
అంతర్యామి
June 16, 2025 at 02:03 PM
*ప్రేమావతారి శ్రీ సత్యసాయి బాబా వారు!!!*
రూబెన్ లోవెన్ బర్గ్ దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్ నగర నివాసి. వృత్తిరీత్యా లాయర్. 1973లో ఇజ్రాయిల్ సైన్యంలో పనిచేస్తున్న తన కుమారుని మరణం అతని కుటుంబాన్ని తీవ్ర దుఃఖానికి గురిచేసింది. ఆ తర్వాత ఒక స్నేహితునిద్వారా హోవర్డ్ మర్ఫెట్ రచించిన 'సాయిబాబా - మేన్ ఆఫ్ మిరకిల్స్' అనే పుస్తకం లభించింది. అది చదివిన తరువాత బాబా అద్భుత చరిత్ర, దివ్య ప్రబోధముల ద్వారా దుఃఖోపశమనం పొంది వారిని దర్శించా లనుకున్నాడు. దక్షిణ ఆఫ్రికాలో ఉన్న సాయి భక్తులను కలుసుకుని, వారి అద్భుతమైన అనుభవాలతో ప్రభావితుడై ఎట్టకేలకు 1976 ఫిబ్రవరిలో పుట్టపర్తి చేరుకుని, స్వామిని దర్శించుకుని, భారతదేశంలో ఉన్న ఎందరో ప్రముఖ సాయి భక్తులతో పరిచయం చేసుకున్నాడు. బాబా ఉపన్యాసములు విని, వారు రచించిన గ్రంథములు చదివిన స్పూర్తితో బాబాను గురించి మూడు పుస్తకాలు రచించేడు. చివరకు వైట్ ఫీల్డులో స్థిర నివాస మేర్పర్చుకుని స్వామి అనుగ్రహానికి పాత్రుడయ్యేడు. అతడు రాసిన 'ఎట్ ది ఫీట్ ఆఫ్ సాయి' అన్న మొదటి పుస్తకంలో అతడు పరిచయం చేసుకున్న కొందరు భక్తుల అనుభవాలను సంకలనం చేయటం జరిగింది.
*షాపు మూసివెయ్యి*
జోహాన్స్ బర్గ్ లో కెన్ బెర్మన్ అనే యువకుడు తాను ఒక షాపును ఎలా ప్రారంభించిందీ, క్రమక్రమముగా వ్యాపారము ఎలా తగ్గిపోయినదీ వివరిస్తూ, ఈ పరిస్థితుల్లో తన కర్తవ్యం ఏమిటని ప్రార్థిస్తూ, తనకు ఏదో సూచన ద్వారా జవాబు ఇమ్మని స్వామికి జాబు వ్రాశాడు. మర్నాడు ఉదయం అతని అద్దంమీద సుస్పష్టమైన ఎర్రని అక్షరాలతో 'షాపు మూసివేయుము' అని రాసి ఉంది. స్వామి అదృశ్య హస్తాలకు తప్ప మరెవ్వరికీ అలా రాసే ఆస్కారం లేదని గ్రహించి స్వామి ఆజ్ఞగా పాటించి అతి తక్కువ నష్టంతో బయటపడ్డాడు.
*అడుగడుక్కీ స్వామి రక్షణ*
1978 ఏప్రిల్ లో లోవెన్ బర్గ్ కు వైట్ ఫీల్డులో 'ఓం' అనే సన్న్యాసినితో పరిచయం అయింది. ఆమె న్యూయార్క్ లో ఏంత్రోపాలజీ లెక్చరర్ గా పనిచేసి, మానవ జీవితానికి లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలన్న పరిశోధనాసక్తితో భారతదేశం వచ్చి అరవిందొ ఆశ్రమంలో కొన్నాళ్ళుండి, చివరకు బాబాను గురించి ఎందరో రాసిన పుస్తకాలు చదివి ప్రభావితురాలై, చాలాకాలం స్వామి భక్తురాలుగా పుట్టపర్తిలో కానీ, వైట్ ఫీల్డులోకానీ స్వామి ఎక్కడుంటే అక్కడ ఉండేది. కర్మానుగుణంగా అనుభవించవలసిన కష్ట నష్టాలేమిటో ఈ జన్మలోనే అనుభవించి జన్మరాహిత్యం పొందాలన్నది ఆమె ఆశయం. మందులతో వైద్యం చేయించుకోకుండా ఎన్నోసార్లు తన ప్రాణాన్ని శిరస్సు ద్వారాకానీ, హృదయం ద్వారాకానీ విడిచి పెట్టాలని ప్రయత్నించి, దేహాంతర అదృశ్య శరీరంతో కొన్ని గంటలుండటం జరిగింది. ఈమె ప్రయోగాలను చూసి వినోదిస్తూ, ఎప్పటికప్పుడు భగవాన్ ఈమెకు ప్రాణదానం చేస్తూ వచ్చారు. ఆమె అనుభవాలు ఆమె మాటల్లోనే.....
“ఒకసారి వెస్ట్ వర్జీనియాలో కారు డ్రైవు చేసుకుంటూ, పెట్రోల్ బంక్ కి వెళ్ళే సమయంలో మరో కారు భయంకరమైన స్పీడుతో వచ్చి ఢీకొంది. ఆ సమయంలో 'బాబా' అని గట్టిగా కేక వేశాను. నా కారు గుజ్జుగుజ్జు అయిపోయింది. నా తల రెండు చెక్కలయింది. ఆ సమయంలో బాబా కనబడి, “కంగారుపడకు, నీ తల అతికించి నిన్ను బ్రతికిస్తాను” అన్నారు. పోలీసులొచ్చి చూసి నేను చచ్చిపోయానని నిర్ధారణ చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు ఏంబులెన్స్ తీసుకు వచ్చేటప్పటికి నేను బ్రతికుండటాన్ని చూసి ఆశ్చర్యపోయి, హాస్పిటల్ కి తీసుకుపోతామన్నారు. నాకు హాస్పిటల్ అక్కర్లేదు మొర్రో, అని వాళ్ళని తప్పించుకుని వెళ్ళటానికి తల ప్రాణం తోకకొచ్చింది. మొత్తం ఆ ఏక్సిడెంటు పేరు చెప్పి నాకయిన ఖర్చు 12000 డాలర్లు. ఒకసారి వరుసగా పది రోజులు డిసెంట్రీ తో మంచాన పడ్డాను. ఏ మందూ వేసుకోలేదు. ఒంట్లో రక్తమాంసాలు హరించిపోయి ఎముకల గూడు మాదిరి యారయ్యాను. ప్రాణం ఎలా పోతుందా అని చూస్తూంటే, ఒక అమ్మాయి వచ్చి, “ఆ హిస్టీరియా చచ్చిపోయింది, నోట్లో వెయ్యి, బ్రతుకుతుంది” అని చెప్పి స్వామి విభూతి ఇచ్చేరు, అని చెప్పి నా నోట్లో వేసింది. 'హిస్టీరియా' అనేది స్వామి నాకు పెట్టిన ముద్దు పేరు. సరే, మళ్ళీ కోలుకున్నాను.
ఒకసారి సాయిగీతకోసం ఒక మంచి పెద్ద జామపండు కొని దాని దగ్గరికెళ్ళి స్వామి దానికి ఏపిల్స్ తినిపించేవిధంగా తినిపించాలని ప్రయత్నించాను. అది దాని తొండంతో నన్ను చుట్టి పదడుగుల అవతలకి గిరవాటెట్టింది. దానితో తుంటి ఎముక విరిగింది. లెంపలేసుకుని స్వామిని ప్రార్థించేను, ఆ బాధ భరించలేక. సాయంత్రానికి ఎముక అతుక్కుపోయి నడవగలిగేను. ఒకసారి విపరీతంగా చెవిపోటు వచ్చింది. హాస్పిటల్ కి వెళ్ళేను, చెవి క్లీన్ చేస్తారని. ఇంతలో డాక్టరొచ్చి ఏం జరుగుతోందో తెలియని స్థితిలో వెంటనే పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చాడు. పెన్సిలిన్ నాకు ఎలర్జీ. మూడు రోజులు స్పృహ లేకుండా పడిపోయేను. నాలుగో రోజు ఉదయం ప్రాణం పోయింది. డాక్టర్ గారు కస్తూరిగారికి చెబితే, ఆ అమ్మాయి చావదు, భయపడొద్దు, స్వామికి చెబుతాను, అన్నారట. నాలుగు గంటలు శరీరం విడిచి పెట్టి హాయిగా ఉన్నాను. ఇంతలో స్వామి నా కళ్ళకి కనబడ్డారు. అంతే, మళ్ళీ శరీర ప్రవేశం తప్పలేదు. బాధ మాత్రం నెమ్మదిగా తగ్గింది” అని తన అనుభవాల్ని వివరించింది.
అసలు నీకు 'ఓం' అనే పేరెలా వచ్చింది? అని లోవెన్ బర్గ్ అడిగితే, “స్వామి నాకొక జపమాల సృష్టించి ఇచ్చి నిశ్శబ్దంలో ఉన్న ఓంకారాన్ని విని జపించు, అన్నారు. మరి ఆ నిశ్శబ్దంలో ఓంకారాన్ని ఎప్పుడు వినగలుగుతానో!” అంది
నవ్వుతూ.
*త్వమేవ శరణం మమ*
న్యూయార్క్ వాస్తవ్యుడైన 22 సం||ల వయస్సుగల జాన్ గిల్బర్ట్ అనే యువకుడు 'హాడ్కిన్స్ డిసీజ్' అనబడే కేన్సర్ వ్యాధికి గురి అయ్యేడు. రెండు మూడేళ్ళ కొకసారి బాధాకరమైన కిమోథెరపీ చేయించుకున్నా పదేళ్ళు కూడా ఎవరూ బ్రతకరు. 1969లో కిమోథెరపీ చేయించుకున్నాడు. 1972లో వ్యాధి తిరగబడింది. మరో మూడేళ్ళు గడచిన తరువాత మళ్ళీ తిరగబెట్టింది. స్వామి మహిమల గురించి విన్నాడు, కొన్ని పుస్తకాలు చదివేడు. అదంతా నిరాధారమైన ప్రచారం క్రింద కొట్టిపారేశాడు. మళ్ళీ కిమోథెరపీ చేయించుకున్నాడు. మళ్ళీ 1975 నుంచి ఆ వ్యాధితో బాధపడటం ప్రారంభమయింది. కొన్నాళ్ళు ఆక్యుపంచర్ చికిత్స చేయించుకున్నాడు. బాధ తగ్గలేదు. 1976లో లోవెన్బర్గ్ తో పరిచయం అయింది. తల్లిని వెంట పెట్టుకుని బెంగళూరు వచ్చేడు. ఒకసారి ఒక చంటి పిల్లాడు నీళ్ళ తొట్టెలో పడిపోతే, తండ్రి ఆ పిల్లవాణ్ని తలక్రిందులుగా పట్టుకుని నీరు కక్కించేసింతర్వాత ఊపిరి ఆడే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఆ పిల్లవాడి తల్లి భోరున ఏడుస్తూంటే, హృదయవిదారకమైన ఆ దృశ్యం చూసి గిల్బర్ట్, “బాబా! నువ్వు నిజంగా దేవుడవైతే, ఈ పిల్లవాణ్ని బ్రతికించు” అని మనస్సులో ఛాలెంజి చేశాడు. చూస్తూండగానే, ఆ పిల్లవాడు ఊపిరి తీసుకుంటూ బ్రతికేడు. కానీ అతడికి నమ్మకం కుదరలేదు.
1976లో తల్లి బలవంతం మీద ఆమెను తీసుకుని పుట్టపర్తి వెళ్ళేడు. స్వామి ఆమెకి ఉంగరం సృష్టించి ఇచ్చేరు. విభూతికూడా సృష్టించి ఇస్తూ, “నీకేమి కావాలి?” అని అడిగితే, తన కుమారుణ్ని ఎలాగైనా కిమోథెరపీ చేయించుకోవడానికి ఒప్పించమని ప్రార్థించింది. మర్నాడు బాబా గిల్బర్ట్ కి విభూతి ఇచ్చేరు. తిరిగి న్యూయార్క్ వెళ్ళి కిమోథెరపీ చేయించుకున్నా కొన్ని నెలల్లోనే తిరగబెట్టింది. మళ్ళీ 1977లో బెంగళూరు వచ్చినప్పుడు అక్కడ స్వామి వేసవి తరగతులు నడుపుతున్నారు. అప్పటికి గిల్బర్ట్ చిక్కి శల్యమై ఉన్నాడు. గిల్బర్ట్ ని, తల్లిని స్వామి ఇంటర్వ్యూకి పిలిచేరు.
ఆ ఇంటర్వ్యూలో బాబాతో గిల్బర్ట్, “ఇంక నేనే విధమైన చికిత్సలు చేయించుకోను. దయ ఉంచి మీరే ఏదైనా మందివ్వండి” అని బుద్దిగా మొట్టమొదటిసారిగా ప్రార్థించేడు. స్వామి హస్త చాలనంతో 20 మాత్రలు గల సీసా సృష్టించి, “రోజూ రాత్రి ఒక మాత్ర వేసుకో, నీ కేన్సర్ కేన్సిల్ చేశాను”, అన్నారు. మాత్రలు అన్నీ మ్రింగ నక్కర్లేకుండానే వ్యాధి నయమై బాధ తగ్గిపోయింది. వెంటనే న్యూయార్క్ తిరిగి వెళ్ళి డాక్టర్ చేత పరీక్ష చేయించుకుంటే, అతని రక్తంలో ఒక్క కేన్సర్ కణం కూడా లేదు. ఈ విషయం ఆనందంగా గిల్బర్ట్ లో వెన్ బర్గ్ కు వ్రాసి, స్వామికి తన కృతజ్ఞతలు తెల్పమన్నాడు.
