అంతర్యామి
అంతర్యామి
May 29, 2025 at 12:41 AM
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో మా అనుభవాలు..* *ఫలించిన కోరికలు..* 2004 వ సంవత్సరం సంక్రాంతి పండుగ కు రెండురోజుల ముందు మా నాన్నగారు శ్రీ పవని శ్రీధరరావు గారికి పక్షవాతం జబ్బు చేసింది..హుటాహుటిన హైదరాబాద్ తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చి, మరో పదిరోజులకు కొద్దిగా స్వస్థత చేకూరిన తరువాత మొగలిచెర్ల కు తీసుకొని వచ్చాము..నాన్నగారికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించి, శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర నిర్వహణ నన్ను చూసుకోమని అమ్మ, అన్నయ్య ఇద్దరూ చెప్పారు..సరే అన్నాను.. ఒక నెలరోజులు గడచిన తరువాత, ఒక ఆదివారం ఉదయం 11 గంటల వేళ, సుమారు మా నాన్నగారి వయసున్న ఒక పెద్దమనిషి శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు.."ఇక్కడ శ్రీధరరావు కుమారుడు ప్రసాద్ అంటే ఎవరు?" అంటూ మా సిబ్బందిని అడుగుతున్నారు..మా వాళ్ళు నా వైపు చూపించారు..నేరుగా నేను కూర్చున్న చోటికి వచ్చారు..నేను లేచి నిలబడి ఆయనకు నమస్కారం చేసాను..సరే అన్నట్లు తలవూపి..ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు.. "నా పేరు జగన్నాధ రావు..నెల్లూరు లో మీ నాన్న VR కాలేజీ లో చదువుకునే రోజుల్లో నేనూ అక్కడే చదువుకున్నాను..స్నేహితంగా వుండేవాళ్ళము..చదువు అయిన తరువాత మీ నాన్న టీచర్ ఉద్యోగం కొన్నాళ్ళు చేశారు..నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం మద్రాస్ లో వచ్చింది..అక్కడికి వెళ్ళిపోయాను..నేను నెల్లూరు వచ్చినప్పుడు, ఇద్దరమూ కలిసే వాళ్ళము..ఉత్తరాల ద్వారా బాగా సాన్నిహిత్యం ఉండేది మాకు..స్వామివారి సంగతి కూడా వ్రాసారు..ఒకసారి మాలకొండకు వచ్చినప్పుడు స్వామివారి దర్శనం కూడా మీ అమ్మా నాన్న ల పుణ్యమా అని నాకు కలిగింది..మీ నాన్న కు ఆరోగ్యం బాగాలేదని తెలిసి, చూసిపోదామని వచ్చాను.." అన్నారు..వారిని నేనెప్పుడూ చూసి ఉండలేదు కనుక, ఆయన చెప్పిన మాటలు వింటూ వున్నాను.. "స్వామివారి సమాధి దర్శనానికి వెళ్లి రండి.." అని చెప్పాను..మందిరం లోపలికి వెళ్లి, సమాధి దర్శనం చేసుకొని, నమస్కారం చేసుకున్నారు..స్వామివారి సమాధి వద్దే నిలబడి, నన్ను కూడా లోపలికి రమ్మని అర్చక స్వామి ద్వారా చెప్పిపంపారు..నేనూ వెళ్ళాను..స్వామివారు ఏ విధంగా సిద్ధిపొందినదీ..స్వామివారి దేహాన్ని ఏ వైపు లోపల కూర్చోబెట్టిందీ..అన్నీ అడిగి తెలుసుకున్నారు.."ప్రసాద్..ఇక్కడ మనస్ఫూర్తిగా కోరిక కోరుకుంటే జరుగుతుందా.."? అన్నారు.. "ముందు మీరు స్వామివారి మీద భక్తి విశ్వాసాలతో వుండండి..మీ కోరిక తప్పక నెరవేరుతుంది..సమయం మాత్రం నేను చెప్పలేను..నా స్వీయ అనుభవాలు కూడా ఉన్నాయి.." అని చెప్పాను.."అలాగా.." అన్నారు..నేను ఇవతలికి వచ్చేసాను..వారు మరో ఐదు నిమిషాల పాటు శ్రీ స్వామివారి సమాధి వద్దే గడిపి ఇవతలికి వచ్చేసారు..కొద్దిసేపు నాతో ఇతరత్రా ముచ్చట్లు మాట్లాడి, భోజనం చేసి..మధ్యాహ్నం బస్ కు వెళ్లిపోయారు.. మరో మూడు నెలల తరువాత..ఆదివారం నాడే..సరిగ్గా అంతకుముందు లాగానే ఉదయం 11 గంటల వేళ, జగన్నాధ రావుగారు మందిరం లోకి వచ్చారు..ఈసారి నేరుగా నా వద్దకు వచ్చి, "ప్రసాద్..స్వామివారి సమాధి వద్దకు వెళ్ళొస్తానయ్యా.." అన్నారు..సరే అన్నాను..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, ఐదు నిమిషాల పాటు నిలబడి మౌనంగా కళ్ళుమూసుకుని ప్రార్ధన చేసుకొని ఇవతలికి వచ్చారు..నా వద్దకు వచ్చి, ప్రక్కనే కూర్చుని.."మా అబ్బాయికి వివాహం జరిగి 11 సంవత్సరాలు గడిచాయి..సంతానం లేదు..వాడి ఉద్యోగం కూడా అస్సాం లో..నేను స్వామివారిని రెండే కోరికలు కోరాను..మావాడికి సంతాన ప్రాప్తి కలుగచేయమనీ..ఉద్యోగం ఇటువైపు కు బదిలీ అయ్యేటట్లు చూడమనీ..కోరుకున్నాను..ఇదేమాట నేను వెళుతూ వెళుతూ మీ తల్లిదండ్రుల కూ చెప్పుకొని వెళ్ళాను..ఇద్దరూ ఆశీర్వదించారు..ఈ దత్తాత్రేయ స్వామిని నమ్ముకొని ఉండమని మీ అమ్మగారు నాకు చెప్పి, స్వామివారి విభూతి ని పొట్లం కట్టించి..మా కొడుకు, కోడలు కు ఇవ్వమని నా చేతికి ఇచ్చారు..నేను వాళ్లకు పోస్టులో పంపాను..సరిగ్గా వారం క్రితం మా అబ్బాయి వద్దనుంచి ఉత్తరం వచ్చింది..కోడలు గర్భవతి అయిందని..వాడికి మద్రాస్ కు బదిలీ అయిందనీ..ఇంకొక పదిరోజుల్లో వస్తున్నాననీ వ్రాశాడు..మొన్న ఫోన్ కూడా చేసాడు..క్షణం ఆలస్యం చేయకుండా నేరుగా మొగలిచెర్ల వచ్చి, మీ అమ్మా నాన్న గార్ల కు విషయం చెప్పాను..వెంటనే స్వామివారి మందిరానికి వెళ్లి, సమాధి వద్ద కృతజ్ఞతలు చెప్పుకోమని ఇద్దరూ చెప్పారు..పరుగున వచ్చాను..సందేహం లేదు..స్వామివారు మహిమాన్వితుడు..ఆయన్ను ప్రత్యక్షంగా సేవించుకున్న మీ తల్లిదండ్రులు ధన్యులు..నీకూ ఈ స్వామిని సేవించుకునే అదృష్టం కలిగింది నాయనా..నమ్ముకొని ఉండు.." అంటూ ఉద్వేగంతో చెప్పారు..ఆరోజు అక్కడే నిద్ర చేసి..ప్రక్కరోజు పొద్దున్నే బస్ కు వెళ్లిపోయారు.. శ్రీ జగన్నాధ రావు గారు 2014 లో తాను మరణించేదాకా..ప్రతి ఆరు నెలలకు కుటుంబ సమేతంగా మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వస్తూనే ఉండేవారు..శ్రీ స్వామివారిని ప్రత్యేకంగా చూడడమే కాదు, స్వామివారి కృపను కూడా పొందిన ధన్యజీవి జగన్నాధరావు గారు. సర్వం.. శ్రీ దత్తకృప! ~పవని నాగేంద్ర ప్రసాద్..
Image from అంతర్యామి: *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో మా అనుభవాలు..*  *ఫలించి...

Comments