అంతర్యామి
అంతర్యామి
June 18, 2025 at 07:50 PM
*వేలంపాట ఆగిపోయింది* పరమాచార్య స్వామివారి భక్తురాలైన ఒక యువతి తరచుగా స్వామివారి దర్శనానికి వచ్చేది. ఆమె చాలా అణకువతో, భక్తితో స్వామివారిని సేవించుకునేది. ఎప్పుడూ మౌనంగా వుంటూ, తన గురించి ఏమీ చెప్పుకునేది కాదు. స్వామివారిని ఏమీ కోరేదీ కాదు. పెళ్ళయి, మంచి జీవితంతో సంతోషంగా వుండేది. మహాస్వామి వారు చెన్నైలో మకాం చేస్తూ ఒకరోజు టి.నగర్ లో సంచరిస్తూండగా, అక్కడే నివశిస్తున్న ఈమె, ఇంటినుండి బయటకు వచ్చి నేలపై పడి స్వామివారికి నమస్కారం చేసింది. “పరమాచార్య స్వామివారు దయతో నాకు పాదుకలను అనుగ్రహించాలి” అని వేడుకుంది. అదీ మిట్టమధ్యాహ్నం చెన్నై ఎండలో. “నా పాదుకలను ఇచ్చేస్తే నేను ఎలా నడవాలి?” అని అడిగారు స్వామివారు. “ఇదిగో స్వామీ” అని అతనతోపాటు తెచ్చుకున్న మరొకజత పాదుకలను స్వామివారి ముందుంచింది. “ఓహో! నేను తెలివిగా ఆలోచించాననుకున్నాను కానీ తను నా తెలివికంటే తెలివిగా ఆలోచించింది. తనకోసం ఆమె ఎన్నడూ ఏదీ కోరలేదు”. స్వామివారు తమ పాదుకలను విడిచి ఆమె ఇచ్చిన పాదుకలను వేసుకుని ముందుకు సాగిపోయారు. ఆమె స్వామివారు విడిచిన పాదుకలను తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమె భర్త తిరుగుళ్ళకి అలవాటుపడి తాగుబోతుగా మారి చెడు సహవాసాలకు అలవాటుపడ్డాడు. దాని గురించి ఆమె ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదు. ఒకరోజు అతను చాలా ఎక్కువగా తాగి ఆరేడు రోజులపాటు తెలివి లేకుండా పడివున్నాడు. వైద్యులు పరీక్షించినా కూడా ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఈమె ఎప్పుడూ తన భర్త గురించి స్వామివారికి చెప్పలేదు. దర్శనానికి వచ్చి నమస్కరించి, స్వామివారు ఇచ్చే ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోయేది. ఒకరోజు స్వామివారు పూజ చేస్తున్నారు, ఆరోజు నేను పూజకట్టులో వున్నాను. అది సంస్కృత కళాశాలలో. ఎప్పుడూ మౌనంగా ఉండే ఆమె ఆరోజు నన్ను పలకరించింది. పూజలో సహాయం చెయ్యడానికని నేను మడి కట్టుకుని ఉన్నాను. పూజమండపం పక్కగా కొద్ది దూరంలో నిలుచున్నాను. “నేను పరమాచార్య స్వామివారితో మాట్లాడాలి. చాలా ముఖ్యమైన విషయం”. స్వామివారు పూర్తిగా పూజలో లీనమైపోయినా అక్కడ జరిగే ప్రతీ విషయమూ స్వామివారికి అవగతమే. వారికి ఒక్కవైపు కాదు, నలువైపులా కళ్ళున్నాయి. పూజ అయిపోగానే, స్వామివారు నన్ను పిలిచి, “ఆమె నిన్ను పిలిచి నీతో ఎందుకు మాట్లాడింది?” అని అడిగారు. నేను ఆమె మాటలను స్వామివారికి చెప్పాను. ఆమెను స్వామివారి దగ్గరకు పిలిపించగానే, వారం నుండి తన భర్త అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిపింది. “ఇది నా దౌర్భాగ్యం! ఇందుకు నేను దైవాన్ని నిందించను”. “ఇది నాకు ఎందుకు అప్పుడే చెప్పలేదు?” “నా భర్త పూజ, అనుష్టానం చేస్తే దాని గురించి చెప్పేదాన్ని. కాశీకి తీర్థయాత్రకు వెళితే దాని గురించి చెప్పేదాన్ని. మహాస్వామి వారు గొప్ప పీఠాధిపతులు. వారి సాన్నిధ్యంలో ఈ విషయాలను ఎలా చెప్పగలను? అంతేకాక నా భర్త గురించిన ఈ చేదు నిజాన్ని ఎలా చెప్పుకోగలను?”. “అతను బాగా సంపాదిస్తాడా?” “అవును, ఆయన గుత్తేదారు. మేము చాలా మంచి స్థితిలో ఉన్నాము”. “పిల్లలు?” “మాకు ముగ్గురు పిల్లలు” “తనవద్ద డబ్బు ఉండడంవల్లే కదా తాగుతున్నాడు? తనవద్ద డబ్బు ఉండడంవల్లే కదా తాగుతున్నాడు? తనవద్ద డబ్బు ఉండడంవల్లే కదా తాగుతున్నాడు?” అని మూడుసార్లు అడిగారు స్వామివారు. “ఒక దొన్నెను కానీ గిన్నెను కానీ తీసుకునిరండి” అని స్వామివారు ఆదేశించడంతో నేను తీసుకునివచ్చాను. స్వామివారు కాస్త తీర్థప్రసాదాన్ని ఆ ఆకుదొన్నెలో పోసి, కొన్ని బిల్వాలు కూడా వేశారు. “తీర్థాన్ని తలపై ప్రోక్షించి, బిల్వాన్ని నోటిలో ఉంచు! నీకు మంచి కలుగుతుంది!” నేను ఆమె వెంట వెళ్ళాను. అతను అపస్మారక స్థితిలో పడున్నాడు. తీర్థాన్ని తలపై చల్లి, బిల్వాన్ని నోటిలో వుంచాను. అతను నిద్రనుండి మేల్కొన్నట్టుగా ఒళ్ళువిరుచుకుని లేచి కూర్చుని “ఎవరితను?” అని అడిగాడు. “వీరిని పరమాచార్య స్వామివారు పంపారు” “నేను కొద్దికాలం మలేషియా సింగపూరులో ఉన్నాను, అప్పుడు నాకు ఈ దురలవాటు కలిగింది” అన్నాడు ఆ వ్యక్తి. ఆ దంపతులను ఆశీర్వదించి మకాంకు చేరుకున్నాను. అప్పటినుండి అతని సంపాదన తగ్గిపోయింది. స్థిరాస్థి వ్యాపారంలో అయిదు పదివేలు గిట్టుబాటురాకుండా ఏమీ చేసేవాడు కాదు. అటువంటిది ఇప్పుడు రూపాయి కూడా రావట్లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆమె కూడా నిరక్షరాస్యురాలు కావడంతో పిల్లలను చదివించి పోషించడానికి చాలా కష్టపడింది. ఇంట్లో ఫోను వంటి విలాసవస్తువులు ఏవీ లేవు. వాళ్ళకున్న ఆస్తంతా టి.నగర్ లో ఉన్న ఇల్లు ఒక్కటే. అతను ఆ ఇంటిని ఒక ముస్లిం వ్యక్తి వద్ద తాకట్టు పెట్టి కొంత ధనం తీసుకున్నాడు. అది దాదాపు ముప్పైవేల రూపాయలు అయ్యింది. అప్పు ఇచ్చిన వ్యక్తికి ముగ్గురు భార్యలు, నలుగురు కుమారులు. ఒకరోజు ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఆ ముస్లిం వ్యక్తి తన నలుగురు కుమారులు మరియూ కొందరు గూండాలతో ఇంట్లోకి ప్రవేశించి, ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి ఇంట్లో ఉన్న సామాను మొత్తం బయట వేయసాగారు. ఏం చెయ్యాలో తోచక ఆమె బయటకు వెళ్ళి రోడ్డులో నిలబడింది. ఎవరో తెలియని ఒక పెద్దాయన ఆమె వద్దకు వచ్చి, “నేను కూడా ఈ వీధిలోనే ఉంటాను కానీ నేనెప్పుడూ నిన్ను ఇలా రోడ్డుపై చూడలేదు. ఏమైంది తల్లి?” అని అడిగారు. విషయం తెలుసుకుని వెంటనే పాండీ బజార్ పోలీస్ స్టేషనుకు వెళ్ళగానే వెంటనే రెండు వాహనాల్లో పోలీసులు వచ్చారు. అప్పటికి ఆ అప్పిచ్చిన వ్యక్తి పూజగదిలో ప్రవేశించి, పరమాచార్య స్వామివారి పాదుకలను తీసుకుని బయటకు విసిరివేయబోతుండగా, పోలీసు లాఠీతో వెనుకనుండి ఒక్క దెబ్బ వేసేటప్పటికి వాటిపై చేతులు ఉంచాడు. పోలీసులు వాళ్ళందరినీ పట్టుకుని చట్టవిరుద్ధంగా ఇంట్లోకి ప్రవేశించి, ఒంటరి మహిళను ఇబ్బంది పెట్టినందుకు బెయిలు కూడా రానివిధంగా లోపలేశారు. ఆ రోజు అతణ్ణి, అతని పిల్లలను కూడా కలవడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీ అరుళ్ ఎవరికీ భయపడని నిజాయితీ గల పోలీసు అధికారి. ఎటువంటి ఒత్తిళ్ళకు రాజకీయ ప్రలోభాలకు తలొగ్గేవాడు కాదు. కోపంతో రగిలిపోయాడు. “నువ్వు నీ మతంలో మంచి నడవడిక గురించి చెబుతావు. మరి నువ్వు చేస్తున్నది సరైనదేనా? నీ అప్పు తిరిగి తీసుకోవాలన్నా లేదా ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవాలన్నా చట్టం ద్వారా వెళ్ళు. చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుని గూండాలను వెంటేసుకుని వెళ్ళి, పట్టపగలు ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా దౌర్జన్యం చెయ్యడం సరికాదు. చట్టప్రకారం వెళ్ళి ఇంటిని స్వాధీనం చేసుకో. నువ్వు ఇలా ఇంట్లోకి జొరబడడానికి చట్ట ప్రకారంగా ఏదైనా అనుమతి ఉందా? మీ మతంలో ఎంతో గొప్పగా చెప్పుకునే దయ ఎక్కడుంది? ఆమె తనంతట తానుగా వచ్చి నిన్ను విడుదల చెయ్యమని కోరితే తప్ప నిన్ను వదలను” అతను బాగా డబ్బున్న వ్యక్తి. అతని భార్యలు ఐ.జి. ని వేడుకున్నారు. కానీ వాళ్ళందరినీ నాలుగు రోజులపాటు కేవలం జైలులో ఇచ్చే గంజినీళ్ళతో అక్కడే ఉంచారు. చివరకు అతని భార్యలు ఆమె దగరకు వెళ్ళి పోలీసులతో మాట్లాడమని ప్రాధేయపడ్డారు. “నువ్వు మాకు తల్లి వంటి దానివి. మా పిల్లలు నాలుగు రోజులుగా ఏమీ తినలేదు. కొద్దిగా దయ చూపు. మాకు డబ్బు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అమ్మా!” అని వేడుకున్నారు. “నాకు ఈ విషయాలేమీ తెలియవు. మీవాళ్ళు ఏమీ తప్పుగా ప్రవర్తించలేదు. మేము మీకు అప్పు ఉన్నాము, ఇది నిజం. కానీ జరిగిన సంఘటనలు నాకు చాలా బాధను కలిగిస్తున్నాయి” అని చెప్పి వాళ్ళతోపాటు వెళ్ళి, వాళ్ళు బయటకు రావడానికి సహకరించింది. విషయం కోర్టుకు వెళ్ళిది. ఆమె భర్తకు ఎటువంటి రాబడి లేదు. “డబ్బు ఉండడంవల్లే కదా అతను ఇలా తయారయ్యాడు” అని స్వామివారు అడగడంలో ఉన్న ఆంతర్యం బహుశా ఇదేనేమో! పరమాచార్య స్వామివారు హగరిలో మకాం చేస్తున్నప్పుడు ఒకరోజు నాకు ఫోను వచ్చింది. ఏదో పనిమీద శ్రీకంఠన్ బయటకు వెళ్ళాడు. నేను వెళ్ళి ఫోను మాట్లాడి వచ్చేదాకా కాస్త స్వామివారిని కనిపెట్టునివుండమని వేదపురికి చెప్పాను. నేను ఫోను మాట్లాడడానికి వెళ్ళానని స్వామివారితో చెప్పవద్దని వేదపురికి చెప్పాను. స్వామివారు “బాలుని పిలువు నాకు ఒక గ్లాసు నీరు కావాలి” అని వేదపురిని అడిగారు. స్వామివారు వేదపురితో తీసుకోరు. వేదపురి నన్ను పిలవకపోవడంతో స్వామివారు మరలా ఆజ్ఞాపించారు. ఇక తప్పని పరిస్థితుల్లో “ఫోను రావడంతో మాట్లాడడానికి బయటకు వెళ్ళాడు” అని స్వామివారికి చెప్పేశాడు. కేవలం కొద్ది నిముషాలే నేను బయటకువెళ్లినప్పటికీ నేను వచ్చిన వెంటనే “నీకు ఫోను వచ్చిందా?” అని అడిగి నేను సమాధానం చెప్పేలోపే “మరి ఆమె ఫోనులో ఏమి చెప్పింది?” అని అడిగారు స్వామివారు. ఇంకోరోజులో టి.నగర్ లో ఉన్న వాళ్ళ ఇల్లు వేలానికి రాబోతోంది. అదే విషయాన్ని నేను స్వామివారికి చెప్పాను, “వారు డబ్బు కట్టకపోవడంతో మరునాడు ఇంటిని వేలం వేస్తున్నారు” “మనం ఏమి చెయ్యగలం? నావద్ద డబ్బు లేదు, నీవద్ద డబ్బు లేదు. ఇక్కడ ఎవర్నీ అడగను కూడా, అడగలేము. నేను సన్యాసిని, డబ్బు అడగరాదు. న్యాయవాది నాగరాజ అయ్యర్ ని పిలువు”. నాగరాజ అయ్యర్ మద్రాసు నుండి స్వామివారి దర్శనానికి వచ్చారు. పిలవగానే స్వామివారి సన్నిధికి వచ్చారు. “బాలు నీతో ఒక విషయం చెబుతాడు” అన్నారు స్వామివారు. మొత్తం నాగరాజయ్యార్ గారికి చెప్పాను. “అది అసంభవం, అది ఎలా చెయ్యగలం? అయిదు వేలో పది వేలో ఇచ్చి మరికొంత సమయం కావాలని అడగవచ్చు, అంతే. కానీ స్టేఆర్డర్ కుదరని పని” “ఛీ . . . వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో” మూడుమార్లు అన్నారు స్వామివారు. “నాకు జ్ఞానం ఇవ్వడానికి వచ్చావా? సహాయం కోసం అడిగితే కేవలం జరిగిన సంఘటన గురించి మాట్లాడుతావా! ఎటువంటి లాయర్ నువ్వు?”. “ఎందుకు స్వామివారు నాతో కోపంగా ఉన్నారు?” ఏమీ సహాయం చెయ్యలేనని ఆయన వెళ్ళిపోయారు. అలా ఆరోజు గడిచిపోయింది, మరుసటిరోజు శనివారం. మరలా నాకు ఫోను రావడంతో నిన్నటిలాగే స్వామివారిని కనిపెట్టుకుని ఉండమని వేదపురికి చెప్పి, ఈ విషయాన్ని స్వామివారికి చెప్పి వారిని ఇబ్బంది పెట్టవద్దని చెప్పాను. స్వామివారు అప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. లేవగానే యథాప్రకారంగా బాలుని పిలవమని చెప్పారు. “బాలుకు ఫోను వచ్చింది. మీకు చెప్పవద్దని చెప్పాడు, కానీ చెప్పాను. కనుక నేను చెప్పానని బాలుకి చెప్పాలి” “నువ్వు నాకు చెప్పావు కాబట్టి, నువ్వు చెప్పావని నేను చెప్పాలి అంతేకదా!” “స్వామివారు చెప్పకూడదు”. “బాలు నీకు చెప్పవద్దు అని చెప్పాడు, కానీ నువ్వు చెప్పావు. కనుక నేను ఖచ్చితంగా నువ్వు చెప్పావని చెప్పాలి” ఇలా ఇద్దరూ వాదలాడుకుంటూ ఉండగా నేను వచ్చాను. ఆమె ఫోనులో, “పటికబెల్లం, పళ్ళు, ఎండు ద్రాక్ష ఎక్కువగా తీసుకుని స్వామివారికి సమర్పించి, నా తరుపున నమస్కారాలు తెలియచేసి, “ఇల్లు వేలానికి సిద్ధంగా ఉంది మరియూ మీ భక్తురాలు తినడానికి కూడా అవకాశం లేక రోడ్డున పడింది” అని చెప్పమని చెప్పింది”. నేను స్వామివారికి విషయం చెప్పగానే, “ఏమిటిది? ఆమె నన్ను అంతగా తూలనాడిందా? ఏమని చెప్పింది?” అని అడిగారు. ఆమె వ్యంగంగానే చెప్పింది కాబట్టి నేనేమీ ఎక్కువగా చేసి చెప్పలేదు. అందుకనే “తన బాధను వెళ్ళబోసుకుంది” అని అక్కడితో వదిలేసి, వేలం విషయం చెప్పాను స్వామివారితో. “ఒక్క నిముషం, ఈరోజు ఏ వారం? శనివారం కదూ? ఈరోజు వేలం జరిగితే అది చెల్లుబాటు కాదు. దానికి ఒక విధానం ఉంది. రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటు ఎదుట ఇరువైపు వారు నలుగురు సాక్షులతో హాజరయ్యి, వారి పరస్పర అంగీకారం తెలపాలి. కార్యాలయానికి ఈరోజు సెలవు. రేపు ఆదివారం. అంటే సోమవారం దాకా ఏమీ చేయలేము. సోమవారం ఉదయం మొదటి కేసుగా ఉదయం ఏడింటికల్లా కేసు రిజిస్టర్ చెయ్యాలి. ఇంటిని విడిపించడానికి డెబ్బైఅయిదు వేల రూపాయలు ధరావతు చెల్లించాలి. ఆ ఇల్లు కోట్ల రూపాయలు విలువ చేస్తుంది, వేలంలో పెట్టిన మొత్తం కంటే ఎక్కువే. అది మరొక ముఖ్య విషయం. రామానుజానికి ఫోనుచేసి అన్నీ చూడమను” రామానుజం అయ్యంగారుకు ఫోనుచేసి మొత్తం విషయం అంతా చెప్పాను. “ఏంటి బాలు, నేను వృత్తిరీత్యా న్యాయవాదిని, రోజూ కోర్టుకు వెళ్తుంటాను కానీ నాకు కూడా ఈ విషయాలు ఏవీ తెలియవు. అసలు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను. పరమాచార్య స్వామివారు ఏ న్యాయవాద కళాశాలలో చదివారు? బి. ఎల్. పట్టా ఎక్కడ పుచ్చుకున్నారు? అసలు ఇంత క్లిష్టమైన విషయాన్ని ఎంత తేలికగా పరిష్కరించారు” అని ఫోనులోనే దాదాపు ఏడ్చేశారు. సోమవారం రామానుజం కోర్టుకు వెళ్ళి కేసు రిజిస్టరు చేసి, శనివారం జరిగిన వేలం చెల్లదని, ఆ ఇల్లు వేలంలో నిర్ణయించిన మొత్తం కంటే ఎంతో ఎక్కువన్న కారణాలు చూపించి వేలాన్ని రద్దు చేసేట్టుగా ఉత్తర్వులు పొందారు. అప్పు కింద కొంత మొత్తాన్ని ధరావత్తుగా కట్టి వేలం జరగకుండా స్టే ఆర్డర్ సంపాదించారు. ఆ ఇల్లు ఇక ఎప్పటికీ వేలానికి వెళ్ళలేదు. ఆ కుటుంబం ఇప్పటికీ అక్కడే నివసిస్తోంది. పిల్లలు పెద్దవారై మంచి స్థితిలో ఉన్నారు. పరమాచార్య స్వామివారి నుండి ఆమె తీసుకుని వెళ్ళిన పాదుకలను ఆమె ఉంచిన స్థానం నుండి ఇక ఎప్పటికీ ఎన్నటికీ కదలవు. --- శ్రీమఠం బాలు మామ, “ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్” పరమాచార్య అనుభవాల సంగ్రహం 2 *అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం* *శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*
Image from అంతర్యామి: *వేలంపాట ఆగిపోయింది*  పరమాచార్య స్వామివారి భక్తురాలైన ఒక యువతి తరచుగా ...

Comments