
అంతర్యామి
May 29, 2025 at 06:13 AM
*మోక్ష సన్యాసయోగం(18-34)*
34. _యయా తు ధర్మకామార్థా న్ధృత్యా ధారయతే అర్జున! ప్రసఙ్గన ఫలాకాంక్షీ ధృతిస్సాపార్థ! రాజసీ._
టీక:- పార్థ = ఓ అర్జునా!,
యయా ధృత్యా తు = ఏ ధైర్యముచేత,
ఫలాకాజీ = ఫలాపేక్షగలవాడై,
ధర్మకామార్థాన్ = ధర్మమును, కామమును, అర్థమును,
ప్రసజ్ఞేన = మిగులయాసక్తితో, ధారయతే = అనుష్ఠించుచున్నాడో, సా ధృతిః = ఆ ధైర్యము,
రాజసీ = రాజసమైనది.
తా:- ఓ అర్జునా! ఏ ధైర్యముతో మనుజుడు ఫలాపేక్షగలవాడై ధర్మమును, అర్థమును, కామమును మిగుల యాసక్తితో అనుష్ఠించుచుండునో, అట్టి ధైర్యము రాజసమై యున్నది.
వ్యాఖ్య:- పురుషార్ధములు నాలుగు (1) ధర్మము (2) అర్ధము (3) కామము (4) మోక్షము. ఈ
చతుర్విధ పురుషార్ధములలో మొదటిమూడుమాత్రమే యిచట తెలుపబడినవి. నాల్గవది యగు మోక్షము చెప్పబడలేదు. దీనినిబట్టి రాజసధైర్యయుతులు మోక్షమునుగూర్చి అంతగా పట్టించుకొనరని విదితమగు చున్నది. కాబట్టి ఈ ధైర్యము పరమార్థదృష్టిలో అంత ఉత్తమమైనదిగాదని తేలుచున్నది. ఇంద్రియములను నిరోధించుటద్వారా మోక్షముకొఱకు యత్నింపజేయునట్టి సాత్త్వికధైర్యమే ఉత్కృష్టమైనది.
ధర్మార్థకామములను మూడు పురుషార్ధముల నన్వేషించువారికంటె, నాల్గవపురుషార్ధమగు మోక్షము నన్వేషించువాడే శ్రేష్ఠుడు. అయితే చతుర్విధపురుషార్ధములందలి మొదటిదియగు ధర్మమున కర్ధము సామాన్యధర్మమనియే గ్రహించవలెను. విశేషధర్మము పరమాత్మావలంబనమే, దైవనిష్ఠయే, ఆత్మజ్ఞానమే యగును.
'స`న' అని చెప్పక 'ప్రసన్గేన' యని చెప్పుటచే అట్టివారా పురుషార్ధములందు మిక్కుటమగు నాసక్తిని జూపుదురని తెలియుచున్నది.
ప్ర:- రాజసధైర్య మెట్టిది?
ఉ:- ఏ ధైర్యముచే మనుజుడు ఫలాపేక్షగలవాడై ధర్మార్థకామములను మిగులయాసక్తితో ననుష్ఠించుచుండునో అయ్యది రాజసధైర్యమనబడును.
అ॥ ఇక తామసధైర్యమును పేర్కొనుచున్నాడు
