
అంతర్యామి
May 28, 2025 at 08:20 PM
రమణాశ్రమ లేఖలు 2 (22_11_45)
*ఏది స్పురణ*
'హృషీకేశానంద ' అనే ఒక బెంగాలి కాషాయాంబరధారి నిన్ననే ఇక్కడికి వచ్చారు. ఈ ఉదయం దాదాపు ఎనిమిదిన్నర మొదలు పదకొండు గంటల వరుకూ భగవాన్ వారితో ఒకే విధంగా ఆధ్యాత్మిక ప్రసంగం చేసారు. ఆ వాణి అమృతమయమైన అడ్డులేని గంగా ప్రవాహం.ఆ మహా ప్రవాహాన్ని వర్ణిస్తూ కలం నడపటం నా చేత అవుతుందా? ఆ అమృతం , భక్తి అనే దోసిలితో తృప్తి తీర తాగాల్సిందే కానీ కాగితంలో పోసి కట్టగలనా ?
శ్రీవారికి చిన్నప్పుడు మధురలో మరణభయం కలిగినప్పుడు గోచరించిన అనుభవాన్ని గురించి చెపుతూ ఉంటే ఆ మూర్తిని చూడడానికి ఈ రెండు కళ్ళు,ఆ మాటలు వినడానికి ఈ రెండు చెవులూ చాలలేదు. వినేవారి యోగ్యత ననుసరించి చెప్పేవారి ఉత్సాహం పెరగటం సహజమే కదా. ఆ స్వామి అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన ఒక్కొక్క మాటా విపులంగా రాయాల్సిందే కానీ, ప్రస్తుతం హాల్లో ఆడవాళ్ళ స్థలం కొంచెం దూరంగా ఉండటం వల్ల అందులోనూ నేను చివర కూర్చుని ఉండటం వల్ల, సరిగా వినపడలేదు. ఒకటి మాత్రం బాగా వినపడ్డది " మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం అణిగినా అహంస్పురణ తనంత తాను తనలో ప్రకాశింపగా అందుకే 'నేను' కానీ జడశరీరం నేను కాదనిపించింది. ఈ స్వస్పురణ ఎప్పుడూ చెడిపోవనిది దేనికీ చెందనిది, తానుగా ప్రకాశించునది . ఈ శరీరం దహించినా ఇది చెడదు. కాబట్టి ఇదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకొంటిని." అని సెలవిచ్చారు. లోగడ ఇలాంటి ప్రసంగాలెన్నో జరిగినవి.ఎన్నెన్ని రత్నాలు, మాణిక్యాలు జారవిడిచానా అని ఇప్పుడనిపిస్తోంది. ఎన్నాళ్ళనుంచో నీవు రాయమంటున్నా కూడా లక్ష్యపెట్టని ఈ సోదరి సోమరితనాన్ని మన్నిస్తావు కదూ ! ~సూరినాగమ్మ
