అంతర్యామి
అంతర్యామి
June 12, 2025 at 07:33 AM
చరిత్రకు అందని తొలినాళ్ళ కాలం నాటినుండి ఈ దివ్యమైన నేలమీద ఎందఱో మహానుభావులు ఆవిర్భవించి తమ జన్మకు కారణమైన కర్తవ్యములను నిర్వర్తించి దేహత్యాగము చేసి పుణ్యలోకాలకు చేరుకున్నారు. అటువంటి వారిలో ఆదిశంకరులు, చైతన్య మహాప్రభువు, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద మరియు కంచి పరమాచార్య మొదలైన మహానుభావులు నిత్య స్మరణీయులు. వీరు ఒక్క భారతీయులకే గాక, విశ్వవ్యాప్తమైన సమస్త జనులకు వందనీయులు, పూజనీయులు. అటువంటి కోవకు చెందినవారు శ్రీశ్రీశ్రీ కరపాత్రి స్వామివారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్ గడ్ జిల్లాయందు సరయూ నదీతీరంలో గల భటనీ అనే గ్రామంలో నిత్యశివార్చనా తత్పరుడైన పండిత శ్రీరామనిధి ఓఝూ, శివరాణిదేవి దంపతుల మూడవ సంతానంగా సా.శ.1907వ సంవత్సరము శ్రావణ శుద్ధవిదియ నాడు స్వామి ఆవిర్భవించారు. తల్లిదండ్రులు వీరికి హరినారాయణ అని పేరు పెట్టారు. హరినారాయణ భటనీ గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం నాల్గవ తరగతి వరకు పూర్తిచేశారు. కానీ సంస్కృత భాషయందు ఆసక్తిచేత లౌకిక విద్యను వదలి నాగేశమిశ్ర అన్న పండితుని వద్ద సంస్కృత భాషాధ్యయనం ప్రారంభించారు. చిన్నవయసునుండే భౌతిక విషయాలపై విరక్తిగా ఉండే ఈయనలో వైరాగ్య భావాలను గమనించిన తండ్రి గారాబముగా పెంచుకుంటున్న తమ కుమారుడు తమకు దక్కకుండా పోతాడేమో అన్న భావనతో 1916వ సంవత్సరంలో ఉపనయనం చేసి ఇదే జిల్లాలోని ఖాండ్వాగ్రామ నివాసి పండిత రాంసుచితజిగారి కుమార్తె మహాదేవితో వివాహ సంస్కారాన్ని జరిపించారు. అనంతరం హరినారాయణ గ్రామంలోనే భాగవత పారాయణ, ప్రవచనాలు చేస్తూ కొంతకాలం తర్వాత వైరాగ్య భావనతో ఇల్లు విడచిపెట్టి వెళ్ళుటకు సిద్ధంకాగా తండ్రి అడ్డుపడి సంతానం కలిగిన పిదప వెళ్ళవచ్చునని ఆదేశించాడు. కొంతకాలానికి హరినారాయణకు ఆడబిడ్డ జన్మించింది. ఇక వెంటనే ఇంటిలోని వారినందరినీ ఒప్పించి 1926వ సంవత్సరంలో అనగా 19ఏళ్ళవయస్సులో ఇంటిని విడిచిపెట్టి అనేక ప్రాంతాలలో తిరుగుతూ మధ్యప్రదేశ్ లోని వీర సింహపురము అనే గ్రామానికి చేరారు. అక్కడ ఒక మహాత్ముని దర్శించి మార్గదర్శనం చేయమని కోరగా ఆ మహాత్ముడు ఈయనకు నైష్ఠిక బ్రహ్మచర్య దీక్షనిచ్చి ‘హరిహరచైతన్య’ అనే దీక్షా నామాన్ని అనుగ్రహించారు. ఆ మహాత్ముని పేరే బ్రహ్మానంద సరస్వతీ స్వామి. ఈ మహానుభావుడు తదనంతర కాలములో జ్యోతిష్పీఠాధిపతియై ఆమ్నాయ పీఠమైన బదరీ ఆశ్రమమందు జగద్గురు పీఠాన్ని అధిరోహించారు. వీరి ఆదేశానుసారం బులంద్ శహర్ సమీపంలోని గంగాతీరమున గల నరవర్ అనే సాంగవేద పాఠశాల యందు నాలుగేండ్ల వ్యాకరణ పాఠమును 11 నెలలలోనే పూర్తిచేసి అనంతరం అక్కడనే షడ్దర్శనాచార్యుడు, దండి సన్యాసియైన విశ్వేశ్వరాశ్రమజీ వద్ద వేదాంత, దర్శన విద్యలను అభ్యసించాడు. ఒకపక్క విద్యనభ్యసిస్తూనే మరోవైపు తీవ్రమైన తపస్సుతో అతని ముఖ వర్చస్సు దినదిన ప్రవర్ధమానమైనది. ఒకనాడు అతనికి తీవ్రమైన తపస్సు ఆచరించాలనే బుద్ధి కలిగి పాఠశాలనుండి బయలుదేరి హిమాలయాలకు చేరి 3సంవత్సరాలు ఏకాకిగా కఠినమైన తపస్సు చేయగా అతని తపస్సు ఫలించి ఆత్మసాక్షాత్కారమైనది. అప్పుడే భగవదాదేశం లభించింది. “నాయనా! లోక సంబంధములను త్రెంచుకొని దూరముగా వెళ్ళవలదు. లోక కళ్యాణం కొరకు పాటుపడుము. ధర్మరక్షణ కొరకు ధర్మప్రచారము చేయుము” అన్న ఆదేశానుసారం అక్కడినుండి వచ్చి కాశీ పట్టణమందు తపో, పఠనాదులను సాగిస్తూ ఉండెను. అప్పటికి ఆయన వస్సు 23 ఏళ్ళు. అక్కడనుండి కౌపీన ధారియై ప్రయాగవైపు పాదయాత్ర చేస్తూ మార్గమధ్యంలో సాంప్రదాయకమైన వారినుండి భిక్ష స్వీకరిస్తూ ప్రయాణాన్ని కొనసాగించాడు. భిక్ష పెట్టినవారి నుండి చేతితో భిక్ష స్వీకరిస్తూ ఆ చేతిలోనే ఆరగించడం చేత ప్రజలందరూ ఈయనను ‘కరపాత్రి స్వామి’ అని పిలుస్తుండే వారు. అలా ఈ నామధేయం ఈయనకు సుప్రతిష్ఠితమైనది. వీరి ఖ్యాతి దేశమంతా విస్తరించింది. ప్రయాగ చేసి అనంతరం తన గురువైన విశ్వేశ్వరాశ్రమజీ ఆదేశానుసారంగా ద్వారకా పీఠాధిపతులైన బ్రహ్మానంద సరస్వతీ స్వామి వారి కరకమలములచే 1932లో కాశీ నగరములో దుర్గా కుండం దగ్గర కరపాత్రి స్వామి యధావిధిగా సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. జగద్గురువులు కరపాత్రి స్వామికి హరిహరానంద సరస్వతి అనే యోగపట్టాన్ని ఇచ్చారు. సన్యాసాశ్రమ స్వీకరణానంతరము ఆ ఆశ్రమ నియమములను పాటిస్తూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం అందుకు తనవంతు సహకారములను అందజేశారు. ఆస్తికులను ఏకం చేసే ఉద్దేశంతో 1940లో ధర్మ సంఘాన్ని స్థాపించి ఈ సంఘం ద్వారా జప, తపాది అనుష్ఠానములు ఆచరిస్తూ ధర్మ ప్రచారానికై పూనుకున్నారు. వర్ణ వ్యవస్థను గట్టిగా సమర్ధిస్తూ, ధర్మ వ్యతిరేక సిద్ధాంతాలను ఖండిస్తూ అనేక గ్రంథాలు వ్రాశారు. వీరి ఆధ్వర్యంలో ‘సన్మార్గ్’ అనే మాసపత్రికను, ‘సిద్ధాంత్’ అనే వారపత్రికను ప్రచురించేవారు. వీరు వ్రాసిన గ్రంథాలలో మార్క్సువాదము – రామరాజ్యము అనే గ్రంథం ఆనాడు ఎన్నో సంచలనాలకు కారణమైనది. విద్యామండలి ధర్మవీర దళము, సనాతన దళము పేరుతో ఎన్నో సంఘములను స్థాపించి ధర్మరక్షణకై విశేష కృషి చేశారు. బలవంతపు మతమార్పిడులను వ్యతిరేకించి బాధితులకు విరివిగా సహాయాన్ని అందించారు. శ్రీకృష్ణ బోధాశ్రమ స్వామివారితో కలిసి ధర్మసంఘం తరపున ఆసేతు హిమాలయం వరకు మహారుద్ర, చండీయాగాది అనేక వైదిక క్రతువులను నిర్వహించారు. అప్పటి బ్రిటీషు ప్రభుత్వం బలవంతంగా హిందువుల మీద రుద్దిన వారసత్వ బిల్లును, విడాకుల చట్టాన్ని వ్యతిరేకించి ఎన్నో ఉద్యమాలను కూడా చేశారు. వీరి కృషి మూలంగా హిందూ వివాహకోడ్ రద్దు చేయబడినది. 1947ఏప్రిల్ 26 నుండి కౌన్సిల్ హౌస్ వద్ద నిరాహార దీక్ష వహించి గోవధ నిరోధమునకై పోరాడి అరెస్టు చేయబడి జైలుకు వెళ్ళారు. వీరి ఉద్యమాల ప్రభావం వలన మధురానగరంలో, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో గోవధ నిషేధింపబడినది. 1966నవంబర్ 7న 10లక్షల మందితో పార్లమెంట్ వద్ద గోవధ నిషేధ బిల్లు గురించి ఉద్యమించారు. 8-11-1966న మరల స్వామిని అరెస్టు చేసి తీహార్ జైలులో ఉంచారు. ఈ సమయంలో వారు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వేదాంతాది చర్చలలో తన వాక్పటిమ, పాండిత్యములతో ఎంతోమంది పండితులతో వాదించి వారినందరినీ మెప్పించారు. 1974లో వీరు వ్రాసిన ‘భక్తిరసార్ణవం’ అనే గ్రంథానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము విశిష్ట పురస్కారాన్నిచ్చి గౌరవించింది. వేదవిద్యాభివృద్ధికై కృషిచేస్తూ ఇందులకై కాశీలోని కేదార్ ఘాట్ నందు వేదానుసంధాన సంస్థానాన్ని స్థాపించి వేదవిద్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. వేదాలకు వ్యాఖ్యానాన్ని ఎందరినో తీర్చిదిద్దారు. అద్భుతమైన పరంపరను ఏర్పరచారు. ఈవిధంగా సనాతన ధర్మానికి కరపాత్రిస్వామివారు 60సంవత్సరములుగా కృషి చేస్తూనే ఉన్నారు. కానీ వారి అవతారమునకు సంబంధించిన కార్యక్రమములు పూర్తి అగుటతో దేహత్యాగమునకు సమయమాసన్నమైనదని తెలుసుకుని శిష్యులకు ఆయా బాధ్యతలను అప్పగించి 1982ఫిబ్రవరి 2వ తేదీన (మాఘపూర్ణిమ) ఉదయం గం.9-17ని.లకు వేదమంత్రములు పఠిస్తుండగా అశేషభక్తజనులు అశ్రుధారలతో వీక్షిస్తుండగా, భగవన్నామ స్మరణ చేస్తూ భౌతిక దేహాన్ని విడచి భగవంతుడిని చేరుకున్నారు. వారి భౌతిక దేహానికి నిర్వర్తించవలసిన కార్యక్రమములన్ని పూర్తయిన పిదప, వారి పార్థివదేహాన్ని యాత్రగా కాశీ నగరములో ఊరేగించే సమయమందు అనేకమంది పీఠాధిపతులు, దండి సన్యాసులు, శిష్యులు, విశేష సంఖ్యలో ప్రజలు, పోలీసు అధికారులు హాజరై అభినవ శంకరులు, ధర్మ సామ్రాట్ శ్రీకరపాత్రి స్వామివారి భౌతిక దేహాన్ని దర్శించి, అర్చించుచు, వీరి అంతిమ యాత్ర సాగే మార్గములో ఎత్తైన భవనములనుండి పూలవర్షం కురిపిస్తూ దశాశ్వమేధ ఘాట్ కు చేరుకొని అక్కడినుండి ఇతఃపూర్వమే స్వామివారు ఆదేశించిన ప్రకారంగా ఒక బోటులో కేదారఘాట్ కు చేర్చి పండితులు పవిత్ర వేదమంత్రాలను పఠిస్తుండగా, వేల సంఖ్యలో శంఖాలు మ్రోగుతుండగా, ఓంకారనాదాలతో ‘కరపాత్రిస్వామికి జై’ అనే నినాదాలతో గంగాతీరమంతా మారు మ్రోగుతుండగా ఆ సమయమందు చేయవలసిన క్రియలన్నీ పూరీ పీఠాధిపతి శ్రీ నిరంజన తీర్థస్వామి వారి హస్తములతో జరిపి, స్వామివారి దివ్య దేహమును రాతి పలకలో ఉంచి పవిత్ర గంగానది నీటిలో ప్రక్షిప్తము చేశారు. ఆత్మకు మరణం లేదని తెలిసికూడా అజ్ఞానముతో ఈ దేహమే తాను అనే భావనలో పడి అజ్ఞానులు విలవిలలాడుతుంటారు. జ్ఞానులైన వారు మాత్రమే ఈ భావాన్ని విడచి ఆ వలయమునుండి బయటపడగలరు. జీవన్ముక్తిని పొందగలరు. ఇందుకు నిదర్శనము శ్రీకరపాత్రి స్వామివారి జీవితం. నేటి సమాజానికి వారి లక్ష్యాలు ఆదర్శనీయం. వందే భారతదేశ పుణ్య పరిపాక కృష్ణ బృందారకం! వందే వైదిక ధర్మరక్షణ పరం వందే సుధీ వందితం! వందే పావన రామరాజ్య పరిషత్సంస్థాపకం శర్మదం! వందే శ్రీకరపాత్రి సంయమివరం వందే తపశ్రీధరం!!
Image from అంతర్యామి: చరిత్రకు అందని తొలినాళ్ళ కాలం నాటినుండి ఈ దివ్యమైన నేలమీద ఎందఱో మహానుభ...

Comments