
అంతర్యామి
May 28, 2025 at 08:43 PM
*రమణాశ్రమ లేఖలు 3* (23_11_45)
*ఉమా మహేశుల కలహం*
ఈ మధ్యాహ్నం భక్తులు అందరితో పాటు విశ్వనాధులు సమీపంలో ఉండగా వారితో మాట్లాడుతూ ఏ కారణం వల్ల జ్ఞప్తికి వచ్చిందో కానీ ఒక వృధ్ధ వితంతువు గురించి భగవాన్ ఇలా అన్నారు ( ఆమె కీలూరు అగ్రహారం లో భగవానునికి అన్నం పెట్టి ఆదరించిన ముత్తుకృష్ల భాగవతార్ చెల్లెలని తరువాత తెలిసింది). ఆ ఇల్లాలు నాకు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా నైవేద్యానికని వండిన సాక్ష్యాలు కొన్ని పొట్లం గట్టి 'నాయనా ఇవి జాగ్రత్తగా దాచుకుని తోవలో తిను. ' అని ప్రేమతో ఇచ్చింది. ' నాయనా , ఇలా ఇక్కడున్నావా ? బంగారం వంటి శరీరమే, గుడ్డ అయినా కప్పుకోవే' అనేది" అని ఆమె ప్రేమను గురించిన ఆ మాటలు చెపుతూ ప్రేమపూరిత హృదయులైనారు భగవాన్. కంఠం గద్గదిక వహించింది. ఆ దృశ్యం చూస్తే ' జ్ఞానుల హృదయం వెన్న వంటిదని,పూర్ణ ప్రేమయే జ్ఞానమని ' అనెడి పెద్ధల వొక్యం జ్ఞాపకం వచ్చింది.
ఆ మధ్య భగవాన్ అరుణాచల పురాణంలో గౌతములు అంబను స్తుతించే ఘట్టం చదువుతూ అశ్రుపూరిత నేత్రాలతో మాటరాక పుస్తకం అవతల పెట్టి మౌనం వహించారు.ప్రేమపూరితమైన సంఘటనలు జరిగినా భక్తి ప్రధానమైన ఘట్టాలు చదివినా భగవంతులిట్లా ప్రేమ రసభరితులు కావటం సాధారణంగా చూస్తూ ఉంటాము. చూడగా ప్రేమ, భక్తి,జ్ఞానరూపాంతరాలన్న భావం ధృడపడుతున్నది.
దాదాపు ఒక వారం క్రిందట హిందూసుందరి పత్రికలో 'పాచికలు' అనే కధ వచ్చింది. అది స్కాంద పురాణంలో భాగం. ఒకప్పుడు నారదుని కలహప్రియత్వానికి పార్వతీ పరమేశ్వరులు కూడా గురి అయినారట. "లక్ష్మీ విష్ణువులు పాచికలాడుతారే , మీరెందుకు ఆడరు? " అని నారదుడు ప్రోత్సహిస్తే ఉత్సాహపడి పార్వతి తొందరపెట్టగా ఆడి పరమేశ్వరుడు ఓడుటయు ,పార్వతి గర్వించి పరమేశ్వరుని ధిక్కరించి,గేలి సేయుటయు , ఆదిగా గల వృత్తాంతం అది. భగవానులది చదివి భక్తి పూరిత హృదయులై "ఈ కధ చదివేరా "? అని నన్నడిగారు. చదివాననగానే సంక్రాంతికి ఇక్కడ జరిగే తిరువూడల్ ఉత్సవం కూడా ఉమామహేశుల కలహాన్ని గురించిన కాండయే' నని డగ్గుత్తిక వహించారు భగవాన్ .ఈ తిరువూడల్ ఉత్సవంలో ఉమామహేశుల కలహానికి కారణం దేవిని తిరస్కరించి తన్నే భజించిన భృంగికి పరమేశ్వరుడు మోక్షం ఇవ్వడమే.అలిగిన దేవి అస్తమయ వేళకు ఆలయంలో దూరి తలుపులు బిగించుకుని తానొక్కడే గిరిప్రదక్షిణం వస్తాడీశ్వరుడు . ఆశ్రమం వద్దకు వచ్ఛేసరికి అర్థరాత్రి అవుతుంది. అక్కడ నుండి బయలుదేరి వెళ్ళటం ,ఉణ్ణాముల తీర్ధం దాటిన తరువాత దొంగలదోపు మొదలగునవి జరుగుతవి. ఈ కధలన్నీ ఆయా సందర్భాల్లో భగవాన్ సెలవిస్తూ భక్తిపూరితులవుతారు.
అరుణాచలేశుని ఏటేటా కల్యాణోత్సవం జరుగుతుంది కదూ. ఆ రోజుల్లో ఎవరైనా భగవాన్ సన్నిధిలో ఆ ప్రసంగం తెస్తే , వారు హర్షంతో " అప్పకు అమ్మకు కల్యాణం " అని అనటం కద్దు. మహిత్ముల చరిత్రలు అతి విచిత్రం కదా.ఎప్పటికప్పుడు ఏ రసానికి ఆ రసం ముఖంలో తాండవింపజేస్తారు. అన్ని రసాలను ఏకంచేసే అఖండ విజ్ఞానరసమే రూపం ధరించినపుడు ఇక చెప్పవలసింది ఏముంది ?
___ సూరి నాగమ్మ
