
అంతర్యామి
May 27, 2025 at 11:51 PM
*భయాందోళనలు ఎలా పోతాయి ?*
స్వామి రామా కు పాములంటే విపరీతమైన భయం . హిమాలయాలలో గంగా తీర అరణ్యాలలో నిర్భయం గా పులులు సింహాలమధ్య తిరిగినా పాములంటే భయం ఉండేది .
1939 సెప్టెంబర్ లో రుషీ కేష్ నుంచి వీరభద్ర కు గురువు బెంగాలీ బాబా తో వెడుతూ తెల్లవారుజామునే గంగలో స్నానించి ఒడ్డున ధ్యానమగ్నమయ్యాడు దాదాపు మూడుగంటలు సమాధిలో ఉండిపోయాడు ఉదయం ఏడున్నర అయ్యేసరికి కళ్ళు తెరిచి చూడగా పెద్ద నాగుబాము పడగా విప్పి రెండు అడుగుల దూరం లో స్వామిరామాపై తీవ్ర దృష్టి పెట్టి కనిపించింది .భయపడ్డాడు ఏం చేయాలో తోచక మళ్ళీ ధ్యానం లో పడ్డాడు .మళ్ళీ కళ్ళు తెరిచేసరికి పాము అక్కడే అదే పొజిషన్ లో ఉంది .ఇక లాభం లేదనుకొని భయపడి పరిగెత్తాడు అదీ వెంటబడి పొదల్లో దూరింది ..గుహకు వెళ్లి గురువుకు చెప్పాడు .ఆయన నవ్వుతూ ”బ్రతికి ఉన్న ఏ జంతువుకైనా ధ్యాన మగ్నమైన వాని ముందు ధ్యానం స్థితిలో ఉండి పోతుంది ”అని సత్యం చెప్పాడు . మరో వింత అనుభవం ఆయనకు ఎదురైంది .గురువు దక్షిణభారత దేశం లో కొంతకాలం గడిపి రమ్మని ఆదేశిస్తే వెళ్లి ఒకరోజు ఒక దేవాలయం కు లో రాత్రి పడుకోవటానికి ఆశ్రయం ఇవ్వమని కోరాడు .అప్పుడు పూజారి ”నువ్వు స్వామీజీవి అయితే ఆశ్రయం ఎందుకు ”?అని అడిగాడు .ఇంతలో ఒక స్త్రీ తన వెంట వస్తే ఉండటానికి చోటు చూపిస్తానన్నది ..ఆమె రామా ను ఆరడుగుల గుడిసె చూపించి ఉండమన్నది .అప్పడు ఆయనవద్ద ఉన్నవి కూర్చోటానికి జింక చర్మం ,ఒక శాలువా ఒక అంగోస్త్రం మాత్రమే ..ఆ గుడిసెలో తలుపులాంటి ఖాళీ నుంచి వెలుగే తప్ప ఏదీ లేదు .కాసేపటికి ఒక నాగుబాము ముందు పాకుతూ కన్పించింది .తర్వాత ప్రక్కన ఒకటి ,మరికాసేపటికి గుడిసె నిండా పాములే పాములు .ఒళ్ళు జలద రించింది స్వామికి .అది సర్ప దేవాలయమేమో నను కున్నాడు ..చాలా భయమేసింది బహుశా ఆ అమ్మాయి తాను నిజమైన స్వామో కాదో పరీక్షకోసం ఈ గుడిసెకు పంపించి ఉంటుంది అనుకున్నాడు ..అప్పటికి రామా పూర్తిగా స్వామి కాలేదు .అప్పుడప్పుడే అభ్యాసం లో ఉన్నాడు . భయపడి పారిపోతే ఎక్కడికి వెళ్లి తలదాచుకోవాలి ?పారిపోతే ఇక ఆఊళ్లో ఏ సాధకుడికి ఎవరూ భిక్ష పెట్టరు .కనుక చావో రేవో పాములమధ్య గుడిసెలోనే ఉండి పోవాలను కొన్నాడు ..తనను ఇక్కడకు తీసుకొచ్చిన ఆవిడ జ్ఞాని కాదు కానీ ధైర్యంగా పాముల గుడిసెలోకి రా గలిగింది .కనుక తానూ అక్కడే పాముల మధ్యనే రాత్రి గడపాలని కొని ఉండి పోయాడు ..అలానే ఉన్నాడు .కానీ తన ధ్యానం మర్చి పోయి పాముల ధ్యానం లో ఉన్నాడు పాములు ఆయన జోలికే రాలేదు . ..తెల్లవారాక బయటికి వెళ్ళాడు ఆయనను పాములు ఏమీ చేయలేదు కానీ భయం మాత్రం పోలేదు .తర్వాత మనసులో వితర్కించుకొన్నాడు .తాను బ్రహ్మ సూత్ర భాష్యం తేలికగా బోధిస్తున్నాడు కానీ మనసులో పిరికి తనం పోలేదు ..ఈ భయం ఎలా ఉందంటే ధ్యానం పూర్తి చేసి కళ్ళు తెరిచి చుట్టూ పాములున్నాయేమో నని వెదికేవాడు .భయాన్ని పోగొట్టుకోవాల్సిందే అనుకున్నాడు ..గురువును చేరి దీనికి మార్గమేమిటో తెలుసుకొందామన్నాడు .ఆయన రామాను చూడగానే ”నీకేమి కావాలో నాకు తెలుసు .నీకు పాములంటే భయం కదా ”అన్నాడు మనసులో మాటకనిపెట్టి .”నీకు భయమని నా కెప్పుడూ చెప్పలేదే అన్నీ నాకు చెప్పేవాడివి దీన్ని ఎందుకు దాచావు ?”అన్నాడు .ఎందుకో కానీ గురువుకు తనకున్న పాముభయం గురించి చెప్పలేదు .
అడవిలోకి తీసుకు వెళ్లి ”రేపు ఉదయం నుంచి మనం మౌనం పాటిస్తున్నాం .తెల్లవారు జామున మూడున్నరకే లేచి నువ్వు అడవి ఆకులు పూలు ఏరి తేవాలి .వాటితో మనం ప్రత్యేక పూజ చేద్దాం ”అని చెప్పాడు .అలాగే లేచిచీకటిలోనే అక్కడ పోగుపడిన ఆకులు చూసి వాటిని చేతిలో పట్టుకున్నాడు ఆకులతోపాటు ఒక నాగు పాము చేతికి చుట్టుకు పోయింది .చెమటలుపట్టాయి భయం తో తప్పించుకొనే అవకాశం లేదు .ఇంతలో గురువు చూసి దాన్ని తనదగ్గరకు తీసుకురమ్మన్నాడు ..అసలే వణికి పోతున్నాడు భయం తో .గుర్వాజ్ఞ తో మరీ భయం పెరిగింది ”అది నిన్ను కరవదు తీసుకురా ”అన్నాడు .రామాకు చేతిలో మృత్యువే ఉందనిపించింది నమ్మకం కంటే భయం బలీయమైంది .గురువును చేరగా ”నువ్వు పాములను ఎందుకు ప్రేమించలేవు ?”అని అడిగాడు . ”భయం తో చస్తుంటే ప్రేమ ఏమిటి నా బొంద ”అన్నాడు .భయపెట్టే వారిని మనం ప్రేమించలేము ఆదిలోకసహాజం . అప్పడు గురువు ”ఇది అందమైన జంతువు . అన్ని చోట్ల తిరుగుతుంది .అయినా చూడు అది ఎంత పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉందొ .ప్రపంచ జీవులలో పాము ఒక్కటే అత్యున్నత స్వచ్ఛమైన జీవి . ”అన్నాడు .అందం సరే ప్రమాదం సంగతి ?”అన్నాడు స్వామిరామా .మనిషి పాముకంటె అతి మురికి ,విష జంతువూ కూడా .ప్రతిక్షణం కోపం పగలతో రగిలి అవతలివారికి హాని చేస్తూ ఉంటాడు .పాము ఆత్మ రక్షణకు మాత్రమే కాటేస్తుంది ..నువ్వు నిద్రలో ఉంటె నీ వ్రేళ్ళు కళ్ళను పొడుస్తాయా ,నీ నాలుకను పళ్ళు కొరుకుతాయా ?లేదే .శరీర భాగాలన్నిటికి ఒక చక్కని అవగాహన ఉంటుంది .అలాగే సకల చరాచరం ఒకటే అన్న భావన కలిగితే ఏ జంతువూ వలనా భయమనేది ఉండదు . ”అన్నాడు గురువు చెప్పిన0తసేపు నాగుపాము స్వామి చేతిలోనే ఉంది క్రమంగా భయం తగ్గింది .మనసు లో ”నేను పామును ఏమీ చేయక పొతే పాము నన్నేం చేస్తుంది ?అనే ఎరుక కలిగింది .అంతే పాము నెమ్మదిగా జారీ ఎటో వెళ్ళిపోయింది .అప్పటి నుంచి పాము అంటే భయం పోయింది .ఏ జంతువైనా తనకు అపకారం జరిగితే తప్ప మీద పడవు .వాల్మీకి ,సెయింట్ ఫ్రాన్సిస్ బుద్ధుడు మొదలైన వారందరూ జీవ ప్రేమికులే ..యోగ సూత్రాలలో మొదటిది అహింస .అహింస అంటే చంపక పోవటం ,హాని చేయకపోవటం ,గాయం చేయకపోవటం.ఆత్మ శక్తికి మించిన బలం లేదు .
”నేను హిమాలయాలలో ,అరణ్యాలలో ఎన్నో చోట్ల తిరిగాను..నాకు తెలిసినంతవరకూ నేను వున్నంతవరకు ఏ సాధువు, యోగి, స్వామిలపై ఏ క్రూర జంతువూ దాడి చేసినట్లు చూడలేదు వినలేదు ఈ మహానుభావులు తమను తాము రక్షించుకోవటానికి ఏ సాధనాలు లేనివారు ..వీరిని హిమపాతాలు,ప్రక్రుతి ప్రళయాలు కూడా ఏమీ చేయలేదు . వారి బలీయమైన ఆత్మ శక్తికి అన్నీ తలవంచుతాయి . ఈ నిర్భయత్వమే వ్యక్తిగత చేతన ను అధిగమించి విశ్వ చేతనలో చేరటానికి దారి చూపిస్తుంది .ఎవరు ఎవరిని చంపుతారు ?ఆత్మ అనంతమైనది .శరీరం ఎప్పుడోఅప్పడు మట్టిలో కలిసిపోయేదే .హిమాలయ యోగులు ఏ శాఖ వారైనా ఈ గొప్ప భావం తోనే జీవించి తరించారు ”అంటాడు స్వామిరామ .
స్వామి రామ తారై భవాల్ నుండి నేపాల్ లోని ఖాట్మాండుకు ఒక్కడే నడుచుకుంటూ బయలుదేరాడు ..రోజుకు సుమారు ముప్ఫయి మైళ్ళు నడిచేవాడు .సాయంత్రం సూర్యాస్తమయం కాగానే చితులు పేర్చి మంట వేసుకొని ,ధ్యానం చేసి విశ్రాంతి తీసుకొని, మళ్ళీ తెల్లవారుజామున నాలుగింటికి లేచి నడక సాగించిపది గంటల వరకు నడిచి ఏదో చెట్టుకింద ఆగి మధ్యాహ్నం మళ్ళీ బయల్దేరి సాయ0త్రం ఏడు దాకా నడిచేవాడు .చెప్పులు లేకుండా ఒక దుప్పటి ,పులిచర్మం ,చిన్న కుండలో నీళ్లు ఇవే ఆయన సామాగ్రి ..ఒక రోజు సాయంత్రం ఆరింటికి అలసి పోయి చిన్న గుహలో విశ్రాంతి కి వెళ్ళాడు .అది చీకటి గుయ్యారం .లోపల మూడు పులిపిల్లలు కనిపించాయి అవి పుట్టి 15 రోజులు మాత్రమే అయి ఉంటుంది .అవి స్వామి దగ్గరకు వాళ్ళ అమ్మ ఏమో ననుకొని వచ్చి నాకుతున్నాయి .భయపడకుండా వాటిని మచ్చిక చేసుకున్నాడు .కూర్చోగానే గుహ ద్వారం దగ్గర వాటి తల్లి వచ్చి నుంచుని ఉండటం చూశాడు .మొదట్లో అది లోపలికొచ్చి తనమీద పడి చంపేస్తుందేమో ననుకొన్నాడు .తర్వాత మనసులో ”నేను ఈ పులి కూనలకు ఏఅపకారం చేయలేదు .పులి దారిఇస్తే నేను బయటికి వెళ్ళిపోతాను ”అని అనుకోని దుప్పటి నీళ్లకుండా తీసుకొని లేచి నిలబడ్డాడు .ఈయన్ను చూసిన పులి దారి ఇస్తున్నట్లుగా గుహ ద్వారం నుండి పక్కకు తప్పుకున్నది ..స్వామి రామ గుహ లోంచి బయటికి వచ్చి పదడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తే పులి నెమ్మదిగా గుహలోకి ప్రవేశించి పిల్లలను చేరినట్లు గమనించాడు .దీన్ని బట్టి జంతువులూ అతి తేలికగా హింసను భయాన్ని వాసన చూడగలవు .అప్పుడే అవి అతి తీవ్రంగా ఆత్మ రక్షణకు ఎదురు దాడి చేస్తాయి .సాధారణంగా జంతువులు చాలా రక్షణ నిచ్చి సహాయం చేస్తాయి మనుషులు ప్రమాద సమయాలలో ఒకరిని ఒకరు వదిలేసి పారిపోతారు .కానీ జంతువులూ అలా ప్రవర్తించవు .ఆత్మా రక్షణ సకల జీవులకు ఉంటుంది .కానీ మనుషులకంటే జంతువులు ప్రేమకు అంకితమై ఉంటాయి వాటి మిత్రత్వం నమ్మదగినదే .,షరతులు లేనిదే .మానవుడు అలాకాదు -- గబ్బిట దుర్గా ప్రసాద్
