
అంతర్యామి
May 25, 2025 at 02:24 AM
*అపరోక్షానుభూతి-22*
*శంకర భగవత్పాద విరచిత*
*బ్రహ్మవిద్యా విధానము*
(137)
_అనేనైవ ప్రకారేణ వృత్తిం బ్రహ్మాత్మికా భవేత్| ఉదేతి శుద్ధ చిత్తానాం వృత్తి జ్ఞానం తతః పరమ్॥_
ఈ ప్రకారంగా చేసే తత్వ విచార సాధన వల్ల, బ్రహ్మాను సంధానం సంప్రాప్తమయే సమర్థ వంతమైన వృత్తి కలుగుతుంది. ఇలా పాధన కొన సాగిస్తే, శుద్ధ చిత్తులైన సాధక మహాశయులకువృత్తి జ్ఞానం (బ్రహ్మానుభవ జ్ఞానం) ఉదయిస్తుంది.
(138)
_కారణం వ్యతిరేకేణ పుమనాదౌ విలోకయేత్। అన్యయేన పునః తద్ది కార్యే నిత్యం ప్రపశ్యతి॥_
ఇలాచేసే తత్వ విచార సాధనలో, ముందు కారణాల్ని వ్యతిరేక భావంతో అవగాహన చేసు
కోవాలి. తరువాత దాన్ని అన్వయ దృష్టితో గ్రహించుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల ఎల్లప్పుడూ కారణం కార్యంలో అనుభూతమై వుండేదే అని తెలుసుకుంటాడు.
(139)
_కార్యేహి కారణం పశ్యేత్ పశ్చాత్ కార్యం విసర్జయేత్ కారణత్వం తతో గచ్చే దవశిష్టం భవేన్మునిః॥_
సాధకుడు ఎల్లప్పుడూ కార్యంలో కారణాన్నే చూస్తూ, దానిమీదే దృష్టిని వుంచుతూ కార్యాన్ని పూర్తిగా విసర్జించాలి. ఇలా కార్యాన్నంతటినీ విడిచి పెడితే, కారణత్వం కూడా అదృశ్యమై ఇక శేషించి వుండే తానే బ్రహ్మస్వరూపుడై భాసిస్తాడు.
(140)
_భావితం తీవ్ర వేగేన యద్వసు నిశ్చయాత్మనా! పుమాన్ తద్ది భవేత్ శీఘ్రం జ్ఞేయం భ్రమర కీటవత్ ॥_
నిశ్చయమైన గట్టి నమ్మకం కలిగిన సాధకుడు తీవ్రతరమైన వేగంతో ఏ వస్తువును నిలకడగా భావిస్తూంటాడో, శీఘ్రకాలంలో తానే ఆ జ్ఞేయ వస్తువు అవుతాడు. భ్రమర కీటక న్యాయం దీనికి దృష్టాంతం. (భ్రమరము ఒక రకమైన కీటకాన్ని తెచ్చి తన గూటిలో ఉంచి, దాని చుట్టూ రొద చేస్తూంటే, ఆ కీటకం భయంతో నిరంతరం ఆ భ్రమరాన్నే భావిస్తూ. చివరికి అది భ్రమరంగా మారుతుంది.)
(141)
_అదృశ్యం భావరూపం చ సర్వమేవ చి దాత్మకం | సావధానతయా నిత్యం స్వాత్మానం భావయేత్ బుధః ॥_
వివేకమతులైన సాధక మహాశయులు ద్రష్ట, దృక్కు, దృశ్యము అనే మూడింటితో కూడిన ఈ గోచరాగోచర సర్వ జగత్తూ ఆత్మ స్వరూప మేనని సావధాన చిత్తంతో జాగ్రత్తగా నిత్యమూ భావించు కొనుచూ ధ్యాన నిమగ్నులై వుండాలి.
(142)
_దృశ్యం హ్యాదృశ్యతాం నీత్వా బ్రహ్మాకారేణ చింతయేత్ | విద్వాన్నిత్య సుఖే తిషేద్ధియా చిద్ర సపూర్ణ యా ॥_
ఇంద్రియాలకు, మనస్సుకు గోచరించే దృశ్య ప్రపంచం యొక్క నామ రూపాదులన్నింటినీ మిథ్యాగా విస్మరిస్తూ, అదంతా ఆకార సూన్యమైన అద్వయానంద బ్రహ్మ స్వరూపమేనని నిశ్చయించు కొనుచూ, ధ్యాన నిష్ఠలో నిమగ్నుడై వుండే సాధక మాహానుభావుడు నిత్యమూ మహా సుఖసంపన్న మైన పరిపూర్ణ బ్రహ్మానందానుభూతితో ఓలలాడుతూ ఉండగలడు.(సశేషం)
