందా కొనసాగుతోందంటూ పీజీ విద్యార్థులు తాజాగా నిరసనలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) మార్గదర్శ కాల ప్రకారం కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేకున్నా.. విద్యార్థుల నుంచి కోట్లలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు చివరకు..ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించేవారికి నెలవారీ ఖర్చుల కింద చెల్లించే స్టైపెండ్‌ విషయంలోనూ కక్కుర్తి పడుతున్నాయని జూనియర్‌ డాక్టర్లు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.* *💥నెలకు సగటున రూ.60 వేల చొప్పున* *🌀రాష్ట్రంలో మొత్తం 35 పీజీ కళాశాలలు ఉండగా, అందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో 12, ప్రైవేటు యాజమాన్యాల కింద 23 ఉన్నాయి. 35 కళా శాలల్లో కలిపి 2,750 పీజీ సీట్లు ఉండగా..వీటిలో ప్రభుత్వ కళాశాలల్లో 1,313, ప్రైవేటు కళాశాలల్లో 1,296, మూడు మైనారిటీ కాలేజీల్లో 141 సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్‌ పూర్తయిన విద్యార్థులు ఏడాది ఇంటర్న్‌షిప్‌ కింద హౌస్‌ సర్జన్లుగా పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతినెలా రూ.22,527 మొత్తాన్ని ఏడాది పాటు యాజమాన్యాలు చెల్లించాల్సి ఉంటుంది.* *💠ఇక పీజీ డాక్టర్లకైతే ఫస్ట్‌ ఇయర్‌ రూ.50,686, సెకండ్‌ ఇయర్‌ రూ.53,503, థర్డ్‌ ఇయర్‌ 56,319 చెల్లించాలి. పీజీ డిప్లొమా చదివే మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.50,686, రెండో సంవత్సరం వారికి రూ.53,503 చెల్లించాలి. సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు చేసే వారికి మూడేళ్ల పాటు వరుసగా రూ.80,500, రూ.84,525, రూ.88,547 ఇవ్వాలి. ఎండీలకు మూడేళ్ల పాటు 50,686, రూ.53,503, రూ.56,319 లెక్కన చెల్లించాలి.* *🛟సీనియర్‌ రెసిడెంట్లకు రూ.80,500 చెల్లించాలి. ఇలా ఒక్కో విద్యార్థికి నెలకు సగటున రూ.60 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని అంచనా. 2023లో వచ్చిన జీవో నంబర్‌ 59 ప్రకారం రెండేళ్లకోసారి స్టైపెండ్‌ను 15 శాతం పెంచాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఈ ఏడాది నుంచి స్టైపెండ్‌ పెరగాల్సి ఉంది. అయితే అసలు స్టైపెండ్‌కే దిక్కులేని పరిస్థితుల్లో పెంచే మాటే ఉత్పన్నం కాదని విద్యార్థులు వాపోతున్నారు.* *💥ఖాతాలు తెరిపించి.. ఏటీఎం కార్డులు, చెక్కులు తీసేసుకుని..* *💫పీజీ కోర్సులో విద్యార్థి అడ్మిషన్‌ తీసుకున్న సమయంలోనే కాలేజీల యాజమాన్యాలు వారి పేరిట కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తాయి. విద్యార్థులు చెప్పిన సమాచారం ప్రకారం..పాస్‌బుక్, ఏటీఎం కార్డు, సంతకం చేసిన చెక్‌బుక్‌లు తీసేసుకుంటున్నాయి. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం విద్యార్థుల ఖాతాల్లో నిర్దేశిత స్టైపెండ్‌ను జమ చేసి, రెండు, మూడురోజుల్లోనే తిరిగి ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసేసుకుంటున్నాయి. కొన్ని కళాశాలలు మరీ కక్కుర్తితో వ్యవహరిస్తూ మొత్తం స్టైపెండ్‌ను విత్‌డ్రా చేసుకుంటుండగా, మరికొన్ని కళాశాలలు మాత్రం కొంత మొత్తాన్ని విద్యార్థి ఖాతాలో ఉంచేస్తున్నాయి.* *✳️తమకు స్టైపెండ్‌ ఇవ్వకపోవడంతో నెలవారీ ఖర్చులకు ఇబ్బంది అవుతోందని విద్యార్థులు వాపోతున్నారు. ఇలా వుండగా జూనియర్‌ డాక్టర్ల ఆందోళనలను అణచి వేసేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నా యనే ఆరోపణలు విన్పి స్తున్నాయి. గతంలో ఇదే అంశంపై దాదాపు 13 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు ఎన్‌ఎంసీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అయినా యాజమాన్యాల్లో ఎలాంటి స్పందన లేదని, ఎన్‌ఎంసీ మరోసారి జోక్యం చేసుకోవాలని, ప్రభుత్వం కూడా స్టైపెండ్‌ ఇప్పించి తమకు న్యాయం చేయాలని పీజీ మెడికల్‌ విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.*

Comments