
అంతర్యామి
June 20, 2025 at 10:31 AM
సాయి శరణం... బాబా శరణం...
*🌷దేహ సంబంధము పెంచుకున్నదేగాని, సహజమైనది కాదు🌷*
కర్మ దాటుటకు వశముకాదు. అంతా భగవత్సంకల్పమే! దేహములో గల ఈ అనుబంధములను పురస్కరించుకొని సుఖ, దుఃఖములను, ఆనందమును అనుభవిస్తున్నాడు మానవుడు. ఈ దుఃఖములు, ఆనందములు తాను పెంచుకున్నవే! ఇవి సహజముగా లభించినవి కావు. దీనికి ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి 25 సం||లు బిడ్డడు వున్నాడు. తాను 25 సం||లు తల్లి ప్రేమను, జీవితములో సుఖములు అనుభవించి కట్టకడపటికి మరణించాడు. ఆ దుఃఖము తల్లి హృదయములో నాటుకొని జీవితమంతయు వుంటుంది. ఇంకొక కుమారుడు పుట్టిన రెండు గం॥లకే మరణించాడు. దానికి కూడను ఒక దినము ఏడ్చింది. 25 సం||లు వయస్సుగల వ్యక్తి తన కుమారుడే, మరియు రెండు గం॥లలో చనిపోయిన బిడ్డ కూడా తన కుమారుడే! 25 సం॥లు బిడ్డ చనిపోతే జీవితమంతయూ తలచుకొని ఏడుస్తుంది. కాని రెండు గం॥లు జీవించిన బిడ్డ చనిపోతే ఆ రోజుతో మరచిపోయింది. ఈ వ్యత్యాసము ఎందుకొచ్చింది? ఇద్దరూ తన బిడ్డలే! 25 సం||ల వరకు ఆ దేహముతో బంధము పెంచుకున్నది. కేవలము రెండు గం||లే యీ బిడ్డతో బంధమున్నది. కాబట్టి, దేహ సంబంధము పెంచుకున్నదే కాని సహజమైనది కాదు. కనుక, యీ దేహ బంధము చేతను, సంబంధబాంధవ్యము చేతను, అనుబంధము చేతను మనము బంధింపబడుతున్నాము. కాని, 'ఎవరికి వారే యమునా తీరే'. కాబట్టి నా కుమారుని కర్మ ఆ విధముగా పోయింది. నా కర్మ ఈ కుమారుని వలన ఏడ్చవలసి వచ్చింది. అతడు చావటానికి అతని కర్మ, నేను ఏడ్చటానికి నా కర్మ. పాము చంపవలసివచ్చింది కాబట్టి పాము కర్మ. ఏఏ కర్మను అనుసరించి ఆయా కాయములు వచ్చినవి. యీ విధముగా ఆ తల్లి ఆ వేటగానికి బోధపరిచింది. కనుక, ఓ ధర్మరాజా! యీ కథను నీవు చక్కగా విన్నావా, సామాన్యమైనటువంటి. గృహిణి కర్మఫలము గురించి అర్థము చేసుకుంది. నీవు ధర్మస్వరూపుడవు, నీవు రాజు కావలసినటువంటి వాడవు. నీకు కర్మఫలము పైన విశ్వాసము లేకుండాపోతున్నది. ఇంక దైవముపైన ఏ విధముగా విశ్వాసము కలుగుతుంది? అందువలననే నీవు కృష్ణుని సందేహిస్తున్నావు. నీ అవసరానికి బట్టి కృష్ణుని వుపయోగపెట్టుకున్నావు. నీ అవసరము తీరిపోయిన తరువాత కృష్ణుని దూరము చేసుకుంటున్నావు. కృష్ణుని దూరము చేసుకుంటివా, నీకు జీవితమంతా అపజయము అయిపోతుంది. కనుక. 'సర్వ కర్మ భగవత్ ప్రీత్యర్థం' అని అతనికి అర్పితము చేయి" అని బోధించాడు భీష్ముడు. ఇంకా "సుఖములందునూ, దుః ఖములందునూ, విజయమునందునూ, అపజయమునందునూ, లాభమునందునూ, నష్టమునందునూ నీవే తప్ప ఎవరూ లేరని, అతనిని వదలకు. కృష్ణుడు ఎవరని నీవు భావిస్తున్నావు? సాక్షాత్తూ విష్ణుస్వరూపము. నీతో ఆడి, పాడియుండటముచేత నీవు అతనిని సామాన్యునిగా భావించవద్దు. అతని యొక్క సర్వజ్ఞత్వము, సర్వ శక్తితత్త్వము, సర్వ వ్యాపకతత్త్వము నాకు తెలుసును. నీవు స్వార్ధాన్ని అలవరచుకుంటున్నావు. అతను ఏమి చెప్పితే అది చెయ్యి. అతని అడుగుజాడలలో నీవు నడచుకో" అని చెప్పాడు. యీ విధముగా బోధించేటప్పటికి, ధర్మజుని హృదయము కరిగిపోయినది. "పితామహా! కృష్ణుని ఆజ్ఞను నేను ఉల్లఘించటములేదు. కాని, నేను చేసినటువంటి పాపములు నాకు కళ్లకు కట్టినట్టుగా కనపడుతున్నాయి. ఆనాడు 'అశ్వత్థామ హతః కుంజరః' అని కృష్ణుడు చెప్పమని చెప్పినప్పుడు నేను విన్నాను. అది తప్పని నాకు తెలుసు. కాని, కృష్ణుని ఆజ్ఞను తిరస్కరించకూడదని భావించాను. యీనాడు కృష్ణుని ఆజ్ఞను వీడుతున్నానంటే ఇది నా ప్రారబ్ధము. కృష్ణుని ఆజ్ఞను వీడాలని లేదు. కాని ఇంతమంది పెద్దలను చంపి ఏ విధముగా రాజ్యము ఏలాలనే బాధ నన్ను పీడిస్తున్నాది. అంతా కర్మమయమే అని తెలుసుకున్నాను. కాబట్టి నేను మీ ఆజ్ఞ ప్రకారము కృష్ణుని మాట మీదుగా నడచుకుంటాను. కానీ కృష్ణుడే నాకు పట్టాభిషేకము చేయాలి" అని కృష్ణునికి శరణాగతి అయ్యాడు. 'కృష్ణా! నీ ఆజ్ఞను వినకుండా, భీష్ముని ఆజ్ఞను శిరసావహించానంటే నాలోన దేహభ్రాంతి యుంటుండాది. దేహభ్రాంతి కలిగియున్నటువంటివాడు భగవంతుని ఆజ్ఞను ఉల్లంఘిస్తాడు', అని కృష్ణుని యెదుట తన ఆవేదనను వెళ్లబోసుకున్నాడు. కృష్ణుని ఆజ్ఞను శిరసావహించి, ధర్మజుడు రాజ్య పట్టాభిషేకము చేసుకుంటాడు.
(తేదీ 04-05-1988న భగవాన్ శ్రీ
సత్యసాయిబాబావారి దివ్యోపన్యాసము నుండి..)
