
అంతర్యామి
May 30, 2025 at 11:09 AM
35. *యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముఞ్చతి దుర్మేధా ధృతిస్సా పార్థ! తామసీ.*
టీక:- పార్థ = ఓ అర్జునా!,
యయా = ఏ బుద్ధిచేత,
దుర్మేధాః = దుర్బుద్ధిగలవాడు, స్వప్నమ్ = నిద్రను,
భయమ్ = భయమును,
శోకమ్ = దుఃఖమును,
విషాదమ్ = సంతాపమును (దిగులును),
మదం ఏవ చ = మదమును,
న విముణ్బతి = విడువకయుండునో,
సా ధృతిః = ఆ ధైర్యము,
తామసీ = తామసమైనది.
తా:- ఓ అర్జునా! ఏ బుద్ధిచేత దుర్బుద్ధియగు మనుజుడు నిద్రను, భయమును, దుఃఖమును, సంతాపమును (దిగులును), మదమును విడువకయుండునో, అట్టి ధైర్యము తామసమైనది.
వ్యాఖ్య:- ధైర్యము గొప్పసుగుణమే. కాని అది దుర్విషయములందు వినియోగింపబడునపుడు నిష్ఫలమైపోవును. తమోగుణయుతుడు ఒకానొక ధైర్యమవలంబించి తన అతినిద్రను, భయమును, దుఃఖమును, దిగులును, మదమును వదలకయే యుండును. ధైర్యమను గొప్ప సుగుణము అట్టి నిద్రాభయాది నికృష్ణవస్తుసంపాదనమున వినియోగింపబడుటచే నిరర్ధకమైపోయినది. కాబట్టి ఆ ధైర్యమునే సద్వస్తుసంపాదనమునకు, సచ్ఛీలసముపార్జనకు, మోక్షప్రాప్తికి, దైవకరుణను సంపాదించుటకు వినియోగించుట ఉత్తముని ధర్మమైయున్నది. వాల్మీకికి అపారధైర్యము, పట్టుదల కలదు. కాని మొట్టమొదట ఆ ధైర్యమును, పట్టుదలను దుర్వృత్తులందు, పరమహింసాకార్యములందు ఉపయోగించివిఫలుడయ్యెను.
కాని మహనీయుల సాంగత్య ప్రభావముచే తిరిగి ఆ ధైర్యమునే రామనామజపమందును, దైవధ్యానమందును వాడుకొని ధన్యుడయ్యెను.
'దుర్మేధా'- అనిచెప్పుటవలన అతనికి మేధ (తెలివి) యున్నప్పటికిని దానిని వక్రమార్గమున
ప్రవేశపెట్టెనని భావము.
'స్వప్నమ్' - (నిద్ర) ఇచట నిద్రయని చెప్పినచోట ' అతినిద్ర' యని భావించుకొనవలెను. ఏలయనిన మితనిద్ర సర్వులకును అవసరమే అయియున్నది.
ప్ర:- తామసధైర్య మెట్టిది?
ఉ:- ఏ ధైర్యముచే దుర్బుద్ధిగలవాడు నిద్రను, భయమును, శోకమును, దిగులును, మదమును విడువకయుండునో అది తామసధైర్యమని చెప్పబడును.
అ॥ ఇక సాత్త్వికసుఖము, రాజససుఖము, తామససుఖము అను మూడు సుఖములనుగూర్చి
వర్ణించుచున్నాడు -
